సడెన్‌ హార్ట్‌ ఎటాక్‌లు.. జీవితం బుడగప్రాయం

By KTV Telugu On 3 March, 2023
image

నవ్వుతూ కుప్పకూలిపోతున్నారు. పాడుతూ ప్రాణాలు వదిలేస్తున్నారు. ఆడుతూ అంతిమశ్వాస విడుస్తున్నారు. గుప్పెడంత గుండె ఎప్పుడు మొరాయిస్తుందో ఎవరికీ అంతుపట్టటంలేదు. అలవాట్లు వయసుతో సంబంధం లేకుండా హార్ట్‌ ఎటాక్‌ క్షణాల్లో ప్రాణాలు తీస్తోంది. మరో షాకింగ్‌ విషమేంటంటే దేశంలో గుండె ఊపిరితిత్తుల సంబంధిత మరణాలు తెలంగాణలోనే అత్యధికంగా సంభవిస్తున్నాయి. మెడికల్ సర్టిఫికేషన్ ఆఫ్ కాజ్ ఆఫ్​ డెత్ నివేదిక ప్రకారం రాష్ట్రంలో గుండె ఊపిరితిత్తుల వ్యాధుల కారణంగా 96,982 మంది చనిపోయారు. రిపోర్ట్ అయిన మొత్తం మరణాల్లో ఇవే 57శాతం. రిపోర్ట్ చేయకుండా ఉన్నవి హాస్పిటల్‌దాకా రాకుండా చనిపోతున్న వారి సంఖ్య రెట్టింపు ఉండొచ్చంటున్నారు.

దేశంలో రోజూ వెయ్యిమంది హాస్పిటల్‌దాకా రాకుండానే సడెన్ కార్డియాక్ అరెస్ట్‌కి గురవుతున్నారు. ప్రతీ 10 మందిలో ఒకరు మాత్రమే ప్రాణాలతో బయటపడుతున్నారు. ప్రతీ 10 ఎస్‌సీఏ కేసుల్లో ఏడు ఇంటి దగ్గరే సంభవిస్తున్నాయి. మరోవైపు దేశంలో 98శాతం మందికి సీపీఆర్ ఎలా చేయాలో తెలియదు. ఇది కూడా చాలామంది ప్రాణాలు కాపాడలేకపోతోంది. తెలంగాణ రాష్ట్రంలో గుండె సంబంధిత చికిత్సలు పెరుగుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా రోజూ సగటున 700 మంది వివిధ రకాల హార్ట్ ట్రీట్మెంట్ చేయించుకుంటున్నారు. స్టంట్లు బైపాస్‌ సర్జరీ వాల్వ్‌ మార్పిడి గుండె రంధ్రం పూడిక ఆపరేషన్లు జరుగుతున్నాయి.

దేశవ్యాప్తంగా ఆకస్మిక గుండెపోటుతో ఏటా10 లక్షల నుంచి 15 లక్షల మంది చనిపోతున్నారు. కేంద్ర ప్రభుత్వ ఆయుష్మాన్‌ భారత్‌ రిపోర్ట్ ప్రకారం 2021లో దేశంలో 4.69 లక్షల గుండె సంబంధిత చికిత్సలు జరిగాయి. 21–30 ఏళ్ల వయసులో గుండె చికిత్సలు చేయించుకున్న వారిలో 8 శాతం మంది సింగిల్‌ స్టెంట్లు, 2 శాతం మంది డబుల్‌ స్టెంట్లు వేయించుకున్నారు. ఇటీవలి కాలంలో వయసుతో సంబంధం లేకుండా యువకులు కూడా సడెన్ కార్డియాక్ అరెస్ట్‌తో కుప్పకూలుతున్నారు. జన్యుపరమైన సమస్యలే దీనికి ప్రధానకారణం. గుండెపోటు వంశపారంపర్యంగా కూడా వస్తుంది. మితిమీరిన ఎక్సర్‌సైజ్ కూడా గుండెపై ఒత్తిడి పెంచుతుంది. సెలబ్రిటీల సామాన్యులు ఎవరినీ వదలడం లేదు హార్ట్‌ ఎటాక్‌. పునీత్‌ రాజ్ కుమార్‌ నుంచి తారకరత్న వరకూ ఎంతోమంది సెలబ్రిటీలను గుప్పెడంత గుండె బలితీసుకుంది.
ఆహారపు అలవాట్లు ఒత్తిళ్లు మరోవైపు కరోనా తగ్గినా దాని ప్రభావం కూడా గుండెపై పడుతోంది.