హిండెన్‌బర్గ్ దెబ్బకు కుదేలైన అదానీ వ్యాపార సామ్రాజ్యం రోజు రోజుకు క్షీణించిపోతోంది. అదానీ వ్యక్తిగత సంపద 40 బిలియన్ డాలర్లకు తగ్గిపోయింది. రేపు ఎంత ఉంటుందో చెప్పడం కష్టం. అదానీ గ్రూప్‌పై రోజుకో ఆరోపణ వస్తోంది. అన్నీ తీవ్రమైనవే. రష్యా బ్యాంకుల నుంచి అప్పులు వికీపీడియా ను మ్యానిపులేట్ చేయడం వినోద్ అదానీ వ్యవహారాలు అన్నీ వరుసగా అదానీ గ్రూప్ ను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. నెల రోజుల వ్యవధిలోనే అదానీ గ్రూప్ కంపెనీలకు 12 లక్షల కోట్ల మేర మార్కెట్ సంపద కరిగిపోయింది. నివేదికకు ముందుతో పోలిస్తే సంపద 60 శాతానికి పైగా నష్టపోయింది. ఇప్పుడీ గ్రూప్ ఎలా నిలబడుతుంది ఇన్వెస్టర్లకు ఎలా న్యాయం చేస్తారన్నది ఇప్పుడు కీలకం.
అదానీ వ్యవహారం ప్రభావం భారత ఆర్థిక వ్యవస్థపై ఎంత మాత్రం ఉండదని రిజర్వు బ్యాంకు గవర్నర్ శక్తికాంత్ దాస్ ప్రకటించారు. తాము ఇంకా అప్పులు ఇస్తామని బ్యాంక్ ఆఫ్ బరోడా చైర్మన్ చెప్పుకొచ్చారు. అదానీ తమ షేర్ల విలువలను నిలబెట్టడానికి ప్రభుత్వం తరపున తీసుకుంటున్న చర్యలు ఇవేనని ఎక్కువ మంది నమ్ముతున్నారు. దేశంలో బ్యాంకు కుంభకోణాలు కొత్త కాదు. అలనాడు ముంద్రా కుంభ కోణం నుంచి హర్షద్ మెహతా స్టాక్ మార్కెట్ కుంభ కోణం వరకూ వరుసపెట్టి జాబితా విప్పితే బ్యాంకులను బురిడీ కొట్టించడంలో మన వాణిజ్య వేత్తలు mకార్పొరేట్ ప్రముఖులు ఎంతో ప్రావీణ్యాన్ని కలిగి ఉన్నారనే విషయం స్పష్టం అవుతుంది. అదానీ వ్యవహారం గురించి ప్రతిపక్షాలు లేవదీసిన ప్రశ్నలకు ప్రధానమంత్రి నరేంద్రమోడీ సూటిగా సమాధానం చెప్పలేదు.
అదానీ సంస్థల్లో స్టేట్‌బ్యాంకు జీవిత భీమా సంస్థ భారీగా పెట్టుబడులు పెట్టాయి. ఎల్ఐఐసీ పెట్టిన పెట్టుబడి నెగెటివ్ లోకి వెళ్లింది. యువత ఉపాధి కోసం లక్ష రూపాయిలు అప్పివ్వడానికి ఎన్నో ఆంక్షలు పెట్టే బ్యాంకులు కార్పొరేట్ రంగానికి వేల కోట్ల రూపాయిల రుణాలు ఎలా ఇస్తున్నాయన్న ప్రశ్న ఇలాంటి కుంభకోణాలు బయటపడినప్పుడల్లా సామాన్యులను వేధిస్తోంది. పార్టీలు వేరైనా ప్రభుత్వాలు మారినా ప్రభుత్వాలు పెద్దలకే తప్ప పేదలకు ఏమాత్రం తోడ్పడటం లేదన్నది తిరుగులేని వాస్తవం. ప్రభుత్వ విధానాలు అలా ఉన్నప్పుడు బ్యాంకులు మాత్రం ఏం చేస్తాయి. ఇప్పుడు కూడా ఎవరు బాధ్యులో నిగ్గు తేల్చాలని ప్రతిపక్షాలు పట్టు బడుతున్నాయి, సుప్రీంకోర్టు కమిటీ వేయడానికి సిద్ధమైంది. కానీ దర్యాప్తు సంస్థలు అనుకున్న విధంగా ముందుకు సాగడం లేదనేది అందరికీ తెలిసిన విషయం.
సెబీ విచారణ ప్రారంభించింది. కానీ ఇలా విచారణ ప్రారంభం కాక ముందే గౌతం అదానీ సెబీ చైర్మన్ ను కలిశారన్న ప్రచారం జరుగుతోంది. సెబీ మాత్రమే కాకుండా అంతకుముందు ఉన్న నియంత్రణ సంస్థలు సైతం కుంభకోణాల సూత్రధారుల చేతు ల్లో మోసానికి గురైన సంగతి మనకు తెలుసు. మనీ ల్యాండరింగ్ పేరిట ఇప్పుడు నమోదు చేస్తున్న కేసుల మాది రిగానే విదేశీ మారకద్రవ్య దుర్వినియోగ చట్టాన్ని ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకోవడానికి చట్టం ఉండేది. కానీ అధికారంలో ఉన్న నాయకులు ఆ చట్టాన్ని అస్మదీయులకు వర్తింపజేయకుండా కవచంలా కాపాడి న ఉదంతాలు ఎన్నో ఉన్నాయి. కానీ అవి దేశానికి ముప్పుగా మారుతున్నాయి. ఆర్థిక వ్యవస్థకు ఇబ్బందికరంగా మారుతాయి. ఇప్పటికిప్పుడు కేంద్రంతో పాటు దర్యాప్తు సంస్థలు చేయాల్సింది అదానీ విషయంలో నిజాలు బయట పెట్టి ఇన్వెస్టర్ల నమ్మకాన్ని పెంచడమే.