గతమెంతో కీర్తి ఇప్పుడు అస్తిత్వ పోరాటం

By KTV Telugu On 22 April, 2023
image

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పాలనలో ఓ వెలుగు వెలిగిన సీనియర్లు ఇపుడు ఉనికి చాటుకోడానికి తంటాలు పడుతున్నారు. అందులో కొందరైతే చాలా కాలం తర్వాత హఠాత్తుగా తెరపైకి వచ్చి మేం ఇకపై చింపేస్తాం అంటున్నారు. కొన్ని కారణాల వల్ల ఇంతకాలం అజ్ఞాతంలో ఉన్నామే కానీ రాజకీయాలకు దూరం అయిపోలేదంటున్నారు. వారి యాక్షన్లు చూసి రాజకీయ విశ్లేషకులు కూడా విస్తు పోతున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ ఓ వెలుగు వెలిగింది. రాష్ట్ర విభజన అనంతరం కాంగ్రెస్ పార్టీ చావు దెబ్బ తినేసింది. ఆంధ్ర ప్రదేశ్ లో అయితే మొత్తానికే అడ్రస్ గల్లంతు అయిపోయింది. తెలంగాణాలో ఏదో ఉన్నాం అన్నట్లు నామమాత్రపు వెలుగుతో కాలక్షేపం చేస్తోంది.
2014లో రాష్ట్ర విభజన జరిగింది. అప్పట్నుంచీ వరుస ఎన్నికల్లో ఓటమి చెందిన కాంగ్రెస్ నేతలు ఏం చేయాలో పాలుపోక తమ తమ గ్రామాలకు పరిమితం అయిపోయారు. తోచిన వ్యాపకాల్లో బిజీగా ఉండిపోయారు. రాజకీయాల వైపు ఓరకంట కూడా చూడ్డం మానేశారు. అటువంటి వారు ఇపుడు హఠాత్తుగా ఖాదీ బట్టలు కట్టేసి రాజకీయ తెరపై మళ్లీ వెలిగిపోదామని అనుకుంటున్నారు.

కొద్ది రోజుల క్రితం ఉమ్మడి ఏపీ చివరి ముఖ్యమంత్రి కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కిరణ్ కుమార్ రెడ్డి ఢిల్లీలో మెరిసి బిజెపిలో చేరిపోయారు. చిత్తూరు జిల్లాకి చెందిన కిరణ్ కుమార్ రెడ్డి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. దివంగత వై.ఎస్.ఆర్ హయాంలో స్పీకర్ గానూ వ్యవహరించారు. అయితే వై.ఎస్.ఆర్ మరణానంతరం కాలం కలిసొచ్చి ఏకంగా ముఖ్యమంత్రి అయిపోయారు కిరణ్ కుమార్ రెడ్డి. ఆయన ముఖ్యమంత్రిగా ఉండగానే ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిపోయింది. దాంతో కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పిన కిరణ్ కుమార్ రెడ్డి జై సమైక్యాంధ్ర పార్టీ పెట్టారు. అయితే తన సొంత నియోజకవర్గంలో తన సోదరుని కూడా గెలిపించుకోలేకపోయారు. తన పార్టీపై నమ్మకం లేకనే కావచ్చు 2014 ఎన్నికల్లో ఆయన పోటీయే చేయలేదు. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఏపీలో భూస్థాపితం అయిపోవడంతో కిరణ్‌ కుమార్ రెడ్డి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఆ తర్వాత కొన్నేళ్లకి తిరిగి కాంగ్రెస్ లో చేరారు. ఏమైందో ఏమో కానీ అక్కడా యాక్టివ్ గా ఉండలేదు. కొద్ది వారాల క్రితమే కాంగ్రెస్ వదిలి బిజెపిలో చేరారు. ఇపుడు కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో కిరణ్ కుమార్ రెడ్డికి స్పెషల్ అసైన్ మెంట్ ఇచ్చింది బిజెపి నాయకత్వం. చాలా ఏళ్ల తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి కొద్ది పాటి బిజీగా ఉండేందుకు అవకాశం దక్కిందని రాజకీయ పండితులు అంటున్నారు. కర్నాటక ఎన్నికల్లో బిజెపి విజయం సాధిస్తే కిరణ్ కుమార్ రెడ్డి కాలర్ ఎగరేయచ్చు. లేదంటే ఆయన సత్తా ఏంటో బిజెపి నాయకత్వానికి అర్ధం కావచ్చు అంటున్నారు విశ్లేషకులు.

ఇక మరో సీనియర్ నేత రఘువీరా రెడ్డి. అనంతపురం జిల్లాకి చెందిన నీలకంఠాపురం రఘువీరారెడ్డి అనంతపురం జిల్లా మడకశిర నియోజకవర్గం నుండి మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన రఘువీరా రెడ్డి 2009లో కళ్యాణదుర్గం నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచారు. వై.ఎస్.రాజశేఖర రెడ్డికి అత్యంత ఆప్తుడైన రఘువీరారెడ్డి వై.ఎస్.ఆర్ కేబినెట్ లో వ్యవసాయ శాఖ మంత్రిగా వ్యవహరించారు. వై.ఎస్.ఆర్. మరణానంతరం ముఖ్యమంత్రులు అయిన రోశయ్య కిరణ్‌ కుమార్ రెడ్డిల మంత్రి వర్గాల్లోనూ రఘువీరా రెడ్డి మంత్రిగా ఉన్నారు. 2014 లో రాష్ట్ర విభజన వెంటనే జరిగిన ఎన్నికల్లో రఘువీరారెడ్డి ఓటమి చెందారు. ఆ తర్వాత 2019 ఎన్నికలకు ముందు పిసిసి అధ్యక్షుడిగానూ వ్యవహరించారు. ఆ ఎన్నికల్లో ప్రచార బాధ్యతను తన భుజ స్కంధాలపై పెట్టుకున్నారు రఘువీరారెడ్డి. అయితే వరుసగా రెండో ఎన్నికల్లోనూ ఏపీలో కాంగ్రెస్ పార్టీ బోణీ కొట్టలేకపోవడంతో నిరాశలో కూరుకుపోయారు. కాంగ్రెస్ పార్టీకీ రాజకీయాలకు గుడ్ బై చెప్పేసి తన స్వగ్రామానికే పరిమితం అయ్యారు. వ్యవసాయం చేసుకుంటూ ఊళ్లో నీలకంఠేశ్వర స్వామి ఆలయ నిర్మాణాన్ని పర్యవేక్షిస్తూ నాలుగేళ్లుగా కాలక్షేపం చేస్తున్నారు రఘువీరా రెడ్డి. కొద్ది నెలల క్రితం కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కర్నాటకలో పాదయాత్ర చేసినపుడు రఘువీరా రెడ్డి ఆ యాత్రలో పాల్గొని కొంతదూరం నడిచారు.

ఆ తర్వాత మళ్లీ గ్రామానికే పరిమితం అయ్యారు. ఎక్కడా రాజకీయాలు మాట్లాడలేదు. అటువంటి రఘువీరా రెడ్డి హఠాత్తుగా తాను క్రియాశీలక రాజకీయాల్లోకి తిరిగి ఎంట్రీ ఇస్తున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం కర్నాటక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపును బెంగళూరు సిటీకి రఘువీరా రెడ్డిని ఇన్ ఛార్జ్ గా ప్రకటించారు. కర్నాటకలో కాంగ్రెస్ విజయం కోసం కృషి చేస్తానన్నారు రఘువీరారెడ్డి. నాలుగేళ్లుగా గుడి నిర్మాణంలో ఉండిపోయిన తాను ఇటీవల రాహుల్ గాంధీపై అనర్హత వేటు పడ్డప్పుడు తనవంటి నాయకులు రాజకీయాలకు దూరంగా ఉండిపోవడం కరెక్ట్ కాదన్న భావనతోనే తిరిగి రాజకీయాల్లోకి రావాలని డిసైడ్ అయ్యానంటున్నారు. కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ విజయం కోసం పాటు పడ్డమే తన తక్షణ కర్తవ్యం అన్న రఘువీరా రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి మాత్రం మాట్లాడలేదు. కర్నాటక ఎన్నికల తర్వాత తన అనుచరులు అభిమానులతో భేటీ అయ్యి వారి సూచనలు ఎలా ఉంటే అలా నిర్ణయం తీసుకుంటానని మాత్రం అన్నారు రఘువీరా రెడ్డి. ఇక ఉమ్మడి ఏపీలో చివరి ఉప ముఖ్యమంత్రిగా వ్యవహరించిన దామోదర రాజనరసింహ కూడా డిటో.
ఆందోల్ నియోజకవర్గం నుండి మూడు సార్లు గెలిచిన దామోదర చివరి సారిగా 2009 ఎన్నికల్లో గెలిచారు. వై.ఎస్.ఆర్. కేబినెట్ లో మంత్రిగా ఉన్నారు. వై.ఎస్.ఆర్ మరణానంతరం ఆయన ఉప ముఖ్యమంత్రి అయ్యారు. రాష్ట్ర విభజన తర్వాత జరిగిన ఎన్నికల్లో దామోదర పరాజయం పాలయ్యారు. ఆ ఎన్నికల్లో దామోదర పై బి.ఆర్.ఎస్ అభ్యర్ధిగా బరిలో నిలిచిన సినీ నటుడు బాబూ మోహన్ విజయం సాధించారు.

ఆ తర్వాత 2018లో జరిగిన ఎన్నికల్లోనూ దామోదర రాజనరసింహ ఓటమి చెందారు. 2014 లో వచ్చిన ఓట్ల కన్నా 2018లో కొద్దిగా ఓట్లు ఎక్కువగా వచ్చినా కూడా బి.ఆర్.ఎస్. అభ్యర్ధి క్రాంతి కిరణ్ చేతిలో ఓడిపోయారు. రెండు వరుస ఎన్నికల్లో ఓడిపోవడం రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాలేకపోవడం. దేశంలోనూ కాంగ్రెస్ అవసాన దశలో ఉన్నట్లు బలహీనపడ్డంతో దామోదర రాజనరసింహ బాగా డీలా పడ్డారనే చెప్పాలి. ఏం చెప్పినా నిర్మొహమాటంగా మొహంమీద చెప్పేయడం ముక్కుసూటిగా పోవడం ఆయన స్టైల్. కాంగ్రెస్ పార్టీలో కోవర్టులు పెరిగిపోయారని పదే పదే అంటూ వచ్చారు దామోదర. పార్టీకి దూరం అవుతోన్న వర్గాలను దగ్గర చేసుకోవడంలో పార్టీ నాయకత్వం విఫలమవుతూ వస్తోందని దామోదర చెబుతూనే ఉన్నారు. అయితే ఎవరూ పట్టించుకోవడం లేదు. తాజాగా ఆయన వచ్చే ఎన్నికల్లో అయినా ఆందోల్ నుంచి సత్తా చాటాలని చూస్తున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ లోనే ఉంటారా లేక బిజెపిలోకి జంప్ చేస్తారా అన్న అనుమానాలు వస్తున్నాయి. బిజెపి నాయకత్వం దామోదరకు ఆఫర్ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది.
ఇక కాంగ్రెస్ హయాంలో జాతీయ స్థాయిలో హడావిడి చేసి ఢిల్లీలో చక్రాలు తిప్పిన రాయపాటి సాంబశివరావు, కావూరి సాంబశివరావులు ఏం చేస్తున్నారో ఎవరికీ తెలీని పరిస్థితి. విభజన తర్వాత కావూరి సాంబశివరావు బిజెపిలో చేరారు. కాకపోతే ఆయన యాక్టివ్ గా లేరు.

రాయపాటి సాంబశివరావు టిడిపిలో చేరారు. వచ్చే ఎన్నికల్లో నరసరావు పేట నియోజకవర్గ టికెట్ ను తమ కుటుంబానికే ఇవ్వాలని చంద్రబాబు నాయుణ్ని పట్టు బడుతున్నారు. కాంగ్రెస్ కే చెందిన మరో సీనియర్ నేత కన్నా లక్ష్మీనారాయణ ఈ మధ్యనే బిజెపికి రాజీనామా చేసి జనసేనలో చేరదామనుకుని చివరి నిముషంలో టిడిపిలో చేరారు. నిజానికి కన్నా 2019 ఎన్నికల ముందు కూడా ఇలానే చేశారు. అప్పుడు వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ లో చేరదామనుకుని చివరి నిముషంలో బిజెపిలో చేరారు. ఇపుడు గుంటూరు జిల్లాలో తనకు నచ్చిన చోట టికెట్ కోసం చంద్రబాబు దయాదాక్షిణ్యాలపై ఆధారపడి రాజకీయాలు చేస్తున్నారు. కాంగ్రెస్ హయాంలో కేంద్ర మంత్రి పదవి నిర్వర్తించిన దగ్గుబాటి పురంధేశ్వరి కూడా 2014 తర్వాత ఏ ఎన్నికలోనూ గెలవలేదు. బిజెపిలో కాలక్షేపం చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో బిజెపి తరపున పోటీ చేస్తే ఏపీలో ఎక్కడి నుంచీ కూడా గెలిచే పరిస్థితి లేకపోవడంతో పురంధేశ్వరి మళ్లీ పార్టీ మారతారా అన్న ప్రచారం జరుగుతోంది. ఆమె టిడిపి వైపు మొగ్గు చూపినా ఆశ్చర్యపోనవసరం లేదంటున్నారు. మొత్తానికి ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన కాంగ్రెస్ దిగ్గజాలు చాలా కష్ట కాలంలో ఉన్నారిపుడు.