కేంద్ర ప్రభుత్వం దేశ క్రమినల్ చట్టాలన్నింటిని సమూలంగా మార్చేసేందుకు నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన బిల్లులను పార్లమెంట్ లో ప్రవేశ పెట్టారు. ఇప్పటిదాకా అమల్లో ఉన్న ఐపీసీ అంటే ఇండియన్ పీనల్ కోడ్ బ్రిటిష్ కాలం నాటిదని.. ఇప్పుడు దాని అవసరం లేదని .. నిర్ణయానికి వచ్చారు. ఇండియన్ పీనల్ కోడ్, కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ లను రద్దు చేసి.. వాటి స్థానాల్లో కొత్త చట్టాలను ప్రవేశపెట్టేందుకు సిద్దమైంది. ఐపీసీ స్థానంలో ‘భారతీయ న్యాయ సంహిత’ కొత్త చట్టాన్ని తీసుకురాబోతుంది. ఈ మేరకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలకమైన మూడు బిల్లులను లోక్సభలో ప్రవేశపెట్టారు. దేశంలో నేరాలు పెరిగిపోవడానికి బ్రిటిష్ కాలంనాటి ఈ చట్టాలే కారణమా ? అందుకే నిందితుల్ని శిక్షించలేకపోతున్నారా ?
ప్రస్తుతం అమలులో ఉన్న చట్టాలు 19వ శతాబ్దం నాటివని కేంద్ర హోం మంత్రి అమిత్ షా పార్లమెంట్లో చెప్పారు. అది నిజమే. కానీ ఎప్పటికప్పుడు ఆ చట్టాలకు కొత్త వాటిని చేరుస్తూనే వచ్చారు. అయితే ఇప్పుడు సంపూర్ణంగా పేరు కూడా మార్చాలని నిర్ణయించుకున్నారు. ఈ చట్టాల ప్రకారం శిక్షల్ని కూడా మార్పు చేశారు. ఇప్పటి వరకూ జీవిత ఖైదు అంటే పధ్నాలుగు ఏళ్లు అనే లెక్కలు వేసేవాళ్లు. కానీ ఇక నుంచి జీవిత ఖైదు అంటే.. జీవించి ఉన్నంత వరకూ అని అర్థం. ఇక ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు ప్రయత్నిస్తే ఏడాది జైలు శిక్ష విధిస్తారు. మహిళలు, పిల్లలు, హత్యలు, ప్రభుత్వ వ్యతిరేక నేరాలను కొత్త బిల్లుల్లో ప్రాధాన్యత ఇవ్వనున్నారు. చిన్నచిన్న నేరాలకు సంఘసేవను శిక్షగా విధించబోతున్నారు. అలాగే నేర పరిశోధనలో పలు రకాల సంస్కరణలు ప్రవేశ పెడుతున్నారు. కేంద్రం చేస్తున్న ఈ మార్పుల్లో కీలకమైనది రాజద్రోహ చట్టం తీసేయడం.
దేశద్రోహ చట్టాన్ని రద్దు చేయనున్నట్టు లోక్సభలో కేంద్ర హోం మంత్రి అమిత్షా ప్రకటించారు. ఎన్నో దశాబ్దాలుగా ఈ చట్టం వివాదాస్పదమవుతోంది. కుట్రపూరితంగా కావాలనే కొందరిపై ఈ చట్టం పేరుతో కేసులు పెట్టి ఇబ్బందులు పెట్టారన్న విమర్శలు, ఆరోపణలూ ఉన్నాయి. రద్దు చేయాలని ప్రతిపక్షాలు చాన్నాళ్లుగా డిమాండ్ చేస్తున్నాయి. నిజానికి ఈ దేశద్రోహం కేసులు అత్యధికంగా పెడుతోంది బీజేపీ ప్రభుత్వమే. అయినప్పటికీ సుప్రీంకోర్టు ఇప్పటికే ఈ చట్టం అమలును నిలిపివేసినందున.. పూర్తిగా తీసేయాలని నిర్ణయించారు. రాజద్రోహ చట్టం ఇప్పటిది కాదు. వలసపాలకులైన బ్రిటిషర్లు ప్రజలు తిరుగుబాటు చేయకుండా తమకు అనుకూలమైన రీతిలో వారు అప్పట్లో చట్టాలను రూపొందించారు. స్వాతంత్ర్యంకోసం పోరాడిన వారిైనా ఆనాటి పాలకులు రాజద్రోహం చట్టం కింద శిక్షలు విధించేవారు. ఇప్పుడు మనది ప్రజాస్వామ్య దేశం అయింది. రాజులే లేనప్పుడు రాజ ద్రోహం చట్టాన్ని కొనసాగించడంపై విమర్శలున్నాయి. కాలం చెల్లిన రాజద్రోహ నేరం కింద కేసులను ఇప్పటికీ అధికారంలో ఉన్న వారు తమ ప్రత్యర్థులపై బనాయిస్తున్నారు. ఈ చట్టాలన్నీ వాక్ స్వేచ్ఛను, ప్రజల ప్రాథమిక హక్కులనూ హరిస్తున్నాయని న్యాయశాస్త్ర నిపుణులు స్పష్టం చేస్తున్నారు. చివరికి రాజద్రోహ చట్టాన్ని కేంద్రం తొలగించాలని నిర్ణయించుకుంది.
ఆలాగే మూక దాడు లు, మైనర్లపై లైంగిక దాడులకు పాల్పడినవారికి మరణ శిక్ష విధించాలన్న ప్రతిపాదనలు ఇందు లో ఉన్నాయి. చిన్న నేరాలకు పాల్పడే వారికి సమాజ సేవ వంటి శిక్షను అమలు జేసేందుకు ప్రతిపాదనలను కూడా చేశారు. సాయుధ తిరుగుబాటు, విధ్వంసక చర్యలు, వేర్పాటు వాద కార్యకలాపాలను, దేశ సార్వ భౌమత్వానికి ముప్పుగా పరిగణించి శిక్షలు విధించే ప్రతిపాదనలను కూడా ఇందులో చేర్చారు. నిందితులు పరారీలో ఉన్నా, వారిపై విచారణ జరిపే నిబంధనను ఈ కొత్త చట్టంలో చేర్చను న్నారు. మహిళలపై అత్యాచారాలు పెరుగుతున్న క్రమంలోనే మోదీ సర్కార్ కఠిన శిక్షల వేయాలని నిర్ణయించుకుంది. మైనర్పై సామూహిక అత్యాచారం చేసిన నేరస్థులకు మరణ శిక్ష విధిస్తామని ప్రకటించింది. . దేశ శిక్షాస్మృతిలో పలు మార్పులు చేసిన కేంద్రం..మూడు కీలక బిల్లులను ప్రవేశపెట్టింది. ఈ కొత్త బిల్లుల ప్రకారం…పలు నేరాలకు శిక్షను మరింత కఠినతరం చేశారు. ఆ నేరం చేయాలంటేనే వెన్నులో వణుకు పుట్టించేలా శిక్ష విధించనున్నట్టు అమిత్షా ప్రకటించారు. ఎన్నికల సమయంలో మద్యంతో పాటు నోట్లు పంచడం సాధారణమైపోయింది. లక్షల కోట్ల రూపాయల లావాదేవీలు అనధికారికంగా జరుగుతుంటాయి. వీటిని నియంత్రించేందుకూ కేంద్రం కొత్త ప్రొవిజన్ తీసుకురానుంది. ఓటర్లకు డబ్బులు పంచిన వాళ్లకు కనీసం ఏడాది పాటు జైలుశిక్ష విధిస్తామని వెల్లడించింది. ఇక సామూహిక అత్యాచారాలపైనా కొరడా ఝుళిపించింది. ఈ కేసుల్లో నేరస్థులుగా రుజువైతే 20 ఏళ్ల జైలుశిక్ష తప్పదు. మైనర్పై అత్యాచారానికి పాల్పడిన వారికి ఉరిశిక్ష విధిస్తారు.
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పాత చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేసిన పార్టీలే అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రత్యర్థులపై ఆయా చట్టాలను ప్రయోగించడం మన దేశంలో చూస్తుటాం. అందుకే ఇంత కాలం చట్టాల్లో మార్పులురాలేదు. కానీ చట్టాల్లో మార్పులు చేస్తే పరిస్థితి మారుతుందా అంటే చెప్పడం కష్టమే !
ఇప్పటికీ బ్రిటిష్ కాలం నాటి చట్టాలనే అమలు చేస్తున్నప్పటికీ.. తీవ్రమైన కేసుల విషయంలో ఎక్కువగా శిక్షలు వేయడానికి ఎప్పటికప్పుడు కొత్త సెక్షన్లను చేరుస్తూనే వెళ్తున్నారు. కానీ పరిస్థితిలో మార్పు రావడం లేదు. నిర్భయ ఘటన తర్వాత నిర్భయ చట్టం తెచ్చారు. కానీ ప్రయోజనం లేకపోయింది. అదే సమయంలో చట్టాల్లో లొసుగులను ఆసరాగా తీసుకుని తీవ్రమైన నేరాలు చేసిన వారు అరెస్టుల నుంచి తప్పించు కోవడమో, అరెస్టు అయిన కొద్ది రోజులకే బెయిల్ సంపా దించడం జరుగుతోంది. ఇలాంటి వాటిని రాజకీయ నాయకులు ఎక్కువగా ఉపయోగించుకుంటూంటారు. ఏళ్ల తరబడి బెయిల్ మీద ఉంటారు. రాజకీయంగా ఉన్నత పదవులు కూడా పొందుతూ ఉంటారు. కానీ వారి కేసులు విచారణ వరకూ రావు. ఏదో ఓ పిటిషన్లు వేసి.. అడ్డుకుంటూనే ఉంటారు. ఇలాంటివి జరగకుండా కొత్త చట్టాల్లో తగిన బిగింపులు ఉండాల్సినవ అవసరం ఉందని చాలా కాలంగా అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
కొత్తగా తీసుకువచ్చే మూడు చట్టాలలో మొత్తం 313 మార్పులు చేయనున్నారు. కేసుల దర్యాప్తు విషయంలోనూ కొత్త పద్దతులు పాటించనున్నారు. 2027నాటికి అన్ని కోర్టుల్లో కంప్యూటీకరణ, డిజిటల్ ఎఫ్ఐఆర్ల నమోదు తప్పని సరి చేస్తారు. లైంగిక వేధింపుల కేసుల్లో బాధితుల స్టేట్మెంట్, రికార్డింగ్ తప్పనిసరి చేయనున్నారు. బాధితుల వాదన వినకుండా కేసులు ఉపసంహరించు కునే అవకాశం ఉండదు. శిక్ష పరమార్థం నేరస్థుల్లో పరివర్తన తీసుకుని రావడం. ప్రస్తుత చట్టాల కింద విధిస్తున్న శిక్షలు తేలికై నవనే భావన నిందితుల్లో ఉంది. వాటిని తప్పించు కోవ డం కష్టం కాదనే అభి ప్రాయం కూడా ఉంది.చట్టాలు ఎప్పుడూ మంచివే, పదునైనవే. వాటిని అమలు జేసే వారిలోనే లోపం ఉంది. నిందితుల్లోనే కాదు..చట్టాలను అమలు చేసే వ్యవస్థల్లోనూ మార్పు వస్తేనే.. వాటి వల్ల ప్రయోజనం ఉంటుంది. చట్టాలను మార్చడంతో పాటు వాటిని చిత్తశుద్ధితో.. అందరికీ ఒకేలా వర్తించగలిగే వ్యవస్థలను ఏర్పాటు చేసినప్పుడే… దేశంలో అందరికీ సమానత్వం ఉంటుంది.. నేరాలు చేయాలంటే.. భయం ఏర్పడుతుంది. అప్పుడే శాంతి భద్రతలు అనుకున్న స్థాయిలో ఉంటాయి.
కాలానుగుణంగా దేనిలోనైనా మార్పులు చేయడం.. రావడం అనివార్యం. కాని అవి మెరుగైన సమాజం కోసమే అయితే.. సత్ఫలితాలు వస్తాయి. రాజకీయ దురుద్దేశాలతో చేస్తే మాత్రం.. ప్రజలకు నష్టం చేసినట్లే అ
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…