ఆధునిక పరిజ్ఞానం పొలాలదాకా వచ్చేసింది. కలుపు తీసే పనినుంచి నాట్లేసేదాకా కోతలనుంచి లోడింగ్‌దాకా అన్నీ యంత్రాలే చేస్తున్నాయి. సాంకేతికతను ఎవ్వరం ఆపలేంగానీ అది చివరికి మానవవనరుల అస్థిత్వాన్నే ప్రశ్నించే స్థాయికి ఎదగడమే ప్రమాదకరం. కృత్రిమమేథ సాంకేతికరంగంలో ఓపెను సంచలనం. ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్ సాంకేతిక రోజురోజుకీ కొత్తపుంతలు తొక్కుతోంది. చివరికిది ప్రపంచవ్యాప్తంగా 30 కోట్ల ఉద్యోగాలపై ప్రభావం చూపబోతోంది. అంతర్జాతీయ పెట్టుబడి సంస్థ గోల్డ్‌మన్ శాక్స్ ఈ అంచనాకొచ్చింది. ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్ సాంకేతికరంగంలో ఓకొత్త ఒరవడి. దీని ప్రభావం తీవ్రంగా ఉంది. ఎన్నో రంగాల్లో కృత్రిమమేథ మానవవనరులకు ప్రత్యామ్నాయంగా మారుతోంది. గోల్డ్‌మన్ శాక్స్ తాజా నివేదికలో ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ భవిష్యత్తులో 30 కోట్ల ఉద్యోగాలపై దీని ప్రభావం ఉండొచ్చని అంచనావేస్తోంది. అమెరికా యూరప్‌లలో మూడోవంతు ఉద్యోగాలు ఆటోమేషన్‌కు ప్రభావితమవుతాయని అంచనా. చాట్‌జీపీటీ వంటి మోడ్రన్ ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్ వ్యవస్థలు మానవుల మేథస్సుతో పోటీ పడుతున్నాయి. ఇది ఆహ్వానించదగ్గ పరిణామమే అయినా మనుషుల అవసరం లేని పరిస్థితి వస్తుందన్న భయాలయితే ఉన్నాయి.
జనరేటివ్ ఏఐ పురోగతి సమీప భవిష్యత్తులో ఉపాధి అవకాశాలపై తీవ్ర ప్రభావం చూపటం ఖాయమంటోంది గోల్డ్‌మన్ శాక్స్ నివేదిక. ఎక్కువగా అడ్మినిస్ట్రేషన్ న్యాయ రంగాల్లో దీని ప్రభావం ఉండొచ్చు. కార్యనిర్వహణ రంగంలో 46 శాతం లీగల్ ఉద్యోగాల్లో 44శాతం ముప్పు పొంచి ఉందని గోల్డ్‌మన్ శాక్స్ ప్రమాద ఘంటిక మోగిస్తోంది. నిర్వహణ రిపేర్ నిర్మాణ రంగ ఉద్యోగాలకు మాత్రం కృత్రిమమేథతో ప్రమాదం తక్కువేనన్న విశ్లేషణతో కొన్ని రంగాలు ఊపిరి పీల్చుకోవచ్చు.