వ్యూహం ..ప్రతివ్యూహం

By KTV Telugu On 1 January, 2024
image

KTV TELUGU :-

రాజకీయ సినిమాలు రాజకీయాలను ప్రభావితం చేస్తాయా? పొలిటికల్ బయోగ్రఫీలు  ఎన్నికల్లో ఓటర్లను ప్రభావితం చేస్తారా?  అంటే ఔను అని చెప్పడానికి ఆధారాలు లేవు. కాకపోతే ఎన్నికలకు ముందు మాత్రం  రాజకీయ సినిమాలు రావడం   తెలుగురాష్ట్రాల్లో కొత్త కాదు. తాజాగా  సంచలన దర్శకుడు రాం గోపాల వర్మ దర్శకత్వం వహించిన వ్యూహం సినిమా కోర్టు బోనులో నిలబడింది. ఈ సినిమాలో తమ ప్రతిష్ఠ దెబ్బతీసే దృశ్యాలు ఉన్నాయని  సినిమా విడుదల కాకుండా  ఆపాలంటూ టిడిపి నేతలు  కోర్టుకెక్కారు. కాంగ్రెస్  నాయకత్వాన్ని అవమానించేలా ఉందని ఆ పార్టీ నేతలూ పిటిషన్ వేశారు. న్యాయస్థానం వ్యూహం సినిమా విడుదలకు బ్రేక్ వేసింది. జనవరి 11లో గా  సెన్సార్ కు సంబంధించిన వివరాలు  సమర్పించాలని ఆదేశించింది.

వ్యూహం సినిమా ట్రెయిలర్లు కొద్ది రోజులుగా సోషల్ మీడియాని ఊపేస్తున్నాయి. వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ అధినేత ఏపీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడి  ముఖ్యమంత్రి పీఠం అధిరోహించే క్రమాన్ని  ఆధారం చేసుకుని రాం గోపాల్ వర్మ ఈ సినిమా తీసినట్లు చెప్పారు. అయితే ఇందులో   టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు.. ఆయన తనయుడు లోకేష్ లపై అభ్యంతర కర సన్నివేశాలు  ఉన్నాయని టిడిపి ఆరోపిస్తోంది. అందుకే ఈ సినిమాకి అసలు సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వకూడదని టిడిపి  డిమాండ్ చేసింది.  డిసెంబరు 29న సినిమా విడుదల కావలసి ఉండగా టిడిపి హైకోర్టును ఆశ్రయించి సినిమా విడుదలను అడ్డుకుంది. చంద్రబాబు నాయుడితో పాటు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీని  విలన్ గా  చిత్రీకరించి ఆమెను కించపరిచారన్నది   కాంగ్రెస్ నేతల వాదన.

వ్యూహం సినిమాలో ఏముందో  ఎవరికీ తెలీదు. చంద్రబాబును  ఏ షేడ్ లో వర్మ చూపించారో కూడా సినిమా విడుదల అయితేనే కానీ తెలీదు. అయితే సినిమా విడుదల అయితే ఎన్నికల ముందు టిడిపికి నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని టిడిపి నాయకత్వం భావిస్తోంది. అందుకే  కోర్టుకెక్కింది.  అయితే  దర్శకుడు రాం గోపాల్ వర్మ మాత్రం  భావ ప్రకటన స్వేచ్ఛను హరించకూడదని అంటున్నారు. సినిమా విడుదల కాకముందే..అందులో ఏముందో తెలీకుండానే సినిమాను ఆపాలంటూ  నినాదాలు చేయడం కరెక్ట్ కాదంటున్నారు వర్మ. పొలిటికల్ బయోపిక్స్ తీయడంలో రాంగోపాల్ వర్మ దిట్ట.అయితే వ్యూహం సినిమా మాత్రం వర్మ ఇంతకు ముందు తీసిన అన్ని సినిమాలకన్నా పవర్ ఫుల్ గా  ఉంటుందని చిత్ర నిర్మాణ బృందం అంటోంది.

2019 ఎన్నికలకు ముందు కూడా తెలుగు రాష్ట్రాల్లో   పొలిటికల్ బయోపిక్స్ లాంటి సినిమాలు వచ్చాయి.  నందమూరి బాలకృష్ణ తన తండ్రి..టిడిపి  వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారకరామారావు జీవిత కథను రెండు భాగాలుగా తీశారు. ఒకటి ఆయన సినీ జీవితానికి సంబంధించినది కాగా రెండోది ఆయన రాజకీయ జీవితానికి సంబంధించినది. అందులో ఎన్టీయార్ కు మొదటి సారి వెన్నుపోటు పొడిచే సమయంలో  కాంగ్రెస్ అధినేత్రి ఇందిరా గాంధీ పాత్రను చూపించారు. అప్పట్లో కాంగ్రెస్   నేతలు ఎవరూ ఈ సినిమాను ఆపాలని   డిమాండ్ చేయలేదు.   ఎన్టీయార్ పై తీసిన రెండు సినిమాలూ కూడా అట్టర్ ఫ్లాప్ అయ్యాయి. అదే సమయంలో దివంగత వై.ఎస్.ఆర్. జీవితంలోని కొన్ని ఘట్టాల ఆధారంగా   యాత్ర సినిమాని రూపొందించారు దర్శకుడు మహి. అది సంచలన విజయం సాధించింది.  అందులో వై.ఎస్.ఆర్. పాత్రలో మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి జీవించేశారు.

ఆ తర్వాత కూడా వర్మ పొలిటికల్ మూవీస్ తీశారు. కమ్మరాజ్యంలో కడప రెడ్లు తో పాటు లక్ష్మీస్ ఎన్టీయార్ , వంగవీటి మోహన రంగా,  పరిటాల రవి  జీవితం ఆధారంగం రక్త చరిత్ర రెండు బాగాలు తీశారు వర్మ. ఇంచుమించు అన్ని  సినిమాలూ  మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. నిర్మాతలకు లాభాలు తెచ్చిపెట్టాయి. కాకపోతే ఆ సినిమాల వల్ల ఏ రాజకీయ పార్టీకి అయినా ఏదైనా లాభం జరిగిందనడానికి ఆధారాలు లేవు. కాకపోతే  వర్మ దగ్గర ఓ ప్రత్యేకత ఉంది.  నిజజీవిత పాత్రలకు ఎంచుకునే నటులను మాత్రం ఎక్కడి నుంచి ఏరుకుని వస్తారో కానీ అచ్చం ఒరిజినల్  వ్యక్తుల్లానే ఉంటారు. ఉదాహరణకు ఎన్టీయార్, చంద్రబాబు నాయుడు, చిరంజీవి, పవన్ కళ్యాణ్ పాత్రలకు వర్మ ఎంపిక చేసిన నటులు అచ్చం అసలు నేతల్లోనే ఒరిజినల్ గా కనిపించారు తెరపై.

వ్యూహం సినిమా ని విడుదల చేయచ్చో  కూడదో హైకోర్టు న్యాయమూర్తులు జనవరి 11 తర్వాత చెబుతారు. అంత వరకు ఆ సినిమా గురించి ఏమీ మాట్లాడకుండా ఉండడమే ఉత్తమం. ఇక మరో బయోపిక్ సినిమా కూడా రెడీ అవుతోంది. అది ఏపీలో  అసెంబ్లీ ఎన్నికలకు ముందు విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయి. అది యాత్ర-2 సినిమా. యాత్ర వన్ తీసిన దర్శకుడే రెండో భాగాన్నీ తీస్తున్నారు. మొదటి భాగంలో  దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.ఆర్. హెలికాప్టర్ ప్రమాదంలో  మరణించే ఘటనతో ముగుస్తుంది. రెండో భాగంలో జగన్ మోహన్ రెడ్డి ఓదార్పు యాత్ర మొదలు పెట్టడం నుంచి ముఖ్యమంత్రి అయ్యే వరకు ఉండచ్చని అంటున్నారు.  ఈ సినిమాలోనూ టిడిపి, కాంగ్రెస్ నేతల పాత్రలు ఉండే అవకాశాలు ఉన్నాయి…

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి