భర్త తన భార్య నగలు తీసుకోవడం నేరం : ఢిల్లీ హైకోర్ట్

By KTV Telugu On 2 January, 2023
image

భార్య నగలు ఆమె వ్యక్తిగత ఆస్తి, వాటిపై ఆమె భర్తకు కూడా ఎలాంటి హక్కు ఉండదని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. పెళ్లయినంత మాత్రాన భార్యపై సర్వహక్కులు ఉన్నట్టు భావించకూడదని పేర్కొంది. ఒక వ్యక్తి తన భార్య నగలను చోరీ చేసిన కేసు విచారణ సందర్భంగా కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. భార్య నగలు ఆమె వ్యక్తిగత ఆస్తి భర్తకైనా సరే ఆ అస్తిని తన అవసరాలకు వినియోగించే అధికారం లేదని అలా చేయడం నేరమేనని జసిస్ట్ అమిత్ మహాజన్ నేతృత్వంలోని డివిజన్ బెంచ్ స్పష్టం చేసింది. భర్తకు మధ్యంతర ఉపశమనం కల్పించేందుకు నిరాకరించింది. భర్త అయినప్పటికీ భార్యకు తెలియజేయకుండా నగలు గృహోపకరణాలను ఈ విధంగా తీసుకోవడానికి చట్టం అనుమతించదని ధర్మాసనం తన ఉత్తర్వుల్లో పేర్కొంది. రోహిణిలోని కేఎన్ కట్జూ మార్గ్ పోలీస్ స్టేషన్‌లో నిందితుడు తన నగలు దొంగతనం చేసినట్లు అతని భార్య పిటిషన్‌లో పేర్కొన్నారు. తాను పుట్టింటికి ఇంటికి వెళ్లిన సమయంలో భర్త ఇంట్లోని నగలు నగదు ఇంటి సామాగ్రి దోచుకున్నట్లు సమాచారం. అయితే తన భార్య తన ఇష్టానుసారం పుట్టింటికి వెళ్లారని ఆమె భర్త చెప్పాడు. దీన్ని కోర్టు తప్పు పట్టింది. భర్త తన భార్యను ఇంటి నుంచి వెళ్లగొట్టవద్దని ఆమె నగలను తన వెంట తీసుకెళ్లవద్దని ఆదేశించింది. కేసు ఇంకా ప్రాథమిక దశలో ఉన్నందున భర్తకు ముందస్తు బెయిలు మంజూరు చేయలేమని తేల్చి చెప్పింది.