విమానంలో మూత్ర విసర్జన కేసులో 30 లక్షలు జరిమానా

By KTV Telugu On 20 January, 2023
image

విమానంలో తోటి మహిళపై మరో ప్రయాణికుడు మూత్ర విసర్జన చేసిన వివాదం లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఎయిరిండియాపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ కఠిన చర్యలు తీసుకుంది. రూ.30 లక్షల జరిమానా విధించింది. ఈ సంఘటనను సంబంధిత అధికారులకు రిపోర్ట్‌ చేయని విమాన పైలట్‌ ఇన్ కమాండ్‌ లైసెన్స్‌ను మూడు నెలలపాటు రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. తన డ్యూటీ సక్రమంగా చేయడంలో విఫలమైన ఎయిరిండియా డైరెక్టర్ ఇన్ ఫ్లైట్ సర్వీసెస్‌కు కూడా రూ.3 లక్షల జరిమానా విధించింది డిజీసీఎ.

గత సంవత్సరం నవంబర్‌ 26న న్యూయార్క్‌ నుంచి ఢిల్లీ వస్తున్న ఎయిర్‌ ఇండియా విమానంలో డెబ్బై ఏళ్ల మహిళపై శంకర్ మిశ్రా అనే వ్యక్తి మద్యం మత్తులో మూత్ర విసర్జన చేయడం తీవ్ర దుమారం రేపింది. ఈ ఘటనపై బాధితురాలు విమాన సిబ్బందికి ఫిర్యాదు చేసినా వారు పట్టించుకోలేదు. శంకర్‌ మిశ్రా తమ విమానాల్లో ప్రయాణించకుండా కేవలం 30 రోజులు నిషేధం విధించి ఆయన్ను పంపించేశారు. దీంతో ఆ బాధితురాలు న్యాయం కోసం ఎయిర్‌ ఇండియా గ్రూప్‌ చైర్మన్‌ ఎన్‌.చంద్రశేఖరన్‌కు లేఖ రాశారు.

ఆయినా స్పందన లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో ఈ విషయంలో వెలుగులోకి వచ్చింది. ఎయిర్‌ ఇండియా యాజమాన్యం తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ ఘటన బయటకొచ్చిన తరువాత శంకర్‌ మిశ్రా చాలా రోజులు తప్పించకుని తిరిగారు. చివరకు ఆయన్ను బెంగుళూరలో అరెస్టు చేసి కోర్టులో ప్రవేశపెట్టారు. అయితే తాను ఆ మహిళపై మూత్ర విసర్జన చేయలేదని ఆవిడే చేసుకుందని వాదించారు. ఈ వివాదం నేపథ్యంలో అమెరికాకు చెందిన ఆర్థిక సేవలందించే మల్టీ నేషనల్‌ కంపెనీలో వైస్‌ ప్రెసిడెంట్‌ హోదాలో పనిచేస్తున్న శంకర్‌ మిశ్రాను ఆ కంపెనీ ఉద్యోగంలో నుంచి తొలగించింది. ప్రస్తుతం కోర్టులో మూత్ర విసర్జన కేసు విచారణ కొనసాగుతోంది.