ప్రముఖ మెసేజింగ్ యాప్ టెలిగ్రామ్‌ను భారత్‌లో నిషేధించే దిశగా అడుగులు పడుతున్నాయి. మోసాలు, జూదం వంటి క్రిమినల్ చర్యలకు ఈ యాప్‌ను వినియోగిస్తున్నారని పెద్ద ఎత్తున ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో హోం, ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ శాఖ సహకారంతో ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ (ఐ4సీ) విచారణ చేపట్టింది. టెలిగ్రామ్‌లో అక్రమ కార్యకలాపాలు సహా ఐటీ నిబంధనలను అనుసరిస్తుందా? ఒకవేళ నిబంధనలకు విరుద్ధంగా పని చేస్తుందా? అనేది నిర్దారించింది. ఒకవేళ ఆరోపణలు వాస్తవమని తేలితే టెలిగ్రామ్ యాప్‌ను నిషేధించే అవకాశం ఉంది.
దేశంలో 5 మిలియన్లకుపైగా వినియోగదారులు ఉన్న టెలిగ్రామ్ యాప్‌ను నిషేధించడాన్ని తోసిపుచ్చలేమని ఓ అధికారి తెలిపారు. అయితే ఇది దర్యాప్తుపై ఆధారపడి నిర్ణయం ఉంటుందని చెప్పారు. మానవ అక్రమ రవాణా, డ్రగ్స్, ఉగ్రవాదం, మోసాలు, సైబర్ బెదిరింపులు వంటి ఆరోపణలతో టెలిగ్రామ్ వ్యవస్థాపకుడు, సీఈఓ పావెల్ దురోవ్ అరెస్టయిన మూడు రోజుల్లోనే ఈ పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం. దురోవ్‌ను పారిస్ సమీపంలోని ఓ విమానాశ్రయంలో ఫ్రెంచ్ అధికారులు ఆదివారం అరెస్టు చేసిన విషయం తెలిసిందే. మెసేజింగ్ యాప్ విధానాలు.. నేర కార్యకలాపాలను నిరోధించడంలో విఫలమయ్యాయని అధికారులు ఆరోపించారు.
తప్పుడు సమాచారం వ్యాప్తి, చట్టవిరుద్ధమైన కార్యకలాపాలపై గతంలోనే పలు విమర్శలను విమర్శలను టెలిగ్రామ్ ఎదుర్కొంది. ఇటీవలి UG-NEET పేపర్ లీక్ అంశంలో దీని పాత్రను సీబీఐ గుర్తించింది. మెడికల్ ఎంట్రన్స్ టెస్ట్ పేపర్‌ను ప్లాట్‌ఫారమ్‌లో విస్తృతంగా షేర్ చేసి, ఒక్కోదాన్ని రూ.5,000 నుంచి రూ.10,000 వరకు విక్రయించినట్టు తేలింది.
ఈ ఆరోపణలను ఎదుర్కొంటున్నప్పటికీ.. భారతీయ చట్టాలకు అనుగుణంగా తమ యాప్ ఉందని టెలిగ్రామ్ పేర్కొంది. ఐటీ చట్టం నిబంధనల ప్రకారం ఒక నోడల్ ఆఫీసర్, చీఫ్ కంప్లైయన్స్ ఆఫీసర్‌ను నియమించి, నెలవారీ నివేదికలను వెల్లడిస్తోంది. అయినప్పటికీ భారత్‌లో దీని భౌతిక ఉనికి లేకపోవడం టెలిగ్రామ్‌తో వ్యవహరించడంలో ప్రభుత్వానికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. చిన్నారులకు సంబంధించిన అశ్లీల కంటెంట్‌ను తొలగించాలని గత అక్టోబరులోనే టెలిగ్రామ్‌తో పాటు ఇతర సోషల్ మీడియా సంస్థలకు ఐటీ శాఖ నోటీసులు జారీచేసింది.
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…