పిట్టగూటిలో ఉద్యోగాలు హుష్ కాకి.. ఎలన్ మస్క్ మార్క్

By KTV Telugu On 24 February, 2023
image

ప్రపంచ కుబేరుడు ఎలక్షన్ మస్క్ ట్విట్టర్ ఖాతా సొంతం చేసుకున్నప్పటి నుంచి అనూహ్య మార్పులు చోటుచేసుకుంటున్నాయి. పిట్టగూటిలో కొందరి ఉద్యోగాలు పిట్టల్లా రాలిపోతున్నాయి. గతేడాది చివరిలో ఇక నుంచి ఎలాంటి కోతలుండబోవని మస్క్ చెప్పారు. కానీ ఆయన కోతలరాయుడని తేలిపోయింది. ఎవరినీ తొలగించనని చెప్పిన ఆయన ఆ తర్వాత రెండుసార్లు ఉద్యోగులపై వేటు వేశారు. తాజాగా మరికొందరిని ఇంటికి పంపిచే పనిలో పడ్డారు. పై స్థాయి ఉద్యోగులతోపాటు దిగువస్థాయి సిబ్బందిలోనూ సమూలంగా మార్పులు చేర్పులు చేస్తున్నారు. ఆ సంస్థ సీఈవో పరాగ్‌ అగర్వాల్‌ను ఇంటికి పంపించేసి తానే సీఈవో బాధ్యతలు చేపట్టారు కూడా. కీలక సభ్యులతో పాటు చాలా మంది ఉద్యోగాలను ఊడబెరికారు. మరికొందరి జీతాల్లో కోత విధించారు.

గత వారం సేల్స్‌, ఇంజినీరింగ్‌ విభాగంలో పని చేస్తున్న ఉద్యోగులను తొలగించారు. దీనిపై కొందరు ఉద్యోగులు నేరుగా ఎలాన్‌ మస్క్‌కే ఫిర్యాదు చేశారట. సంస్థ ఆదేశాల మేరకు ట్విటర్‌ యాడ్స్ కోసం పని చేస్తున్నా తమను ఉద్యోగం నుంచి తొలగిస్తున్నారని ఆయనతో మొరపెట్టుకున్నారట. ఈ విషయాలను అమెరికాకు చెందిన వర్జే న్యూస్‌వెబ్‌సైట్‌ వెల్లడించింది. తాజా పరిస్థితులపై గతంలో ట్విటర్‌లో మానిటైజేషన్‌ మేనేజర్‌గా విధులు నిర్వహించిన మార్సిన్‌ ట్విటర్‌ వేదికగా స్పందించారు. ట్విటర్‌ యాడ్స్‌కు ఓ పరిష్కారం కనుకొనాలంటే కనీసం రెండుమూడు నెలలు పడుతుందని చెప్పారు. మస్క్ చెప్పినట్టు వారంలో అద్యయనంచేయడం సాధ్యం కాకపోవచ్చని అభిప్రాయపడ్డారు. మరోవైపు ట్విటర్‌ యాడ్స్‌, మానిటైజేషన్‌ ఇన్‌ఫ్రాలో పని చేస్తున్న వారంతా ఎంతో అనుభవశీలురని వెనకేసుకొచ్చారు.

ట్విటర్‌లో అనసవరమైన అభ్యంతరకరమైన ప్రకటనలు వస్తుండటంపై ఎలాన్‌ మస్క్‌ ఇటీవల యూజర్లకు క్షమాపణలు చెప్పారు. ఈ సమస్యను వీలైనంత త్వరగా పరిష్కరించేందుకు సత్వర చర్యలు తీసుకుంటానని అన్నారు. గూగుల్‌ సెర్చ్‌ మాదిరిగా ట్విటర్‌లోనూ యూజర్‌ టాపిక్స్‌, కీవర్డ్స్‌ ఆధారంగా ప్రకటనలు కనిపించేలా మార్పులు తీసుకొస్తామని చెప్పారు. ఈ క్రమంలోనే ఉద్యోగులపై మరింత భారం పెడుతున్నట్లు తెలుస్తోంది. యాడ్స్‌ విషయంలోనే ఆ విభాగ మాజీ అధిపతి బ్రూస్‌ ప్లాక్‌, ఎలాన్‌ మస్క్‌ మధ్య ట్విటర్‌ వేదికగా ఇటీవల మాటల యుద్ధం జరిగింది. ఇలా మస్క్ పిట్టగూటిలో దూరినప్పటి నుంచి సంస్థ మార్పుల విషయంలోనూ ఉద్యోగులను తొలగించడం లాంటి అనేక విషయాల్లో వైరల్ అయిపోతున్నారు.