టెక్ రంగంలో సంక్షోభం లక్షలాది మందిని రోడ్డున పడేస్తోంది. జాబులు పోయిన ఎందరో నిరుద్యోగులు మారి లబోదిబోమంటుంటే ఉద్యోగంలో కొనసాగుతున్న వారు కూడా తమ పోస్ట్ ఎప్పుడు ఊస్టింగ్ అవుతుందో తెలియని భయాందోళనలో కొట్టుమిట్టాడుతున్నారు. డ్యూటీ ముగించుకొని వచ్చిన వారు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. ఉద్యోగం నుంచి తొలగించామని మీ సేవలు చాలంటూ అర్థరాత్రి మెయిల్స్ వస్తున్నాయి. ఇంటి నుంచి పనిచేసేవారికి కొందరికి తెలియకుండానే ఆఫీస్ కనెక్షన్ కట్ అయిపోతోంది. దీంతో కలవరంతో మానసిక ఆందోళనకు గురవుతున్నారు ఎంప్లాయిస్. ప్రపంచ వ్యాప్తంగా ఐటీ దిగ్గజ కంపెనీలు భారీగా ఉద్యోగులను తొలగిస్తున్నాయి. మరికొన్ని కంపెనీలు ఖర్చులు తగ్గించుకునేందుకు జీతాల్లో కోతలు వేస్తున్నాయి. ఇవన్నీ గమనిస్తుంటే త్వరలో ప్రపంచ దేశాలను మరోసారి ఆర్థికమాంద్యం కుదిపేయనుందా అనే అనుమానాలు కలుగుతున్నాయి.
ఆర్థిక వ్యవస్థ మాంద్యంలోకి జారుకుంటే తిరిగి గాడిలో పెట్టడం తలకు మించిన భారం. అందుకే కంపెనీలు ముందస్తు జాగ్రత్తగా ఉద్యోగుల భారాన్ని కంపెనీల నిర్వహణ ఖర్చుల్ని తగ్గించుకుంటున్నాయి. ఉద్యోగుల తొలగింపు టెక్ రంగంలో ఆందోళనకర వాతావరణాన్ని సృష్టించింది. పెద్ద కంపెనీలు సైతం వేల సంఖ్యలో సిబ్బందిని తొలగించడం ఇంకా కొనసాగిస్తుండడం ఉద్యోగులను కలవరానికి గురిచేస్తున్నాయి. ఇప్పటికే మెటా ట్విట్టర్, మైక్రోసాఫ్ట్, ఇంటెల్, అమెజాన్, యాపిల్ లాంటి కంపెనీలు లే ఆఫ్స్ తో పాటు రిక్రూట్ మెంట్లు కూడా నిలిపివేశాయి. ఆఖరికి ప్రపంచం తలక్రిందులైనా తమ ఉద్యోగాలకు ఢోకా లేదని భావించే గూగుల్ కూడా ఉద్యోగులను తొలగించటం జీతాలను తగ్గించటం పరిస్థితి ఎలా ఉందో చెప్తోంది. ఈ ఏడాది కాలంలో ఆర్థిక మాంద్యం తప్పదని ఆర్థికవేత్తలు ఇప్పటికే అంచనా వేశారు.
2008లో వచ్చిన ఆర్థిక మాంద్యంతో ప్రపంచ వ్యాప్తంగా 15 కోట్ల ఉద్యోగాలు ఊడిపోయాయి. మరలా అలాంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. బహుళజాతి కంపెనీలు సైతం ఉద్యోగులను ఇంటికి పంపించడం ఆర్థిక మాంద్యం చాయలను గుర్తుకు తెస్తోంది. సాఫ్ట్వేర్ డెవలపర్లు, టెస్టర్లు, ప్రొడక్షన్ సపోర్ట్, సిస్టమ్ అడ్మిన్లు, మేనేజర్లతో సహా అనేక సబ్-టీమ్లల్లో అధిక వేతనం పొందే వారిపై కంపెనీలు వేటు వేస్తున్నాయి. కొన్ని విభాగాలు ఆటోమేషన్ చేయడంతో అక్కడ కూడా సిబ్బందిని తగ్గించుకుంటున్నారు. హెచ్ఆర్, ప్రాజెక్ట్, పీపుల్ మేనేజ్మెంట్ విభాగాలు ముఖ్యంగా ఆటోమేషన్ చేశారు. ఇందులో సిబ్బందిని భారీగా తగ్గిస్తున్నారు. కోవిడ్ సమయంలో చాలా మంది ఉద్యోగులు ఇంటి వద్ద నుంచి పనిచేయడం ప్రారంభించారు. దీంతో చాలా కార్యాలయాలు ఖాళీ అయ్యాయి. అలాంటి కొన్ని కంపెనీలు భారీగా అద్దెలు చెల్లించే పనిలేకుండా ఇప్పటికీ సిబ్బందిని ఇంటి వద్ద నుంచే పనిచేసేందుకు అంగీకరిస్తున్నాయి. వారికి కావాల్సిన సదుపాయాలు కల్పిస్తున్నాయి.