వెంకన్నకు ద్రోహం చేసిందెవ్వరూ…!

By KTV Telugu On 20 September, 2024
image

KTV TELUGU :-

తిరుమల తిరుపతి దేవస్థానం…టీటీడీ కొత్త వివాదంలో ఇరుక్కుపోయింది. సీఎం చంద్రబాబు చేసిన ఒక ఆరోపణ మాజీ సీఎం జగన్ పై కాకుండా టీటీడీ పాలనా తీరుపై కూడా అనుమానాలకు తావిస్తోంది. ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడం ఒక వంతయితే.. దేవుడి గుడిలో జరిగే వ్యవహారాలపై సామాన్య భక్తులకు అనుమానం వచ్చే విధంగా తాజా పరిణామాలు ఉన్నాయి. ముందే జగన్ హయాంలో హిందూ దేవాలయాలపై దాడులు, వాటి స్థాయిని తగ్గించడం లాంటి చర్యలకు దిగారన్న ఆరోపణలున్నాయి. జగన్ ఒక కన్వర్టెడ్ హిందూ అన్న జోకులు పోయి… మాజీ సీఎం తీరుపై తీవ్ర అనుమానాలు కలిగాయి. పైగా హిందూ దేవాలయాల దగ్గర అన్యమత ప్రచారం జరుగుతోందన్న ఆరోపణలు వచ్చాయి. అయితే జగన్ తో తమకున్న అవసరాలు, చంద్రబాబును దిగ్గొట్టాలన్న కోరికతో కేంద్రంలో అధికారం చెలాయిస్తున్న హిందూ జాతీయ పార్టీ బీజేపీ మౌనం వహించిందన్న వాదనా ఉంది. జగన్ ఎన్ని తప్పులు చేస్తున్నా.. మోదీ ఆయన్ను వెనుకేసుకొస్తున్నారని విపక్షాలు వ్యాఖ్యానించాయి…

తాజాగా చంద్రబాబు ఒక ఆరోపణ చేశారు. అది అట్లాంటి ఇట్లాంటి ఆరోపణ కాదు. ప్రతీ హిందువు మనోభావాలు దెబ్బతినే ఆరోపణ. చంద్రబాబు చెప్పింది నిజమే అయితే ఏపీలో ఒక్క హిందువు కూడా జగన్ ను క్షమించడని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు అసలు విషయానికి వస్తే ….చంద్రబాబు మాటల్లోనే చెప్పాలంటే..“తిరుమ‌ల ప్ర‌సాదాన్ని గ‌త ప్ర‌భుత్వం అప‌విత్రం చేసింది. నెయ్యికి బ‌దులు ఆనిమల్ ఫ్యాట్ వాడార‌ని తెలిసింది. మేము స్వ‌చ్ఛ‌మైన నెయ్యిని వాడుతున్నాం” అని కామెంట్స్ చేశారు.దీనితో పెద్ద దుమారమే రేగింది. చంద్రబాబు ఒక ప్రకటన చేసిన గంటల్లోనే మారుమూల పల్లెల్లో కూడా తిరుమల లడ్డూ ప్రసాదాలపై చర్చ మొదలైంది. నిజంగానే ఆనిమల్ ఫ్యాట్ అంటే జంతువుల కొవ్వు వాడుంటే లడ్డూ తిన్న తమ పరిస్థితేమిటని జనం ప్రశ్నించుకోవడం మొదలు పెట్టారు. దీనితో జగన్ హయాంలో టీటీడీ ఛైర్మన్లుగా పనిచేసిన ఇద్దరు వ్యక్తులు చంద్రబాబు వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. “తిరుమ‌ల ప్ర‌సాదంపై చంద్ర‌బాబు చేసిన వ్యాఖ్య‌లు అత్యంత దుర్మార్గం. మ‌నిషి పుట్టుక పుట్టిన వారెవ్వ‌రూ కూడా ఇలాంటి ఆరోప‌ణ‌లు చేయ‌రు” అని వైవీ సుబ్బారెడ్డి తీవ్ర‌స్థాయిలో మండిప‌డ్డారు.“శ్రీ వేంకటేశ్వరస్వామి దివ్యక్షేత్రం తిరుమల ప్రసాదాలపై చంద్ర‌బాబునాయుడు చేసిన ఆరోపణలు అత్యంత దుర్మార్గం. రాజకీయ లబ్ధికోసం, రాజకీయ స్వార్థకోసం భగవంతుడ్ని వాడుకుంటే.. అలాంటి ఆరోపణలు చేసినవాడ్ని భగవంతుడు క్షమించడు. తిరుమలలో అన్నప్రసాదాలు తయారు చేసే విషయంలో అధికారులకు ఎలాంటి ప్రమేయం ఉండదు. పవిత్రమైన శ్రీ వైష్ణవుల అమృత హస్తాలమీదుగా ఈ పదార్థాలు తయారవుతాయి. ప్రసాదాల్లో పదార్థాల వినియోగం వారి చేతులమీదుగా ఉంటుంది. అలాంటి వారి హస్తాల మీదుగా తయారయ్యే ప్రసాదాలమీద చంద్రబాబు ఆరోపణలు చేస్తున్నాడంటే.. ఆయన బురద రాజకీయాలకు పరాకాష్ట” అని భూమ‌న క‌రుణాక‌ర‌రెడ్డి మండిప‌డ్డారు.

ఎవరు నిజం చెబుతున్నారు. ఎవరు దొంగ నాటకం ఆడుతున్నారన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్న. ఐదేళ్లపాటు తిరుమలలో జరిగిన అవినీతి అక్రమాలపై పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలని రాష్ట్ర బీజేపీ నేతలు ఇప్పటికే పలు మార్లు డిమాండ్లు చేస్తున్నారు. కూటమిలో భాగమైనప్పటికీ బీజేపీ కేంద్ర నాయకత్వం ఒక్క సారి కూడా దానిపై కామెంట్ చేయలేదు. తాజా వివాదంలోనైనా స్పందిస్తుందో లేదో చూడాలి. గత ప్రభుత్వం నిజంగా తప్పు చేసి ఉంటే.. దాన్ని బయట పెట్టేందుకు పకడ్బందీ విచారణ అవసరం. తాము ఎలాంటి తప్పు చేయలేదనే వైసీపీ చెప్పుకుంటుంది. అందుకే నిజానిజాలు తెలిసేందుకు ఇప్పుడు ఒక్కటే మార్గం ఉంది. కేంద్ర దర్యాప్తు సంస్థ అంటే సీబీఐ చేత టీటీడీ లడ్డూ వ్యవహారాన్ని విచారణ చేయించాలి. అసలు సంగతేంటో నిగ్గు తేల్చాలంటే సీబీఐ విచారణకు చంద్రబాబు సిఫార్సు చేయాలి, అందుకు కేంద్రప్రభుత్వం వెంటనే పచ్చజెండా ఊపాలి. చూడాలి మరి ఇప్పుడు ఏం జరుగుతుందో….

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి