కాంగ్రెస్ కుల గణన ప్రభావం ఈసారి తెలంగాణ ఎన్నికలపై ఉంటుందా ? రాజకీయ పార్టీలను బీసీలు విశ్వసించే అవకాశం ఉందా ? పార్టీలు బీసీలకు ఎక్కువ టికెట్లు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయా. కేసీఆర్, బీజేపీది వ్యూహాత్మక మౌనమా.. గత్యంతరం లేక ఏమీ ఎరుగనట్లు ప్రవర్తిస్తున్నారా….
బిహార్లో చేసిన కుల గణన తెలంగాణలో ఎందుకు చేయడం లేదన్న ప్రశ్న కొన్ని రోజులుగా వినిపిస్తున్నదే. బిహార్లో 63 శాతం మంది బీసీ, ఓబీసీలున్నారని ఆ రాష్ట్రం నిర్వహించిన కుల గణనలో తేలగా.. తెలంగాణలో కూడా కనీసం 55 నుంచి 60 శాతం ఆ సామాజిక వర్గాల వారు ఉంటారని అనధికారిక అంచనాకు వచ్చారు. తెలంగాణలో ముదిరాజు, మున్నూరు కాపు, యాదవ, పద్మశాలి, గౌడ సామాజిక వర్గాల వారు ఎక్కువగా ఉన్నట్లు తేల్చారు. వారి సంఖ్యను ఖచతంగా చెప్పాలంటే మాత్రం కుల గణన చేపట్టాల్సి ఉంటుందని కాంగ్రెస్ పార్టీ అంటోంది. రిజర్వేషన్ పై 50 శాతం పరిమితి తొలగించినప్పుడే వెనుకబడిన, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు న్యాయం జరుగుతుందని రాహుల్ గాంధీ చేసిన ప్రకటనను కాంగ్రెస్ పదే పదే గుర్తు చేస్తుండగా బీఆర్ఎస్, బీజేపీ మాట దాటవేసేందుకు ప్రయత్నిస్తున్నాయి. వారిని మరింత ఇరాకటంలో పెట్టే దిశగా అధికారానికి వచ్చిన వెంటనే కుల గణన నిర్వహిస్తామని రాహుల్ ప్రకటించారు.
నిజానికి 2021లోనే కేసీఆర్ సర్కారు కుల గణన కోసం అసెంబ్లీలో తీర్మానాన్ని ఆమోదించింది. సాధారణ జనాభా గణనను నిర్వహించే క్రమంలో కులగణన కూడా చేయాలని నాడు బీఆర్ఎస్ కేంద్రాన్ని డిమాండ్ చేసింది. రాష్ట్ర అసెంబ్లీలు కుల గణన కోరుతూ తీర్మానాలు చేయాలని కూడా అప్పట్లో కేసీఆర్ సూచించారు. జనాభా గణనలో భాగంగా సామాజికంగా, ఆర్థికంగా, విద్యాపరంగా వెనుకబడిన వర్గాలను గుర్తించి ఈ లెక్కల ప్రకారం రిజర్వేషన్లు పెంచేందుకు కులగణన అవసరమని కేసీఆర్ స్వయంగా చెప్పి అందరితో శభాష్ అనిపించుకున్నారు. ఇప్పుడు ఎన్నికలు దగ్గరపడి కాంగ్రెస్ పార్టీ బీసీ గణనకు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో మాత్రం ఎటుపోయి ఎటు వస్తుందోనని కేసీఆర్ వ్యూహాత్మక మౌనం వహిస్తున్నారు. కులగణనను ఆయన తేనెతుట్టెలా పరిగణిస్తున్నారు. ఎన్నికలొచ్చినప్పుడు కులాల లెక్కబెట్టడం , కుల సమీకరణాలు మామూలు విషయమే. బీజేపీ తన తొలి జాబితాలో ప్రకటించిన 52 మందిలో 20 మంది బీసీలకు టికెటిచ్చింది. కాంగ్రెస్ తొలి జాబితాలోని 55 మందికి టికెటివ్వగా అందులో 12 మంది మాత్రమే బీసీలు. అంటే కనీసం 25 శాతం టికెట్లు కూడా బీసీలకు ఇవ్వలేదు. బీఆర్ఎస్ 115 మంది జాబితా ప్రకటిస్తే అందులో 23 మంది మాత్రమే బీసీలు అంటే.. వాళ్లు కూడా 25 శాతం టికెట్లు బీసీలకు కేటాయించలేదు. జనాభాలో కనిష్టంగా యాభై ఉన్న బీసీలకు 25 శాతం టికెట్లు కూడా ఇవ్వకపోవడం పెద్ద ప్రశ్న.
జిత్నా ఆబాదీ ఉత్నా హక్ అని రాహుల్ గాంధీ అంటారు. అది నిజమో కాదో పార్టీ మొత్తం 119 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించినప్పుడే తెలుస్తుంది. బీసీల మద్దతు ఉండే తెలుగుదేశం పార్టీ దెబ్బతిన్న తర్వాత వెనుకబడిన తరగతులు తమ వైపు వస్తున్నారని కాంగ్రెస్ భావిస్తోంది. అయితే ఎన్నికలప్పుడు పార్టీలు తమను వాడుకుని వదిలేస్తున్నాయని బీసీల్లో ఆగ్రహ జ్వాలలు రేగుతున్నాయి. దాని నుంచి బయట పడాలంటే ఈ సారి వారిని ప్రసన్నం చేసుకునేలు చేపట్టాలి. ఇంతవరకు ఆ పని జరగలేదు. కాంగ్రెస్ కూడా లెక్కలు చెబుతున్నదే తప్ప,,, ఖచితమైన చర్యలేమీ చేపట్టలేదని బీసీ సంఘాలు ఆందోళన చెందుతున్నాయి. లోక్ సభ ఎన్నికల లోపు తెలంగాణలో బీసీ గణన నిర్వహించగలిగితే.. దాని ప్రభుత్వం ఎన్నికలపై ఖచితంగా ఉంటుంది.
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…