ఇందిరా గాంధీ చిన్న‌కోడ‌లు గెలుస్తారా?

By KTV Telugu On 29 May, 2024
image

KTV TELUGU :-

దివంగ‌త ప్ర‌ధాని ఇందిరా గాంధీ  చిన్న కోడ‌లు మేన‌కా గాంధీ మ‌రో  సారి ఎంపీగా గెలిచి లోక్ స‌భ లో అడుగు పెట్టాల‌ని ప‌ట్టుద‌ల‌గా ఉన్నారు. ఉత్త‌ర ప్ర‌దేశ్ లోని  సుల్తాన్ పూర్ నియోజ‌క వ‌ర్గం నుండి ఆమె పోటీ చేశారు. ఈ సారి కూడా గెలిస్తే ఆమె ఎంపీగా ఏకంగా తొమ్మిదో విజ‌యాన్ని ఖాతాలో వేసుకున్న‌ట్లు అవుతుంది. భార‌తీయ జ‌న‌తా పార్టీ త‌ర‌పునే ఆమె ఈ సారి కూడా పోటీ చేశారు. అయితే స్థానిక బిజెపి నేత‌లు ఆమెకు అంత‌గా స‌హ‌క‌రిచ‌లేద‌ని అంటున్నారు. ఈ నేప‌థ్యంలో 67ఏళ్ల మేన‌కా ఎలా నెగ్గుకొస్తార‌న్న‌ది ఆస‌క్తిగా మారింది.

సుల్తాన్‌పూర్‌.. గాంధీ కుటుంబపు కంచుకోట రాయ్‌బరేలీకి కేవలం 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న లోక్‌సభ స్థానం. అత్తగారైన ఇందిరను ఎదిరించి చిన్న వయస్సులోనే ఒంటరిగా రాజకీయాల్లోకి వచ్చిన మేనకా గాంధీ ఇక్కడి సిట్టింగ్‌ ఎంపీ. భర్త సంజయ్‌గాంధీ మరణం తర్వాత  అత్త‌మ్మ ఇందిరతో విభేదాలు మేనకను ఒంటరిని చేశాయి. అప్పటికి చంటిపిల్లాడైన వరుణ్‌ గాందీని తీసుకొని కుటుంబం నుంచి బయటికొచ్చారు. నాలుగు దశాబ్దాలుగా రాజకీయాల్లో ఒంటరి పోరాటమే చేస్తూ వచ్చారు.

తొలిసారి 1984లో అమేథీలో బావ రాజీవ్‌గాంధీని ఢీకొని 2.7 లక్షల ఓట్ల తేడాతో ఓటమి చవిచూశారు. 1989లో జనతాదళ్‌ తరఫున ఉత్తరప్రదేశ్‌లోని పిలిభిత్‌ నుంచి గెలిచి తొలిసారి లోక్‌సభలో అడుగుపెట్టారు. 1991లో మళ్లీ బీజేపీ చేతిలో ఓటమి చవిచూసినా ఆ తర్వాత మాత్రం వరుసగా ఏడుసార్లు విజయం సాధించారు మేనకా గాంధీ.అప్పటి నుంచి పిలిభిత్‌ను కంచుకోటగా మార్చుకున్నారు మేనకా గాంధీ.

అక్కడి నుంచి మూడుసార్లు ఇండిపెండెంట్‌గా కూడా విజయకేతం ఎగరేశారు.  మధ్యలో ఒకసారి ఆవ్లా లోక్‌సభ స్థానం నుంచీ నెగ్గారు. వీపీ సింగ్‌ ప్రభుత్వంలో, తర్వాత వాజ్‌పేయి సర్కారులో, మోదీ తొలి విడత ప్రభుత్వంలోనూ మంత్రిగా మేనకా కీలక బాధ్యతలు నిర్వహించారు. ఫిలిబిత్‌లో ఆరుసార్లు గెలిచాక 2019లో ఆ స్థానాన్ని కుమారుడు వరుణ్‌కు వదిలి తొలిసారి సుల్తాన్‌పూర్‌కు మారారు. వరుణ్‌కు బీజేపీ ఈసారి మొండిచేయి చూపడంతో మేనకా కూడా నిరుత్సాహానికి గురయ్యారు.

సుల్తాన్‌పూర్‌లో నిషాద్‌లతో పాటు కుర్మీలు, యాదవులు, ముస్లింలు, దళితులు ఎక్కువగా ఉన్నారు. బ్రాహ్మణులు, ఠాకూర్లు ఓ మోస్తరుగా ఉంటారు. కాంగ్రెస్‌ మద్దతుతో ఎస్పీ తరఫున బరిలోకి దిగిన రామ్‌ భువల్‌ నిషాద్‌కు ఆ సామాజిక వర్గంలో గట్టి పట్టుంది. బీఎస్పీ కుర్మీ సామాజికవర్గానికి చెందిన ఉద్రజ్‌ వర్మను రంగంలోకి దించడంతో ఓట్లు భారీగా చీలే అవకాశం కనిపిస్తోంది. ఇక్కడ బీఎస్పీ రెండుసార్లు గెలవగా ఎస్పీ బోణీయే చేయలేదు! స్థానిక సమస్యలే ప్రధానాంశాలుగా ప్రచారం సాగింది.

సుల్తాన్‌పూర్  కు ఆరో విత‌లో పోలింగ్ జ‌రిగింది. కానీ యూపీ అంతా కలియదిరుగుతున్న ప్రధాని నరేంద్ర మోదీతో పాటు కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా, ఇతర బీజేపీ అగ్ర నేతలెవరూ అటువైపు కన్నెత్తి కూడా చూడలేదు. ప్రచారం చివర్లో సీఎం యోగి ఆదిత్యనాథ్‌ మాత్రం ఓ ర్యాలీలో పాల్గొన్నారు. దీంతో ఈ ఎన్నికలు ఆమెకు మళ్లీ ఒంటరి పోరాటంగానే కనిపిస్తున్నాయి.  పార్టీ అగ్ర‌నేత‌లంతా ఉద్దేశ పూర్వకంగానే మేన‌కా గాంధీకి స‌హ‌క‌రించ‌లేదా అన్న  అనుమానాలు వ్య‌క్తం అవుతున్నాయి. గాంధీ  కుటుంబీకులైన రాహుల్, ప్రియాంక మొదలుకుని విపక్ష నాయకులెవరూ కూడా మేనకకు వ్యతిరేకంగా పెద్దగా ప్రచారం చేయలేదు.మొత్తానికి ఈ సారి గెలుపు మాత్రం మేన‌కా గాంధీకి చాలా అవ‌స‌రం. అది ఆమె రాజ‌కీయ కెరీర్ లోనే అత్యంత కీల‌కం అంటున్నారు విశ్లేష‌కులు.

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి