ముప్పు ముంగిట్లో ప్రపంచం !

By KTV Telugu On 22 June, 2024
image

KTV TELUGU :-

ప్రపంచం అనూహ్యంగా మారిపోతోంది. ఎడారి దేశాలో వరదలతో మునిగిపోతున్నాయి.  ఎప్పుడూ వర్షాలు పడే దేశాల్లో కరువు వస్తోంది. ఎండా, చలి, వాన ఏదైనా అయితే అతివృష్టి లేకపోతే అనావృష్టి అన్నట్లుగా మారుతోంది.  ఈ వాతావరణ పరిస్థితుల కారణం ఎంత మంది ప్రాణాలు పోతున్నాయో లెక్కల్లోకి కూడా రావడం లేదు. ఈ పరిస్థితి ఎందుకు ?.  మానవాళికి ముప్పు పొంచి ఉందా ?

ఉత్తరభారతదేశంలో ఎండలు ఠారెత్తిస్తున్నాయి. ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల సెల్సియస్ దాటాయి  వేడి గాల్పులకు  జనం అల్లాడిపోతున్నారు. పదుల సంఖ్యలో జనం చనిపోతున్నారు.

ఉత్తర భారతంలో వాతావరణం ఎప్పుడూ చల్లగా ఉంటుంది.  జూన్‌్లో అయితే  అయితే ఉష్ణోగ్రతలు చాలా తక్కువగా నమోదవుతాయి.  కానీ ఇప్పుడు పరిస్థితి వేరుగా ఉంది.  ఢిల్లీ, యూపీ, హర్యానాలో వేడి గాలులు వీస్తున్నాయి. రాజధాని ప్రాంతంలో అయితే నార్మల్‌ కంటే ఏకంగా ఆరు డిగ్రీ సెంటిగ్రెడ్‌లు ఎక్కువ టెంపరేచర్‌ నమోదవుతుంది. ఒక్క బిహార్‌లోనే 24 గంటల్లో 22 మంది చనిపోయారు. రెడ్ అలర్ట్‌లు జారీ అవుతున్నాయి. అడపాదడపా వర్షాలు కురిసినా ఉక్కపోత, ఎండలు మాత్రం తగ్గడం లేదు. హిల్ టౌన్స్‌ అయిన పౌరీ, నైనిటీల్‌లో కూడా వేడి గాలులు వీస్తున్నాయంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. మూడు నెలలుగా ఇక్కడ చుక్క వర్షం పడలేదు.

దేశం మొత్తం ఇదే పరిస్థితి లేదు. ఈశాన్య రాష్ట్రాలు వరదలతో అతలాకుతలమయ్యాయి.  అంటే  ఓ ప్రాంతంలో భరించలేని ఎండలు. మరో ప్రాంతంలో తట్టుకోలేనంత చలి. ఇంకో ప్రాంతంలో ముంచెస్తున్న వరదలు. ఒక్కో దేశంలో ఒక్కో రకమైన పరిస్థితి.   ప్రకృతి మనుషులతో ఓ ఆట ఆడుకుంటోంది.   ఈ దేశం ఆ దేశం అని లేదు. ప్రపంచంలో ఉన్న అన్ని ఖండాలు, దేశాల్లో ఇప్పుడు విచిత్ర వాతావరణ పరిస్థితులు కనిపిస్తున్నాయి.  పవిత్ర హజ్ యాత్రలో ఉన్న 577 మంది ముస్లింలు ప్రాణాలు కోల్పోయారు. కారణం దారుణంగా నమోదవుతున్న ఉష్ణోగ్రతలు. మక్కాలో ఏకంగా 51 డిగ్రీలను మించి నమోదవుతుంది ఉష్ణోగ్రత. దీంతో ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నారు. ఇక్కడ ప్రకృతే ప్రజల ప్రాణాలు తీస్తుంది. రెండు నెలల ముందు ఎడారి దేశాల్లో నగరాలను ముంచెత్తే అంత పెద్ద వర్షాలు పడటం మర్చిపోలేం.   మిడిల్ ఈస్ట్‌ కంట్రీలో ఉన్నట్టుండి అత్యంత భారీ వర్షం కురవడం, వరదలు రావడం జరుగుతోంది. ఎడారి దేశాల్లో వరదలు రావడం అనేది చాలా అరుదు. కానీ ఇప్పుడు చాలా కామన్‌గా మారిపోయింది. ఆ వరదలకు జనాలు చనిపోవడం కూడా అంతే కామన్‌గా మారిపోయింది.

ఓ చోట ఎండ.. మరో చోట వరద.. మరో చోట చలి. ఇలా ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్క దేశం ఏదో రకమైన ప్రకృతి వైపరిత్యంతో ఇబ్బందులు పడుతూనే ఉంది.   గ్లోబల్ వార్మింగే దీనికి కారణం.  రోజురోజుకు గ్రీన్‌ హౌస్‌ గ్యాస్ రిలీజ్‌ పెరుగుతుందే తప్ప.. తగ్గడం లేదు. ఇవన్నీ భూగోళాన్ని వేడెక్కిస్తున్నాయి. నిజానికి ప్రతి ఏడాది గల్లీ నుంచి ఢిల్లీ దాకా.. ఆసియా నుంచి అంటార్కిటికా దాకా.. అత్యంత పేద దేశం నుంచి ధనిక దేశం దాకా.. ఇలా అన్ని వర్గాల్లో దీనిపై చర్చ నడుస్తుంది. అనేక నిర్ణయాలు తీసుకుంటారు. కానీ అమలు విషయానికి వస్తే అంతంత మాత్రమే. కర్బన ఉద్గారాలు పెరుగుతూనే ఉంటాయి. మంచు కరుగుతూనే ఉంటుంది. సముద్రాలు పెరుగుతూనే ఉంటాయి.

అవసరమైనప్పుడు వర్షాలు పడకపోవడం కూడా పెద్ద సమస్య. రుతుపవనాలు వచ్చేశాయని చెప్పారు కానీ తెలుగు రాష్ట్రాల్లో అడపాదడపా కురుస్తున్న వర్షాలే తప్ప… నీటి కొరతను తీర్చే గట్టి వర్షం పడలేదు.  గోదావరికి అయితే ఈ పాటికి వరదలు రావాలి.  కానీ ఇప్పటి వరకూ చుక్క నీరు రాలేదు. ప్రపంచవ్యాప్తంగా వస్తున్న విపరీత  వాతారవణ మార్పుల్లో మనం కూడా భాగమవుతున్నాం. ఇంకా ఎన్ని కష్టాలు పడాల్సి వస్తుందో.

రుతువుల కాలం ఇప్పుడు మారిపోయింది. ఇంకా చెప్పాలంటే ఎప్పుడు ఎండా కాలమో.. ఎప్పుడు వర్షాకాలమో చెప్పలేని పరిస్థితి.  మరి ఈ ప్రపంచానికి ముప్పు పొంచి ఉన్నట్లే కదా !

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి