చైనాకో దణ్ణం, భారత్ వైపే పయనం

By KTV Telugu On 14 February, 2024
image

KTV TELUGU :-

ప్రపంచ పెట్టుబడుల రంగంలో ఏం జరుగుతోంది. ఇన్వెస్ట్ మెంట్ ట్రెండ్ మారుతోందా. చైనా అంటే ఇన్వెస్టర్లు భయపడుతున్నారా. డ్రాగన్ కంట్రీలో అనిశ్చితి పెరిగిపోయిందా. దేశం దివాలా  తీసే పరిస్థిత్తి వచ్చిందా. ఇప్పుడు చైనాలో బిచానా ఎత్తేసి ఫారిన్ ఇన్వెస్టర్లు ఇండియా వైపు చూస్తున్నారా..

డ్రాగన్ కంట్రీలో రియల్ ఎస్టేట్ రంగం కుదేలైంది. తయారీ  రంగం  లేచి  నిలబడలేకపోతోంది. చైనా స్టాక్ మార్కెట్లు నేలచూపులు చూస్తున్నాయి. విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు చైనా స్టాక్ మార్కెట్ల నుంచి పెట్టుబడులను  వెనక్కి తీసుకుంటున్నారు. మూడేళ్ల కాలంలో ఏడు ట్రిలియన్ డాలర్ల పెట్టుబడులను చైనా స్టాక్ మార్కెట్ల నుంచి ఉపసంహరణకు గురయ్యాయి. గత పది రోజుల్లోనే రెండు ట్రిలియన్ డాలర్లు వెనక్కి వెళ్లిపోయాయి. ఆ దేశంలోని చిన్న ఇన్వెస్టర్లు కూడా ఇబ్బందుల్లో ఉన్నారు. స్టాక్  మార్కెట్లలో పెట్టిన  పెట్టుబడులు వెనక్కి రాక, తమ  ప్రభుత్వాన్ని నానా శాపనార్థాలు పెడుతున్నారు.సోషల్  మీడియా మొత్తం చైనీస్ ఇన్వెస్టర్ల ఆవేదనతో నిండిపోయింది. గత ఆరు నెలల్లో షేర్ల  విక్రయాలు  పెరిగి కొనుగోళ్లు బాగా తగ్గిపోయాయి. దీనితో చైనా  అధ్యక్షుడు జీ జిన్ పింగ్ నేరుగా రంగంలోకి దిగారు. స్టాక్  మార్కెట్లను గాడిలో పెట్టేందుకు ప్రయత్నించారు. పరిశ్రమల పెద్దలతో సమావేశమయ్యారు. ఆయన ఎటువంటి చర్యలు తీసుకున్నారో బయటకు రాలేదు. ఆ ఒక్క రోజు కోలుకున్న చైనా స్టాక్ మార్కెట్లు తర్వాత తిరోగమన మార్గంలోనే పయనిస్తున్నాయి. చైనా ఇన్వెస్టర్ ఫ్రెండ్లీ దేశం కాదని తేల్చిన కంపెనీలు  గంభీరంగా భారత్ వైపుకు చూస్తున్నాయి. పెట్టుబడులన్నీ ఇండియాలో పెట్టేందుకు ప్రయత్నిస్తున్నాయి. అభివృద్ధికి పర్యాయపదంగా మారిన ఇండియాలో తమ పెట్టుబడులకు మంచి లాభాలు వస్తాయని వాళ్లు  విశ్వసిస్తున్నారు. దానితో ఇండియన్ స్టాక్ మార్కెట్లకు మహర్దశం ఖాయమైంది. గతేడాది మన స్టాక్ మార్కెట్లకు ఇరవై బిలియన్ డాలర్ల పెట్టుబడులు వచ్చాయి. ఫ్యూచర్ అర్నింగ్స్ 20 రెట్లు పెరిగాయి. భారత షేర్లు అత్యంత ఖరీదైనవిగా నమోదు కావడానికి వాటికున్న డిమాండే కారణమని చెప్పక తప్పదు. 2010 నుంచి 2020 వరకు సగటును పరిశీలిస్తే  భారత షేర్ల  విలువ 27  శాతం పెరిగింది.

పెట్టుబడి పరిస్థితులు  భారత్ కు అనుకూలంగా మారడానికి సహేతుకమైన కారణలే ఉన్నాయి. మోదీ పాలనలో భారత్ అన్ని రంగాల్లో దూసుకుపోతోంది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలోని అధికారుల బృందం… దేశ ఆర్థిక స్థితిగతులను మరింత మెరుగుపరిచేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ ఏడాది మార్చి నుంచి భారత ఆర్థిక వ్యవస్థ 7.3 శాతం వృద్ధి రేటును నమోదు చేసుకునే అవకాశం ఉంది.వచ్చే మూడేళ్లలో 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా అవతరించనున్న భారత్, 2030 నాటికి 7 ట్రిలియన్ డాలర్ల  ఆర్థిక వ్యవస్థగా అభివృద్ధి చెందుతోంది. అన్ని రంగాల్లో ఊర్ధ్వచలనం కనిపించడంతో భారత పరిశ్రమలే కాకుండా విదేశీ ఇన్వెస్టర్లు  కూడా మన  దేశం వైపుకు చూస్తున్నారు…

చైనా ఆర్థిక వ్యవస్థ పాతాళానికి పడిపోతే.. ఇండియా  ఆకాశమే  హద్దుగా పయనిస్తోంది. ప్రతీ సవాలును స్వీకరిస్తూ ముందుకు సాగుతోంది. ఒకప్పుడు చైనా  పెద్ద  ఇన్వెస్ట్ మెంట్ డెస్టినేషన్ గా ఉండేది. విదేశీ పరిశ్రమలన్నీ డ్రాగన్ కంట్రీలోనే తమ ఆఫ్ షోర్ క్యాంపస్ తో పాటు తయారీ కేంద్రాలను ఏర్పాటు చేసుకునే వాళ్లు. తక్కువ వ్యయంతో అందుబాటుకు వచ్చే మానవ వనరులు, ఇబ్బంది లేని మౌలిక సదుపాయాలు చైనా వైపుకు చూసేందుకు ఉపయోగపడేవి. ఇప్పుడు సీన్ మారింది. చైనా ప్రభుత్వ అనాలోచిత విధానాల కారణంగా ఇన్వెస్టర్లు అక్కడ నుంచి పారిపోతున్నారు. మాకొద్దీ దేశం అంటూ నినదిస్తున్నారు. భస్మాసురుడు తన నెత్తినే చేయి పెట్టుకున్నట్లు కరోనాను సృష్టించిన చైనా ఆ వ్యాధికే బలైంది. పాండమిక్ కారణంగా అక్కడి పరిశ్రమలు దెబ్బతిన్నాయి. కార్మిక శక్తి తగ్గిపోయింది. చీప్ లేబర్ కాస్త ఖరీదైన వ్యవస్థగా మారింది. దాని ప్రభావం తయారీరంగంపై పడింది. ఆరు నెలలుగా అక్కడి తయారీ రంగం  క్షీణిస్తోంది. విదేశీ పరిశ్రమలు చైనాను వదిలేసి.. వేరు దేశాల వైపు చూస్తున్నాయి. పొరుగున ఉన్న ఇండియాలో వసతులు వారిని ఆకర్షిస్తున్నాయి. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం విదేశీ ఇన్వెస్టర్లను రా రమ్మని ఆహ్వానిస్తోంది. 90 శాతం మంది ఉత్తర అమెరికా తయారీ రంగ పరిశ్రమలు చైనా నుంచి ఇండియా వైపుకు వచ్చేస్తున్నాయి. మరో ఐదేళ్ల పాటు ఇదే ట్రెండ్ కొనసాగుతుందని చెబుతున్నారు. ప్రస్తుత ప్రభుత్వం పరిశ్రమలకు అందిస్తున్న ప్రోత్సాహకాలు ఆకర్షణీయంగా ఉంటున్నాయి. భారత  మార్కెట్లో వస్తు విక్రయం సులభతరమైంది. ఇక్కడి మధ్యతరగతి వర్గాలు అటు కొనుగోలుదారులుగానూ, కార్మిక వర్గాలుగానూ  విదేశీ పరిశ్రమలకు ఉపయోగపడుతున్నారు. చైనా పరిశ్రమలు కార్మిక కొరతను ఎదుర్కొంటున్నాయి. అక్కడి 76  శాతం పరిశ్రమలకు ఇదే సమస్య ఎదురవుతోంది. గోల్డ్ మాన్ సాచ్స్, మోర్గాన్ స్టాన్లీ లాంటి సంస్థలు భారతలో పెట్టుబడి అవకాశాలపై చేస్తున్న  విశ్లేషణలు  మరింత ఊతమిచ్చేవిగా ఉంటున్నాయి. భారత్ లో తయారైన వస్తువులకు ప్రపంచ వ్యాప్తంగా భారీ  డిమాండ్ ఉంది.  ఒక్క అమెరికాకే మన ఎగుమతులు 23 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. 2018 నుంచి 2022 వరకు పరిస్థితులను అంచనా వేస్తే అది 44 శాతం వృద్ది  రేటును నమోదు చేసుకున్నట్లయ్యింది. భవిష్యత్తు మార్కెట్లుగా భావిస్తున్న  మెక్సికో, ఆగ్నేయాసియా దేశాలతో పోల్చితే భారత్  ఎంతో మెరుగైన స్థానంలో ఉంటూ వేగంగా దూసుకుపోతోంది. హైవేలు, రైల్వేలు, పోర్టులపై ప్రత్యేక దృష్టి పెట్టింది.  పోర్టులను మరికాస్త అభివృద్ధి చేసి లాజిస్టిక్స్ ఖర్చు తగ్గించగలిగితే భారత మార్కెట్లకు తిరుగుండదని ఆర్థిక రంగ విశ్లేషకులు చెబుతున్న మాట. తయారీ కేంద్రాలు, గిడ్డంగులు, థర్డ్ పార్టీ లాజిస్టిక్స్ , వస్తు రవాణాలో మరింత డిజిటల్  కనెక్టివిటీ పెంచాల్సి ఉంది..

భారత్ కు ఇది అందివచ్చిన అవకాశం. చైనా  చేతకానితనాన్ని  అనుకూలంగా మార్చుకునే అవకాశం. డ్రాగన్ కంట్రీలో అన్ని రంగాలు దెబ్బతిన్నాయి. అవసరానికి మించి రియల్ ఎస్టేట్ కు ప్రోత్సాహం అందించడంతో ఆ రంగం పూర్తిగా నేలకొరిగింది. మన దేశంలో రియాల్టీ రంగం దేదీప్యమానంగా వెలిగిపోతోంది. చైనా పరిస్థితి మనకు రాకుండా చూసుకోవడం ఒక వంతయితే..ఇప్పుడొచ్చిన  పెట్టుబడులకు మరిన్ని ప్రోత్సాహకాలు అందించడం మరో వంతు. చూడాలి మరి…

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి