ఫిట్‌గా ఉన్నా స్ట్రోక్ – జెరోథా CEO పరిస్థితి మనకు వస్తుందా ?-Zerodha-CEO-kamat

By KTV Telugu On 29 February, 2024
image

KTV TELUGU :-

హార్ట్ స్ట్రోక్, ఈ మాట గతంలో  పెద్దగా వినిపించేది కాదు. యాభై ఏళ్లలోపు వాళ్లకు వస్తే ఇంత చిన్న వయసులో గుండెపోటా అని డాక్టర్లు ఆశ్చర్యపోయేవారు. ఇప్పుడు   పాతికేళ్లకు గుండెపోటు వచ్చి కుప్పకూలిపోతున్నారు.  అత్యంత ఫిట్‌గా ఉండేవాళ్లకూ అదే పరిస్థితి. శరీరంలో  కొలెస్ట్రాల్ లేకుండా చూసుకునే వాళ్లకూ తప్పడం లేదు. ఎందుకీ పరిస్థితి…?.   స్టాక్ ట్రేడంగ్ స్టార్టప్ జెరోథా సీఈవోకు ఇలాగే గుండెపోటు వచ్చింది. ఆయన ఫిట్ నెస్‌ ఫ్రీక్. ఆరోగ్యంపై ఎంతో  దృష్టి పెడతారు. ఆయినా ఎందుకొచ్చింది ?.  సోషల్ మీడియాలో ఆయన షేర్ చేసుకున్న అనుభవాలు కాస్త లోతుగా పరిశీలిస్తే.. మానసిక ఆరోగ్యం కూడా శారీరక ఆరోగ్యం మీద ఎంత ప్రభావం చూపిస్తుందో అర్థం చేసుకోవచ్చు.

స్టాక్ ట్రేడింగ్ చేసేవారికి జెరోధా పరిచయం అక్కర్లేని పేరు. లక్షల మంది  డీమ్యాట్ అకౌంట్లు ఓపెన్ చేసి ట్రేడింగ్ చేస్తుంటారు. జెరోధా సంస్థ సీఈఓ నితిన్ కామత్ కూడా సుపరిచితమే. ఎప్పుడూ ఫిట్‌గా ఉంటూ.. ఫిట్‌నెస్‌కే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు.  కార్పొరేట్ ప్రపంచంలో ఆయనకో గుర్తింపు ఉంది. అయితే  ఈయన ఇటీవల స్వల్ప గుండెపోటుకు గురయ్యారు. ఆయనే ఈ విషయం గురించి ప్రముఖ సామాజిక మాధ్యమం ట్విట్టర్లో వెల్లడించారు. 6 వారాల కిందటే మైల్డ్ స్ట్రోక్ వచ్చిందని ప్రకటించారు.  స్వల్ప గుండెపోటుతో తన ఆరోగ్యం దెబ్బతిందని చెప్పుకొచ్చారు.  ‘ఎల్లప్పుడూ ఫిట్‌గా ఉండి.. తన గురించి తాను కేర్ తీసుకునే వారికి ఇలా ఎందుకు అవుతుందో తెలియట్లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.   మనం ఎప్పుడేం చేయాలో కచ్చితంగా తెలియాలని డాక్టర్లు చెబుతున్నారు కానీ తప్పించుకోలేకపోతున్నామనేది ఆయన బాధ. ఇప్పుడు రికవర్ అవుతున్నానని ఆయన చెప్పారు.

తనకు గుండెపోటు ఎందుకు వచ్చిందో  ఆయనకు కూడా అర్థం కాలేదు. డాక్టర్లు తేల్చలేకపోయారు.  ఇటీవల నితిన్ కామన్ తండ్రి చనిపోయారు. ఆ  బాధతో పాటు  నిద్ర కూడా సరిగ్గా లేకపోవడం, అలసట, డీహైడ్రేషన్, వర్కవుట్స్ ఎక్కువగా చేయడం.. వీటిల్లో ఏదో ఒకటి కారణం కావొచ్చునని కామన్ భావిస్తున్నారు.  ముఖం పొడిబారినట్లు ఉందని.. ఇంకా చదవడం, రాయడం కూడా కష్టంగా ఉందని చెప్పుకొచ్చారు  . పూర్తిగా కోలుకునేందుకు 3-6 నెలల సమయం పట్టొచ్చని తెలిపారు. ఆస్పత్రిలో బెడ్‌పై పడుకొని ఉన్న ఫొటోనే ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.  దడు కూడా సరిగ్గా పనిచేయట్లేదు. ఇప్పుడు కాస్త బానే ఉంది. రికవరీకి మూడు నుంచి ఆరు నెలలు పడుతుంది.’ అని కామత్ ట్వీట్‌లో పేర్కొన్నారు. ఇంత ఫిట్‌గా ఉన్నా కూడా ఎలా స్ట్రోక్ వచ్చిందో తెలియట్లేదని ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

జెరోధా బ్రదర్స్‌గా గుర్తింపు పొందిన నితిన్ కామత్, నికిల్ కామత్‌లు సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటారు. యువతకు ఫైనాన్స్ సహా ఆరోగ్యం గురించి, ఇతర విషయాల్లో కూడా టిప్స్ ఇస్తుంటారు. పాడ్‌కాస్ట్‌లతో.. హెల్దీగా ఉండేందుకు ఏం చేయాలో చెబుతుంటారు. ఈ క్రమంలోనే ఇప్పుడు నితిన్ త్వరగా కోలుకోవాలని నెటిజన్లు ట్వీట్లు చేస్తున్నారు.  కామత్ బయటపడ్డారు కానీ.. గతంలో మనకు తెలిసిన ఫిట్ నెస్ ఫ్రీక్‌లే గుండెపోటు బారిన పడ్డారు.  కన్నడ స్టార్ పునీత్ రాజ్ కుమార్, ఆంధ్రప్రదేశ్ రాజకీయ నాయకుడు గౌతంరెడ్డి మంచి ఫిట్‌నెస్ మెయిన్ టెయిన్ చేస్తారు. ఆరోగ్యం మీద దృష్టి పెడతారు. అయినా వారికి స్ట్రోక్ వచ్చింది. ప్రాణాలు కూడా నిలువలేదు. ఇదంతా ఎందుకంటే.. కేవలం శారీరక ఆరోగ్యం మీదనే కాదు.. మానసిక ఆరోగ్యం మీద కూడా ఎక్కువ దృష్టి పెట్టాల్సి ఉంది.

సాధారణంగా, పుట్టిన ఏడాది కాలం నుంచీ ప్రతి వ్యక్తిలో కొంత మేర రక్తనాళాల్లో బ్లాకేజ్‌ ఉండటం సహజం. ఇది వయసుతో పాటు అతి నెమ్మదిగా పెరుగుతుంది. అయితే, ఆరోగ్యంపై పెద్దగా ప్రభావం చూపదు. అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, జీవన శైలి ఫలితంగా ఈ బ్లాకేజ్‌ ఒక్కసారిగా తీవ్రం అవుతుంది. అంతులేని శారీరక శ్రమ, ఒత్తిడి వల్ల ప్రాణాంతకంగానూ పరిణమించవచ్చు. నిత్యం వ్యాయామం చేయకుండా, ఒకేసారి మితిమీరిన కసరత్తుకు సిద్ధపడితే గుండె మీద భారం పడుతుంది. అది గుండెపోటుకు దారితీసే ఆస్కారం ఉంది.. జిమ్‌ వర్కవుట్స్‌తో హృదయ స్పందన అకస్మాత్తుగా పెరిగిపోతుంది. ఫలితంగా రక్తనాళాలు నిమిషాల్లోనే 40 నుంచి 100 శాతం మేర బ్లాక్‌ అవుతాయి. దీంతో, గుండెపోటు వస్తుంది. గతంలో కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉండేది. కరోనా కాలం నుంచీ ప్రతి ఇల్లూ వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌తో బిజీబిజీగా కనిపిస్తున్నది. మినీ ఆఫీసుగా మారుతున్నది. ఇంట్లో నుంచే పనిచేస్తుండటంతో సేదతీరే అవకాశమూ లేకుండా పోయింది. దీంతో తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నది యువత. కుటుంబ, ఆర్థిక సమస్యలు, ఉద్యోగ అభద్రత, ఆలూమగల బంధాలకు బీటలు.. తదితర కారణాల వల్ల మానసిక రుగ్మతలు అధికం అవుతున్నాయి. ఈ ‘సైకాలజికల్‌ స్ట్రెస్‌’ కూడా గుండెపోటుకు ఓ కారణమేనని నిపుణులు చెబుతున్నారు.

ఉరుకుల పరుగల ప్రపంచంలో చాలా మంది నిద్ర పోయే వ్యవధిని తగ్గించుకుంటున్నారు. రోజూ ఆరు నుంచి ఎనిమిది గంటల నిద్ర లేకపోతే శరీరంలో చాలా మార్పులు వస్తాయని నిపుణులు ఎప్పట్నుంచో చెబుతున్నారు. అయితే అది మానసిక ఆరోగ్యంపైనా ప్రభావం చూపుతుంది. పని ఒత్తిడి కారణంగా  కూడా గుండెపై ప్రభావం పడుతుంది. శారీరక శ్రమ తగ్గిపోయింది. వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ వల్ల చాలామంది గంటల తరబడి కదలకుండా పనిచేస్తున్నారు. సమయాభావం సాకుతో హెల్త్‌ చెకప్‌లకు దూరం అవుతున్నారు. దీంతో యువతలో బీపీ, షుగర్‌, కొలెస్ట్రాల్‌ స్థాయులు పెరిగిపోతున్నాయి. అంతిమంగా గుండెపోటుకు దారితీస్తున్నాయి. లేనిపోని టెన్షన్లు పెట్టుకుంటే.. మొదటికే మోసం వస్తుంది.  జెరోథా సీఈవో కు వచ్చిన గుండెపోటు … అదే గుర్తు చేస్తోంది.

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి