బాబాయ్‌ని అబ్బాయే చంపించాడంటోంది టీడీపీ. వైఎస్ వివేకానందరెడ్డి మర్డర్ అయినవాళ్ల పనేనంటోంది సీబీఐ. కానీ వివేకా హత్య ఆయన వివాహేతర సంబంధాలతో జరిగిందన్న వాదనని వైసీపీ సమర్ధిస్తోంది. వివేకా అల్లుడు కూతురే కారకులన్న ఎంపీ అవినాష్‌రెడ్డి ఆరోపణలకు జగన్ పార్టీ మద్దతిస్తోంది. అవినాష్‌రెడ్డి ఆరోపణలు చేసినప్పుడల్లా కేసు విషయంలో అంతే పట్టుదలతో ముందుకెళ్తున్నారు వైఎస్ వివేకా కూతురు సునీతారెడ్డి. మరోవైపు టీడీపీ వివేకా కేసుతో రాజకీయంగా లబ్ధిపొందాలనుకుంటోంది. సునీతారెడ్డి పోరాటాన్ని సమర్థిస్తూ అవకాశం ఉంటే ఆమెనే అన్నపైకి బ్రహ్మాస్త్రంలా ప్రయోగించాలనుకుంటోంది. ఏప్రిల్ నెలాఖరులోగా కేసు దర్యాప్తు పూర్తిచేయాలని మొదట ఆదేశించిన సుప్రీంకోర్టు మరో రెండునెలలు గడువు పొడిగించింది. జూన్ 30లోపు వివేకా హత్యకేసు ఎన్ని మలుపులు తిరుగుతుందో అంతుపట్టటంలేదు. వైసీపీ ఎంపీ అవినాష్‌రెడ్డి అయితే పీకల్లోతు కూరుకుపోయినట్లే కనిపిస్తోంది. ఇప్పటికే ఆయన తండ్రి భాస్కర్‌రెడ్డి రిమాండ్‌లో ఉన్నారు. అయినా తమపై అభియోగాలు రాజకీయ కుట్రేనన్న వాదనమీదే ఉన్నారు అవినాష్‌రెడ్డి. చనిపోయిన వివేకా వ్యక్తిగత జీవితం మీద కూడా సంచలన కామెంట్స్ చేస్తున్నారు. మరోవైపు సాక్షి మీడియాలో కూడా అవినాష్ వాదననే సమర్ధించేలా కథనాలు వస్తున్నాయి. బాబాయ్ వ్యక్తిత్వాన్ని ఓ రకంగా అబ్బాయే బోనులో నిలబెట్టారు.
సినిమా ట్విస్టులతో నడుస్తున్న వివేకా హత్యకేసుపై జగన్మోహన్‌రెడ్డి సోదరి వైఎస్ షర్మిల చేసిన వ్యాఖ్యలతో వైసీపీ ఉలిక్కిపడింది. వైసీపీ వాదన పూర్తి అబద్ధమనేలా షర్మిల షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆస్తి కోసం వివేకాని ఆయన అల్లుడు రాజశేఖర్‌రెడ్డి, కూతురు సునీత చంపించారనడం పచ్చి అబద్ధమంటున్నారు షర్మిల. సునీత పేరుతో వివేకానందరెడ్డి ఏనాడో ఆస్తులు రాసేశారని వివేకా పేరగానీ చిన్నమ్మ పేరుతోగానీ ఎలాంటి ఆస్తులూ లేవని షర్మిల బాంబుపేల్చారు. ఒకటీ అరా ఆస్తులున్నా తమ తదనంతరం సునీతకే చెందేలా చిన్నాన్న వివేకా వీలునామా రాశారని కొత్త కోణాన్ని షర్మిల బయటపెట్టారు. ఒకవేళ ఆస్తికోసమే హత్య జరిగి ఉంటే మామను కాదు భార్యను రాజశేఖర్‌రెడ్డి చంపించి ఉండేవారంటూ షర్మిల చేసిన కామెంట్స్‌తో వైసీపీ ఇన్నాళ్లుగా చేస్తూ వచ్చిన వాదన వీగిపోతోంది. వివేకా వ్యక్తిగత జీవితంపై నిందలేసేలా జరుగుతున్న ప్రచారంపై వైఎస్ షర్మిల తీవ్ర ఆవేదన వ్యక్తంచేశారు. భౌతికంగా లేని, వివరణ ఇచ్చుకోలేని వ్యక్తిమీద మీడియాలో దుష్ప్రచారం చేయడం దారుణమని ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రజల మనిషి వివేకానందరెడ్డి వ్యక్తిత్వం గురించి పులివెందుల ప్రజలందరికీ తెలుసన్నారు. ఆయన ప్రజానాయకుడని పంచాయతీ కార్యాలయానికైనా కలెక్ట్‌రేట్ కయినా వెళ్లి తన దృష్టికి వచ్చిన సమస్యలు పరిష్కరించేవారని చిన్నాన్న గురించి గొప్పగా చెప్పారు వైఎస్ షర్మిల.
చిన్నాన్న వ్యక్తిత్వాన్ని కించపరిచే హక్కు మీడియా సంస్థలకు లేదని, విలువలు లేని మీడియా విశ్వసనీయత కోల్పోతుందని షర్మిల చేసిన వ్యాఖ్యలు పరోక్షంగా సాక్షిని ఉద్దేశించేనని భావిస్తున్నారు. సాక్షి పత్రికలో టీవీలో వైఎస్ వివేకా వ్యక్తిగతజీవితంపై వ్యతిరేక వార్తలు వస్తున్నాయి. మరే మీడియా కూడా ఇలా పర్సనల్‌గా పోలేదు. దీంతో అన్నని ఆయన పార్టీని ఆయన మీడియాని ఏకకాలంలో వైఎస్ షర్మిల టార్గెట్ చేసుకున్నట్లు కనిపిస్తోంది. షర్మిల అభిప్రాయంతోనే బహుశా విజయమ్మ కూడా ఉండాలి. ఆమెకూడా బయటికొచ్చి మరిది మచ్చలేని మనిషని చెబితే వైసీపీ పరువు గంగలో కలిసినట్లే. చిలువలు పలువలు చేసినంత మాత్రాన వివేకా వ్యక్తిగత జీవితంమీద నిందలేసినంత మాత్రాన కేసు విచారణపై ఎలాంటి ప్రభావం పడదు. సునీతారెడ్డి వాదనను వైఎస్ షర్మిల సమర్ధించడం వైసీపీకి ఓరకంగా హెచ్చరికే. చట్టం తన పని తానుచేసుకుపోతుందని వదిలేయకుండా అవినాష్‌రెడ్డిని కాపాడేందుకు జగన్ అన్ని అస్త్రాలు ప్రయోగిస్తే అవి బూమరాంగ్ అయ్యే ప్రమాదం లేకపోలేదు.