ఫిబ్రవరిలోనే మళ్లీ ఎన్నికలు ?

By KTV Telugu On 12 December, 2023
image

KTV TELUGU :-

తెలంగాణలో ఎన్నికల యుద్ధం ముగిసింది.  కానీ మళ్లీ ప్రారంభమయింది. ఇదే అసలు ట్విస్ట్. జమిలీగా జరగాల్సిన అసెంబ్లీ ఎన్నికలను కేసీఆర్ 2018లో ఆరు నెలల ముందుకు జరపడంతో ఇప్పుడు ఆయన ఆరు నెలల పదవీ కాలాన్ని ముందుగానే కోల్పోయారు. అంతేనా… ఎన్నికల తర్వాత ఎన్నికలను ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తోంది. పార్లమెంట్ ఎన్నికలు షెడ్యూల్ ప్రకారం మార్చి , ఏప్రిల్ లో విర్వహించాల్సి ఉంది. కానీ ఇప్పుడు ఫిబ్రవరిలోనే నిర్వహించడానికి కేంద్రం సన్నాహాలు చేస్తోందని విస్తృతంగా ప్రచారం జరుగుతోంది.

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. భారతీయ జనతా పార్టీ మూడు రాష్ట్రాల్లో గెలిచింది. కాంగ్రెస్ ఒక్క రాష్ట్రంతో సరి పెట్టుకుంది. అయితే ఈ ఎన్నికలు సెమీ ఫైనల్సే. ఫైనల్స్ మరో మూడు నెలల్లోనే ఉన్నాయి. అవి సార్వత్రిక ఎన్నికలు. అయితే ఒక నెల ముందే ఎన్నికలు పెట్టే ఆలోచనలో కేంద్ర ఎన్నికల సంగం ఉందని.. దీనికి బీజేపీ మద్దతు కూడా ఉందని జోరుగా ప్రచారం ప్రారంభమయింది.  ఇలా పెట్టే అవకాశం ఉందని చెప్పుకోవడానికి రాజకీయ పరమైన , నిర్వహణ పరమైన కారణాలు స్పష్టంగా కనిపిస్తూనే ఉన్నాయి.

టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఎన్నికలు ఏప్రిల్ లో ఉంటాయని తీరిగ్గా  ప్రిపేర్ కావొద్దని  ఫిబ్రవరిలోనే ఉండవచ్చని పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి.  గతంలోనూ చంద్రబాబు ముందుగానే ఎన్నికలు వస్తాయని ప్రకటించారు. ఇప్పుడు కూడా అదే చెప్పారు.  చంద్రబాబు చెప్పారని కాదు కానీ.. ప్రస్తుత పరిస్థితుల్ని అంచనా వేస్తే కేంద్రం ఒక నెల ముందుగానే పోలింగ్ పూర్తి చేయాలన్న ఆలోచనలో ఉందని అర్థమవుతుంది.

కేంద్ర ఎన్నికల సంఘం సార్వత్రిక ఎన్నికల కోసం దాదాపుగా పూర్తి చేసింది. రిటర్నింగ్ ఆఫీసర్లను నియామకం దగ్గర్నుంచి ఈవీఎంలను నియోజకవర్గాలకు చేర్చడం వరకూ అన్ని పూర్తయిపోయాయి. పార్లమెంట్ ఎన్నికలతో పాటు ఆంధ్రప్రదేశ్, ఒడిషా వంటి రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలుకూడా జరగాల్సి ఉంది. వాటికీ ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇక ఎన్నికల నిర్వహణకు చివరి సన్నాహం అయిన ఓటర్ల జాబితాను అప్ డేట్ చేసే ప్రక్రియ కూడా ఊపందుకుంది.   పోలింగ్ కేంద్రాల మార్పులు, చేర్పులు, ఓటర్ల ఫొటోల మార్పుల కోసం ఈ నెల 20 నుంచి జనవరి 5 వరకు కేంద్ర ఎన్నికల సంఘం అవకాశం కల్పించింది. 2024 జనవరి 6న ముసాయిదా ఓటర్ల జాబితా, జనవరి 8న తుది ఓటర్ల జాబితా ప్రకటించనున్నారు. 2024 జనవరి ఒకటో తేదీ వరకు 18 ఏళ్లు నిండిన వారంతా ఓటరుగా నమోదు చేసుకోవాలని ఎన్నికల సంఘం వెల్లడించింది. అంటే జనవరి మొదటి వారం కల్లా పూర్తి స్థాయిలో ఓటర్ జాబితాలు రెడీ అయిపోతాయన్నమాట. ఇక ఎన్నికల సన్నాహాలు పూర్తయినట్లే. ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయడానికి రెడీగా ఉన్నట్లే.

2019 సార్వత్రిక ఎన్నికలకు మార్చి పదో తేదీన షెడ్యూల్ విడుదల అయింది. మొత్తంగా ఎనిమిది విడతల్లో పోలింగ్ జరిగింది. జూన్ లో కౌంటింగ్ జరిగింది. ఇంత సుదీర్ఘమైన ప్రక్రియపై విమర్శలు వచ్చాయి. అందుకే ఈ సారి ఎన్నికల సంఘం.. నాలుగైదు విడతల్లోనే పూర్తి చేయాలని అనుకుంటున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. దీనికి బీజేపీ కూడా అనుకూలంగానే ఉందంటున్నారు. బీజేపీ ఇప్పుడు జోష్ మీద ఉంది. మూడు హిందీ రాష్ట్రాల్లో విజయంతో హిందీ బెల్ట్ లో తిరుగులేదని మరోసారి నిరూపతమయిందని.. ఆ వేడి తగ్గక ముందే ఎన్నికలకు వెళ్తే ఎలా ఉంటుందా అని  బీజేపీ పెద్దలు ఆలోచిస్తున్నారని అంటున్నారు.  . బీజేపీ పెద్దలు ఈ విషయంలో సీరియస్ గా ఆలోచిస్తున్నారని కూడా ఢిల్లీ వర్గాల్లో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది.వాతావరణ పరంగా..   విద్యా సంవత్సరం చివర పరీక్షలను డిస్టర్బ్ చేయకుండా  ఎన్నికలు నిర్వహిస్తున్నామని ప్రజలకు చెప్పుకునే అవకాశం కూడా ఉంటుందని అంచనా వేస్తున్నారు.

ఫిబ్రవరిలోనే ఎన్నికల ప్రక్రియ పూర్తి చేసి.. మార్చి లేదా ఎప్రిల్ నాటికి పూర్తి చేయడానికి పాలనా పరమైన కొన్ని ప్లస్ పాయింట్స్ కూడా ఉన్నాయని చెబుతున్నారు. ఫిబ్రవరిలో ప్రారంభిస్తే.. ఎండలు ముదిరే అవకాశం ఉండదు. అదే సమయంలో  వివిధ రకాల పరీక్షలకు ముందే ప్రక్రియ పూర్తయిపోతుంది. అదే మార్చిలో షెడ్యూల్ ఇస్తే.. పరీక్షలు కూడా ఎఫెక్ట అవుతాయి సాధారణంగా దక్షిణాదిలో మొదటి విడతలోనే ఎన్నికలు పెట్టేస్తారు. గత ఎన్నికల్లో  మొదటి విడతలోనే ఎన్నికలు జరిగాయి. మార్చి పదోతేదీన ఎన్నికల షెడ్యూల్ వస్తే ఏప్రిల్ మొదటి వారంకల్లా పోలింగ్ పూర్తయిపోయింది. కౌంటింగ్ కోసం రెండు నెలలు ఆగాల్సి  వచ్చింది. అందుకే్.. పిబ్రవరిోల పెడితే.. ఓ వైపు ఎండల నుంచి రక్షణ.. మరో వైపు విద్యార్థుల పరీక్షలకు ఇబ్బంది లేకుండా పనిపూర్తి చేయవచ్చని అనుకుంటున్నారు.

తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ పార్టీలు ఫిబ్రవరి ఎన్నికలకే రెడీ అవుతున్నాయి. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు ఇప్పుడే ముగిశాయి. గెలిచిన పార్టీకి కాస్త అడ్వాంటేజ్ ఉంటుంది. అసెంబ్లీ టిక్కెట్ల ఖరారు సమయంలోనే పార్లమెంట్ అభ్యర్థుల్ని దాదాపుగా ఖరారు చేసుకున్నారు. పైగా అధికారంలో ఉంది కాబట్టి.,. సన్నాహాలు మామూలుగానే ఉంటాయి. ఇక బీఆర్ఎస్, బీజేపీకూడా ఎక్కువ ఆలస్యం ఉండకూడదని.. ఎంత తొందరగాపూర్తయిపోతే అంత మంచిదని అనుకుంటున్నాయి. ఇక ఏపీలో ఎన్నికలపై ..  టీడీపీ, జనసేన కూటమి పూర్తిగా సిద్ధమయింది. జగన్మోహన్ రెడ్డి కూడా వైసీపీని సిద్ధం చేస్తున్నారు. అభ్యర్థుల ఎంపిక కసరత్తును కూడా ఓ కొలిక్కి తెచ్చారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. ఫిబ్రవరిలోనే ఎన్నికల షెడ్యూల్ వచ్చినా అన్ని పార్టీలు రెడీగా ఉన్నట్లే అనుకోవచ్చు.

సాధారణంగా ఇలాంటి నిర్ణయాలు ఎన్నికల సంఘం తీసుకోవాలి.  ప్రభుత్వ పదవి కాలం ఆరు నెలలు ఉన్న సమయంలోఎన్నికల సన్నాహాలు ప్రారంభించి…   చట్టసభల గడువు తీరిపోయేలోపు కొత్త సభను ఎన్నికయ్యేలా చూడాలి. ఇప్పుడుఆరు నెలల గడువు వచ్చేసినందున.. ప్రభుత్వ ప్రమేయం ఉండదు. ఎన్నికలు ఎప్పుడు పెట్టాలన్నది ఎన్నికల సంఘం నిర్ణయం.  కానీ  మన దగ్గర ఎన్నికల సంఘం కేంద్రం కనుసన్నల్లో నడుస్తుంది కాబట్టి… ఎన్నికలు బీజేపీ ఎప్పుడనుకుంటే అప్పుడే పెట్టే అవకాశం ఉంది.

దేశంలో ప్రతి చోటా ఏదో ఓ రాష్ట్రంలో ప్రతి ఏడాది ఎన్నికల హడావుడి ఉంటూనే ఉంది. తెలుగు రాష్ట్రాలకు మాత్రం…  ఐదేళ్లకు ఓ  సారి ఏడాది పాటు ఈ ఎన్నికల వాతావరణ ఏర్పడుతుంది. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో అదే ఉంది. జూన్ వరకూ మారదు…

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి