మరి ఎన్టీఆర్ సంగతేంటి ?

By KTV Telugu On 12 February, 2024
image

KTV TELUGU :-

తెలుగు ఠీవీ పీవీ నరసింహారావుకు భారత రత్న ప్రకటించడంతో సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. అదే టైంలో మరో డిమాండ్ కూడా బలంగా వినిపిస్తోంది. అదే ఎన్టీఆర్‌కు భారత రత్న ఇవ్వాలనే నినాదం. సీనియర్ ఎన్టీఆర్‌ అభిమానులంతా సోషల్ మీడియా వేదికగా ఈ నినాదాన్ని గట్టిగానే వినిపిస్తున్నారు

ఈ ఏడాది కేంద్రప్రభుత్వం ఏకంగా ఐదుగురు ప్రముఖులకు భారతరత్న పురస్కారాలు ప్రకటించింది. సహజంగా ఏడాదికి ముగ్గురుకి మించి ఇవ్వకూడన్న సంప్రదాయాన్ని సైతం పక్కన పెట్టి ప్రధాని మోదీ ప్రత్యేకంగా చొరవ చూపించి మరీ ఈ సంవత్సరం ఐదుగురికి దేశ అత్యున్నత పురస్కారాన్ని ప్రకటించారు. మాజీ ప్రధానులు పీవీ నరసింహారావు, చరణ్‌సింగ్‌తో పాటు హరిత విప్లవ పితామహుడు ఎంఎస్‌ స్వామినాథన్‌కు కేంద్రం ‘భారతరత్న’ ప్రకటించడంతో ఇప్పటి వరకూ ఈ అత్యున్నత పౌర పురస్కారం అందుకున్నవారి సంఖ్య 53కు చేరింది. ఇందులో 2024లో ఏకంగా ఐదుగురిని ఈ అవార్డు వరించింది. బీజేపీ అగ్రనేత లాల్‌కృష్ణ ఆడ్వాణీ, బిహార్‌ మాజీ సీఎం కర్పూరీ ఠాకూర్‌లకు ఇటీవలే భారతరత్న ప్రకటించారు. ఒక ఏడాదిలో ఇంతమందిని ఎంపిక చేయడం ఇదే మొదటిసారి. ఇప్పటి వరకూ అత్యధికంగా 1999లో నలుగురు గ్రహీతలకు ప్రతిష్ఠాత్మక పురస్కారాన్ని అందించారు. చివరిసారిగా 2019లో ప్రణబ్‌ ముఖర్జీకి, మరణానంతరం భూపేంద్ర కుమార్‌ హజారికా, నానాజీ దేశ్‌ముఖ్‌కు భారతరత్న ప్రదానం చేశారు. 2020-23 మధ్యకాలంలో ఈ అవార్డును ఎవరికీ ఇవ్వలేదు. ఇదీ ఒక్క లేక్క…

తెలుగువారి ముద్దుబిడ్డ అయినా పీవీకి భారతరత్న ఇవ్వడం హర్షించదగిన పరిణామం. ప్రతీ ఒక్కరు కోరుకున్న అంశం. ఇంతవరకు నెరవేరని కల మరోకటి ఉంది. తెలుగువారి ఆత్మగౌరవాన్ని దశదిశలా చాటిన మాజీ సీఎం ఎన్టీఆర్ కు భారతరత్న పురస్కారం ఎప్పుడిస్తారన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్న. ప్రభుత్వం ఇకనైనా స్పందిచాలని తెలుగు ప్రజలు కోరుకుంటున్న తరుణం కూడా ఇదే…

పార్టీ పెట్టిన తొమ్మిది నెలల్లో ప్రభంజనం సృష్టించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అధికారాన్ని సాధించిన మహా నాయకుడు ఎన్టీఆర్. తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని దశదిశలా చాటిన మహనీయుడు ఎన్టీఆర్. రెండు రూపాయల కిలో బియ్యం నుంచి ఆయన అనేక చరిత్రాత్మక కార్యక్రమాలు  చేపట్టారు. సంక్షేమవాదిగా పేరుపొందారు. ప్రజల ఆర్థిక స్థితిగతులను మెరుగుపరిచేందుకు ప్రయత్నించారు. అలాంటి నేతకు భారతరత్న ఇవ్వాలన్న డిమాండ్ చాలా రోజులుగా వినిపిస్తోంది. ఢిల్లీ నుంచి గల్లీ దాకా జనం రోజువారీ ప్రశ్నిస్తూనే ఉన్నారు. ఐనా కేంద్రం పట్టించుకోలేదు. పీవీకి భారతరత్న ఇచ్చిన తర్వాతైనా ఎన్టీఆర్ ను పరిగణించాలని  మళ్లీ డిమాండ్ చేస్తున్నారు.  ఎన్టీఆర్‌కు భారత రత్న ప్రకటించాల్సిందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు సీనియర్ నటీ, రాజకీయ నాయకురాలు విజయశాంతి. ట్విటర్ వేదికగా పీవీకి భారత రత్న ఇవ్వడంపై స్పందించిన ఆమె… అదే గౌరవం ఎన్టీఆర్‌కు ఇవ్వాల్సిందని అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, నటుడిగా ప్రజలకు చేసిన సేవలను గుర్తు చేసుకొని భారతరత్న ప్రకటించి ఉంటే యావత్ తెలుగు జాతి మరింత పులకించిపోయేదన్నారు. రామారావుకి భారతరత్న పురస్కారాన్ని ప్రదానం చేసే అంశాన్ని కూడా పరిశీలించాలని ప్రధానమంత్రికి విజయవాడ ఎంపీ కేశినేని నాని రిక్వస్ట్ పెట్టారు. తెలుగు రాష్ట్రాలు, భారతీయ చలనచిత్రం, సమాజానికి ఆయన చేసిన విశేషమైన కృషి తరతరాలకు స్ఫూర్తినిస్తూనే ఉందన్నారు.  ఈ ప్రతిష్టాత్మక అవార్డుతో ఆయనను సత్కరించడం ఆయన వారసత్వానికి తగిన నివాళి అందించినట్టే అన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజల ఈ చిరకాల డిమాండ్‌ని దయచేసి పరిశీలించాలన్నారు.

ఎన్టీఆర్ కు భారతరత్న జాప్యం వెనుక కారణాలేమిటి. ఇది పెద్ద ప్రశ్నే. దానికి అనేక కథనాలు కూడా ప్రచారంలోకి వచ్చాయి. పెద్దాయనకు పురస్కారం ప్రకటిస్తే దాన్ని అందుకునేందుకు లక్ష్మీపార్వతి వస్తారన్న అనుమానంతోనే కొందరు అడ్డుకుంటున్నారని కొందరు  చేస్తున్న ప్రచారంలో నిజం లేదు. ఆయన కుమారులు, లేదా కుమార్తె మాత్రమే అందుకునే వీలుంటుందని స్పష్టమవుతోంది. అందరూ కలిసి డిమాండ్ చేస్తే ఎన్టీఆర్ కు భారతరత్న ప్రకటించడం కష్టమేమీ కాదని కూడా చెబుతున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో….

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి