ఇరుగుపొరుగుదేశాల్లో ఇప్పటిదాకా మనకు పాకిస్తాన్‌తోనే ప్రమాదం ఉండేది. ప్రత్యక్షంగా తలపడే ధైర్యంలోని దాయాదిదేశం ఉగ్రవాదులను ఉసిగొల్పేది. అక్రమ చొరబాట్లతో అలజడి సృష్టించాలని చూసేది. ఇప్పుడాదేశం తిండిగింజలకోసం వెతుక్కుంటోంది. చేసిన పాపాలకు ఫలితం అనుభవిస్తోంది. పాకిస్తాన్ కోరలు పీకిన పాములా ఉందిప్పుడు. బుసలు కొట్టే పరిస్థితి అస్సలు లేదు. కానీ డ్రాగన్ కంట్రీ జిత్తులమారి వేషాలేస్తోంది. తరచూ అరుణాచల్‌ప్రదేశ్‌లోకి చొచ్చుకొస్తున్న చైనా భారత్‌పై విషం కక్కుతోంది. తూర్పు లడఖ్‌లోని తన దేశ సైన్యంతో చైనా అధ్యక్షుడు చెప్పిన మాటలు ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి. సరిహద్దుల్లో పరిస్థితి గురించి దేశాధినేత వాకబుచేయడం సహజమే అయినా ఆయన వ్యాఖ్యల వెనుక దురుద్దేశం కనిపిస్తోంది.
అలర్ట్‌గా ఉంటున్నారా, ఆహారపదార్థాలు అందుతున్నాయా అంటూ తన సైనికులను ఆరాతీశారు చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్. అక్కడితోనే ఆగలేదు. యుద్ధానికి సిద్ధంగా ఉన్నారా అంటూ ఆయన అప్రమత్తం చేయడంతో చైనా వ్యూహంపై అనుమానాలు కలుగుతున్నాయి. పీపుల్ లిబరేషన్ ఆర్మీతో వీడియో కాన్ఫరెన్స్‌లో జిన్‌పింగ్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సమయంలో యుద్ధ సన్నద్ధత గురించి ప్రశ్నించడాన్ని తేలిగ్గా తీసుకోవడం లేదు భారత్. ఎల్‌ఏసీ వెంబడి రెండు దేశాల మధ్య తరచూ ఉద్రిక్తతలు చోటుచేసుకుంటున్నాయి. రెండుదేశాల సైనికులు ముఖాముఖి తలపడ్డ సందర్భాలున్నాయి. గాల్వాన్‌లోయ ప్రాణనష్టాన్ని భారత్ ఇంకా మర్చిపోలేదు. అందుకే జిన్‌పింగ్ యుద్ధ వ్యాఖ్యలతో మన సైన్యం మరింత అప్రమత్తమైంది.
చైనా అధ్యక్షుడు తన సైనికులను యుద్ధ సన్నద్ధతపై వాకబు చేయటంతో ఇండో చైనా బార్డర్‌లో భారీ విన్యాసాలకు ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ సన్నాహాలు చేస్తోంది. ఈశాన్యరాష్ట్రాల్లో ఫైటర్ జెట్లు, హెలికాప్టర్లకు తోడు డ్రోన్లతో భారీగా విన్యాసాలు జరపబోతోంది. ఫిబ్రవరి 1నుంచి ఐదురోజులపాటు ఈస్ట్రన్ ఎయిర్ కమాండ్‌లో ఈ విన్యాసాలకు మన వాయుసేన సిద్ధమైంది. డిసెంబరులోనే రెండ్రోజులపాటు వాస్తవాధీన రేఖ వెంట ఈస్ట్రన్ కమాండ్ యుద్ధ విన్యాసాలు చేపట్టింది. ఇప్పుడు మరోసారి భారీగా విన్యాసాలకు సిద్ధమై చైనాకు గట్టి హెచ్చరికలు పంపాలనుకుంటోంది. 2020 మే 5న హింసాత్మక ఘటన తర్వాత రెండు దేశాల సైనిక అధికారుల మధ్య ఎన్నోసార్లు అత్యున్నతస్థాయి చర్చలు జరిగినా ఉద్రిక్తతలు ఆగడంలేదు. ఒకడుగు వెనక్కి వేసినట్లు నటిస్తూనే రెండు అడుగులు ముందుకొస్తోంది చైనా. దీంతో భారత్ కూడా మాటలతో కాకుండా చేతలతోనే చూపాలనుకుంటోంది. చైనా యుద్ధ సన్నద్ధత దేనికోసమే తెలీదు. మనం కూడా తగ్గేదిలేదన్న సంకేతాలు పంపకపోతే పాక్ కంటే చైనా ప్రమాదకరంగా తయారవుతుంది.