రెండుగా చీలిన అమెరికా ట్రంప్ వైపా? కమల వైపా?

By KTV Telugu On 25 July, 2024
image

KTV TELUGU :-

అమెరికా అధ్యక్ష రేసు నుంచి బైడెన్ ఇప్పటికే తప్పుకున్నారు. అధ్యక్ష పదవి అభ్యర్థిగా కమలా హారిస్‌ని కూడా బలపరిచారు. అమెరికా చరిత్రలోనే ఇదో అరుదైన పరిణామం. ఎందుకంటే.. అధికారంలో ఉండి పోటీ నుంచి తప్పుకున్న తొలి వ్యక్తిగా చరిత్రకెక్కాడు. అయితే.. డెమొక్రాట్ల ఒత్తిడితోనే బైడెన్ పోటీ నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది. ఇక.. డొనాల్డ్ ట్రంప్‌ని ఈసారి ఢీకొట్టబోయేది కమలా హారిసేననే చర్చ అమెరికాలో గట్టిగా వినిపిస్తోంది. కాల్పుల ఘటన తర్వాత.. ట్రంప్ విజయావకాశాలు మరింత పెరిగాయనే వార్తలు కూడా వస్తున్నాయి.

అయితే.. ఇక్కడ గమనించాల్సిన పాయింట్ మరొకటుంది. బైడెన్ పోటీ నుంచి తప్పుకున్నట్లు ప్రకటించిన తర్వాత.. కమలా హారిస్ రెండు పాయింట్ల స్వల్ప ఆధిక్యంతో.. ట్రంప్‌పై పైచేయి సాధించినట్లు రాయిటర్స్ జరిపిన ఎన్నికల సర్వేలో తేలింది. మున్ముందు ఇదే కంటిన్యూ అయితే.. డెమొక్రాట్లు, రిపబ్లికన్ల మధ్య టగ్ ఆఫ్ వార్ తప్పదనే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇదే సమయంలో.. కమలా హారిస్ గెలిచే చాన్స్ ఉందా? ఆమెకున్న బలాబలాలేటి? బలహీనతలేంటి? అనే దానిపై చర్చ మొదలైంది. బైడెన్ ప్రకటన వెలువడగానే ఆమె రియాక్ట్ అయ్యారు. పార్టీని ఐక్యంగా ఉంచేందుకు తాను చేయాల్సిందంతా చేస్తానని చెప్పారు. ట్రంప్‌ని, అతని ప్రాజెక్ట్ – 2025 అజెండాను ఓడించేందుకు.. దేశాన్ని ఐక్యం చేసేందుకు తాను సిద్ధమని చెప్పారు.

అసలేంటి ప్రాజెక్ట్ 2025? అంటే.. మితవాద నిరంకుశుల అజెండా. ట్రంప్ అధికారంలోకి వస్తే.. దీనిని కచ్చితంగా అమలు చేసి తీరతారనే ప్రచారం ఉంది. దీన్ని జనంలోకి తీసుకెళ్లాలని డెమొక్రాట్లు ప్రయత్నిస్తున్నారు. ట్రంప్‌ని దెబ్బకొట్టే అస్త్రం కూడా ఇదే అంటున్నారు. అయితే.. అది అంత ఈజీ కాదు. ఇప్పటికే.. జో బైడెన్ ప్రతిష్ట దిగజారింది. దాని ఎఫెక్ట్ కమలా హారిస్ పైనా పడుతుంది. ఇక.. ఊపు మీదున్న ట్రంప్ మద్దతుదారులు కూడా దీనిని బాగా ప్రచారం చేసే అవకాశముంది. పోటాపోటీగా ఉన్న పెన్సిల్వేనియా, జార్జియా, అరిజోనా వంటి రాష్ట్రాల్లో.. టీవీ ప్రకటనల కోసం 50 లక్షల డాలర్లను కుమ్మరించేందుకు సిద్దంగా ఉన్నారు. అదే విధంగా అబార్షన్ల వంటి అంశాలపై ఆమె అభిప్రాయాల మీద రెచ్చగొట్టే అవకాశం ఉంది. కమలా హారిస్‌ తల్లి భారతీయ మూలాలున్న మహిళ, తండ్రి ఆఫ్రికన్‌. అందువలన మనదేశంలోని వారు మనమ్మాయి అన్నట్లుగా ప్రచారం చేసుకున్నా అమెరికాలో ఆమెను ఒక ఆఫ్రికన్‌గానే చూస్తారు. శ్వేతజాతి అహంకారం ఉన్న అమెరికాలో దాన్ని కూడా ముందుకు తీసుకురావచ్చు. ఇలాంటి పరిస్థితుల మధ్య, వేగంగా మారుతున్న పరిణామాల మధ్య ట్రంప్, కమలా హారిస్‌లో.. ఎవరిది పైచేయి అవుతుందన్నది ఆసక్తిగా మారింది.

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి