కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్ పార్టీకి సరికొత్త ప్రాణవాయువు లభించినట్లయ్యింది. దేశంలో దాదాపు అన్ని ప్రాంతాల్లో ఓడిపోతూ వస్తున్న కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు దక్షిణాదిలో నిలదొక్కుకునే అవకాశం అందుకుంది. ఇంతకాలం నిద్రాణంగా పడున్న కాంగ్రెస్ కేడర్ ఈ విజయంతో నైతిక స్థైర్యాన్ని పొందారు. భవిష్యత్తు మరింత ధైర్యంగా ముందుకెళ్లాలన్న కోరిక వారిలో కనిపిస్తోంది. ఇదంతా సరే మరి కాంగ్రెస్ తరపున కాబోయే కర్ణాటక ముఖ్యమంత్రి ఎవరు అనే ప్రశ్నకు సమాధానం దొరక్క కాంగ్రెస్ శ్రేణులు తలలు పట్టుకుంటున్నారు. ఇద్దరు పోటీదారులు బలంగా ఉండటంతో ఉత్కంఠ పెరుగుతోంది.
కర్ణాటకలో కాంగ్రెస్ గెలుపు తర్వాత సీఎం పదవిపై పీటముడి పడిపోయింది. ఇద్దరు ఆశావహులూ గట్టి పోటీదారులే కావడంతో ఎవరికి సీఎం పదవి కట్టబెట్టాలో అర్థం కాక అధిష్టానం తంటాలు పడుతోంది. ఈ విషయంపై స్పష్టతనివ్వడం అంత సులభం కాకపోవడంతో చర్చోపచర్చలు కొనసాగుతున్నాయి. ఇద్దరు నేతలు కాంగ్రెస్ కోసం దశాబ్జాలుగా పనిచేస్తున్నందున ఎవరినీ కాదనలేని పరిస్తితి నెలకొంది. కాంగ్రెస్ శ్రేణులు కూడా రెండు గ్రూపులుగా విడిపోయి ఫ్లెక్సీలు, పోస్టర్ల వార్ కొనసాగిస్తున్నారు. దానితో ఇద్దరు నేతలను పిలిచి అధిష్టానం చర్చలు జరుపుతోంది. పార్టీని గెలిపించడంలో ఇద్దరూ కీలక బాధ్యత వహించినందుకు ఎవరినీ కాదనలేని స్థితిలో అధిష్టానం ప్రతినిధులున్నారు. ఎవరిని వద్దన్నా విప్లవం వచ్చే ప్రమాదముందని పార్టీ పెద్దలు భయపడుతున్నారు. తొలుత ఎవరు సీఎం అయినా ఫర్వాలేదని మాట్లాడిన పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ ఇప్పుడు తన డిమాండ్ పై పట్టు బిగించే ప్రయత్నంలో ఉన్నారు. ఇస్తే ముఖ్యమంత్రి పదవినివ్వండి లేకపోతే అసలు ఏ పదవీ వద్దని కొత్త నినాదం అందుకున్నారు. తాను వన్ మ్యాన్ పార్టీలా పనిచేశానని తాను లేకపోతే పార్టీకి విజయమే లేదని డీకే ప్రకటించేశారు. మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య ప్రస్తుత పీసీపీ అధ్యక్షుడు డీకే శివకుమార్ ఇద్దరికీ బలాలున్నాయి, బలహీనతలున్నాయి. ఇద్దరూ పట్టు వదలని విక్రమార్కులు ఇద్దరూ భయమెరుగని నేతలు.
75 ఏళ్ల సిద్దరామయ్య రాజకీయాల్లో స్థిరపడిపోయిన తర్వాతే 2006లో కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. ముందు ఆయన జేడీఎస్ లో ఉండేవారు. అక్కడ మాజీ ప్రధాని దేవెగౌడతో గొడవలు పెట్టుకోవడం కారణంగా బహిష్కరణకు గురై పార్టీ మారారు. నిజానికి సిద్దరామయ్య 1983లో తొలి సారి కర్ణాటక అసెంబ్లీకి ఎన్నికయ్యారు. చాముండేశ్వరి నియోజకవర్గం నుంచి ఐదు సార్లు గెలిచి రెండు సార్లు ఓడిపోయారు. న్యాయ విద్యా పట్టభద్రుడైన ఆయన 2008లో కేపీసీసీ పబ్లిసిటీ కమిటీ చైర్మన్ గా కూడా సేవలందించారు. సిద్దరామయ్య మంచి వక్త మాస్ లీడర్. జనంలో సమ్మోహనాస్త్రాలు సంధించగలరు. ఆలస్యంగా పార్టీలోకి వచ్చినప్పటికీ కాంగ్రెస్ శ్రేణులపై ఆయనకు పూర్తి పట్టుంది. మంచి పరిపాలకుడిగా పేరు తెచ్చుకుని 13 బడ్జెట్లు ప్రవేశ పెట్టారు. మైనార్టీలు, వెనుకబడిన వర్గాలు, దళితుల సంక్షేమానికి కృషి చేసే నేతగా అందరి ప్రశంసలు పొందారు. బీజేపీ, జేడీఎస్ ను అంశాల వారీగా విమర్శించడంలో సిద్దరామయ్య దిట్ట. రాహుల్ గాంధీకి ఆయన సన్నిహితుడని చెబుతారు. కాంగ్రెస్ యువనేత మద్దతు కూడా ఆయనకు ఉంది.
అయితే సిద్ధరామయ్యకు కొన్ని బలహీనతలు కూడా ఉన్నాయి. కేడర్ ను దగ్గరకు రానివ్వరన్న చెడ్డ పేరుంది. 2018లో కాంగ్రెస్ ను తిరిగి అధికారేంలోకి తీసుకురాలేకపోయిన సిద్దరామయ్యకు మళ్లీ సీఎం పదవి ఎందుకివ్వాలని కొందరు ప్రశ్నిస్తున్నారు. జేడీఎస్ నుంచి వచ్చి చేరిన నేతగా కొందరు ఆయన్ను పరిగణిస్తారు. పార్టీలో ప్రజాస్వామ్యయుతంగా పనిచేయరన్న అపవాదు కూడా ఆయనపై ఉంది. ఆయన మోనార్క్ లా ఉండాలని కోరుకుంటారట. అందరినీ కలుపుకుపోయే తత్వం ఆయనకు లేదట. ఉంటే ఉండండి పోతే పోండి అన్నట్టుగా ఆయన ధోరణి ఉంటుందట.
ఇక ముఖ్యమంత్రి పదవికి పోటీ పడుతున్న డీకే శివకుమార్ ను కాకలు దీరిన కాంగ్రెస్ వాదిగా చెప్పుకోవాలి. ఎనిమిది సార్లు ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు. విద్యార్థి దశ నుంచి ఆయన కాంగ్రెస్ రాజకీయాల్లో ఉన్నారు. గాంధీ ఫ్యామిలీకి ఆయన అత్యంత సన్నిహితుడు. ఖచితంగా చెప్పాలంటే ఆయన ప్రియాంక గాంధీ గ్రూపులో ఉన్నారు. రాష్ట్రంలో పార్టీని నడిపించడంలో ఆయన తనదైన ముద్ర వేశారు. అనేక సందర్భాల్లో ట్రబుల్ షూటర్ గా వ్యవహరించారు. జాతీయ స్థాయిలో పార్టీకి కష్టం వచ్చినప్పుడల్లా ఆయన ఆదుకున్నారు. కాంగ్రెస్ మాజీ కోశాధికారి అహ్మద్ పటేల్ ను రాజ్యసభ ఎన్నికల్లో ఓడించేందుకు అమిత్ షా కంకణం కట్టుకుంటే గుజరాత్ కాంగ్రెస్ ఎమ్మెల్యేనందరినీ బెంగళూరు రిసార్ట్ కు తరలించి ఎవరూ చేజారిపోకుండా శివకుమార్ కాపాడగలిగారు. పార్టీకి ఆయన గట్టి ఫైనార్షియర్. ఆర్థికంగా అనేక సందర్భాల్లో కర్ణాటక కాంగ్రెస్ ను ఆదుకున్నారు.
డీకే శివకుమార్ కు కూడా కొన్ని బలహీనతలు కూడా ఉన్నాయి. ఆయనపై ఐటీ, ఈడీ, సీబీఐ కేసులున్నాయి. కొన్ని రోజులు తిహార్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఇప్పుడు కూడా కేంద్ర దర్యాప్తు సంస్థలు ఆయన్ను కార్నర్ చేసే ప్రయత్నంలోే ఉన్నాయి. సిద్దరామయ్యకు ఉన్నంత మాస్ అప్పీలు ఆయనకు లేదు. సిద్దా వెనుకబడిన కురుబ సామాజిక వర్గానికి చెందిన నాయకుడు. శివకుమార్ ఓల్డ్ మైసూర్ ప్రాంతంలో డామినేట్ చేసే ఒక్కళిక సామాజిక వర్గం నాయకుడు. ఆయనకు ఇతర సామాజిక వర్గాల మద్దతు లేదని చెబుతారు. నాటి నేతలు వీరేంద్ర పాటిల్, ఎస్ ఎం కృష్ణ లాగే ఒక్కళిగ సామాజిక వర్గం నుంచి శివకుమార్ కూడా సీఎం కావచ్చని చెప్పే అవకాశముంది. పార్టీ సీనియర్లు సిద్దరామయ్య కంటే కూడా శివకమార్ వైపే మొగ్గు చూపే అవకాశం ఉంది. కానీ సిద్దరామయ్యకు కాంగ్రెస్ అధిష్టానం ఆశీస్సులున్నాయని, సోనియా, రాహుల్ ఈ సారి ఆయన వైపే మొగ్గు చూపే అవకాశం ఉందని చెబుతున్నారు. వచ్చే ఏడాది జరిగే లోక్ సభ ఎన్నికల్లో పార్టీని గెలిపించుకోవాలంటే సిద్దరామయ్య లాంటి నాయకులు అవసరమని అధిష్టానం భావిస్తోంది. ప్రస్తుతానికి జనంలో అవినీతి రహిత నాయకుడన్న ఇమేజ్ కూడా అనివార్యమవతోంది. లోక్ సభ ఎన్నికల తర్వాత శివకుమార్ కు సీఎం పదవిని అప్పగించే వీలుంది. ఆ క్రమంలో ఒక్కళిక సామాజికవర్గాన్ని కూడా తమ వైపు తిప్పుకునే వీలుంటుందని కాంగ్రెస్ పార్టీ విశ్వసిస్తోంది. ప్రస్తుతానికి మాత్రం కాంగ్రెస్ కు సిద్దరామయ్య నాయకత్వం అవసరం. ఆయన అలక పాన్పు ఎక్కకుండా చూసుకోవడం అనివార్యం. అందుకే బహుశా కాస్త సంయమనం పాటించాలని శివకుమార్ ను కాంగ్రెస్ పెద్దలు బతిమాలుకునే అవకాశం ఉంది. చూడాలి మరి ఏం జరుగుతుందో.