అమెరికా అధ్యక్ష ఎన్నికల రేసులో భారత సంతతి యువకుడు

By KTV Telugu On 23 February, 2023
image

భారతీయులు భారత సంతతి వ్యక్తులు ప్రపంచ దేశాల్లో తమ ప్రతిభా పాటవాలు చాటుతున్నారు. ఇప్పటికే పలుదేశాలకు భారతీయ సంతతి వ్యక్తులు నాయకత్వం వహిస్తున్నారు. గూగుల్‌, మైక్రోసాఫ్ట్‌ వంటి ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన పలు దిగ్గజ సంస్థలకు భారతీయులు సీఈవోలుగా పని చేస్తున్నారు. ఈమధ్యే బ్రిటన్ ప్రధానిగా భారత సంతతికి చెందిన రుషి సునాక్ ఎంపికయిన సంగతి తెలిసిందే. అలాగే అమెరికా ఉపాధ్యక్షురాలిగా కూడా భారతీయ మూలాలున్న కమలా హ్యారీస్ వ్యవహరిస్తున్న విషయం కూడా అందరికీ తెలుసు.

ఇక ఇప్పుడు మరో భారతీయ సంతతికి చెందిన యువకుడు వచ్చే సంవత్సరం జరగనున్న అమెరికా అధ్యక్ష పదవికి పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. రిపబ్లికన్‌ నేత, ప్రముఖ వ్యాపారవేత్త వివేక్ రామస్వామి యుఎస్‌ ప్రెసిడెంట్‌ ఎలక్షన్‌లో పోటీచేయనున్నట్టు ప్రకటించారు. ఫాక్స్ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రామస్వామి ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించారు. అమెరికా ఆదర్శాలను తిరిగి పునరుద్దరించేందుకు అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్లు ఆయన తెలిపారు. చైనా నుంచి ఎదురవుతున్న ముప్పును ఎదుర్కోవడంతో పాటు ఆ దేశంపై ఆధారపడటాన్ని తగ్గిస్తానని వెల్లడించారు.

విశేషం ఏమిటంటే భారత సంతతి మహిళ రిపబ్లికన్ పార్టీ సభ్యురాలు నిక్కీ హేలీ కూడా అధ్యక్ష ఎన్నికల బరిలో దిగబోతున్నట్లు ఇదివరకే ప్రకటించారు. ఆమె తర్వాత ఈ ప్రకటన చేసిన రెండో భారత సంతతి నేత వివేక్.
మరోవైపు రిపబ్లికన్ పార్టీ తరపున డోనాల్డ్‌ ట్రంప్‌ రెండో సారి అధ్యక్ష పదవికి పోటీ పడుతున్నారు. ఇంకోవైపు అదే పార్టీ నుంచి నిక్కీ హేలీ, ఫ్లోరిడా గవర్నర్ రాన్ డెసాంటిస్, ట్రంప్ హయాంలో ఉపాధ్యక్షుడిగా పని చేసిన మైక్ పెన్సే తదితరులు కూడా పోటీకి సై అంటున్నారు. ఇప్పుడు ఆ జాబితాలో వివేక్ రామస్వామి చేరారు. వివేక్‌ రామస్వామి ఒహాయోలో 1985 ఆగస్టు 9న జన్మించారు. ఆయన వయస్సు 37 ఏళ్లు. ప్రస్తుతం ఓహియోలో స్థిరపడ్డారు. రామస్వామి తల్లిదండ్రులు కేరళకు చెందినవారు. హార్వర్డ్‌, యేల్ యూనివర్సిటీల్లో విద్యాభ్యాసం చేశారు. 2014లో రోవాంట్ సైన్సెస్‌ బయోటెక్ సంస్థను స్థాపించిన రామస్వామి పలు వ్యాధులకు ఔషధాలను రూపొందించారు. 2016లో ఫోర్బ్స్‌ గణాంకాల ప్రకారం ఆయన ఆస్తుల విలువ 600 మిలియన్‌ డాలర్లు. దీంతో 40 ఏళ్లలోపు వయస్సున్న సంపన్నుల్లో ఒకరిగా గుర్తింపు పొందారు.