టీమిండియాకు మరో ఆణిముత్యం దొరికిందనే చెప్పాలి. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో స్పిన్ త్రయం ఇరగదీస్తోంది. అశ్విన్, జడేజాలు ఇప్పటికే ఆల్‌రౌండర్‌లుగా ప్రూవ్ చేసుకోగా ఇప్పుడు వారి జాబితాలో అక్షర్ పటేల్ చేరాడు. తొలి టెస్టులో హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్న అక్షర్ పటేల్ రెండో టెస్టులో కూడా జట్టును ఆదుకున్నాడు. ఢిల్లీలో అక్షర్ కీలక ఇన్నింగ్స్ ఆడాడు. 139పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయి భారత్ పీకల్లోతు కష్టాల్లో పడింది. ఆ సమయంలో బ్యాటింగ్‌కు వచ్చిన ఈ గుజరాత్ ఆల్ రౌండర్ అడ్డుగోడగా నిలిచి అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. హాఫ్ సెంచరీతో రాణించాడు. అశ్విన్‌తో కలిసి వంద పరుగులకు పైగా భాగస్వామ్యం నెలకొల్పాడు. మాజీ క్రికెటర్లు, అనలిస్టులు, ఫ్యాన్స్ అక్షర్ పటేల్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు. జట్టుకు అక్షర్ అతి పెద్ద ఆస్తిగా మారాడని మెచ్చుకుంటున్నారు. అశ్విన్, అక్షర్ ఇద్దరి భాగస్వామ్యమే టీమిండియాను నిలబెట్టిందని ఆకాశానికెత్తుతున్నారు
2021లో అంతర్జాతీయ ఆరంగ్రేటం చేసిన అక్షర్ పటేల్ ఆల్‌రౌండ్ షోతో అదరగొడుతున్నాడు. ఇప్పటికీ 48 టెస్టు వికెట్లు తీసిన అక్షర్ పటేల్ 32 సగటుతో 400లకు పైగా పరుగులు చేశాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2023 టోర్నీలో రెండు సార్లు 50+ స్కోర్లు చేసిన ఏకైక బ్యాటర్‌గా నిలిచాడు. ఈ ఏడాది ఆరంభంలో శ్రీలంకతో జరిగిన టీ 20 సిరీస్ రెండో మ్యాచ్‌లో అక్షర్ ఆడిన ఇన్నింగ్స్ హైలెట్. ఆ మ్యాచ్‌లో ఓడినప్పటికీ అక్షర్ పటేల్ తన ఆల్ రౌండ్ ప్రదర్శనతో ప్రశంసలు అందుకున్నాడు. హాఫ్ సెంచరీకి తోడు బౌలింగ్‌లోనూ 4 వికెట్లు తీసి సత్తా చాటాడు. అంతేకాకుండా అద్భుతమైన రికార్డులు సృష్టించాడు. ఇప్పుడు టెస్టుల్లోనూ బ్యాట్ ఝులిపిస్తున్నాడు. ఫార్మాట్ ఏదైనా బ్యాట్‌తో రాణిస్తున్న అక్షర్ జట్టుకు మేలిమి బంగారంగా మారాడు.
అయితే ఆసిస్‌తో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో అక్షర్ బౌలింగ్‌లో మాత్రం రాణించలేకపోతున్నాడు. బ్యాటింగ్‌పై దృష్టిపెట్టడం వల్లనో లేక రోహిత్ అక్షర్‌ను సరిగా వాడడం లేదో గానీ మిగతా బౌలర్లలా రాణించలేకపోతున్నాడు. 2021లో స్వదేశంలో జరిగిన ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ టెస్టు సిరీస్‌లో అంతర్జాతీయ టెస్టు ఆరంగ్రటేం చేసిన అక్షర్ పటేల్ తొలి సిరీస్‌లోనే ఇంగ్లాండ్ బ్యాటర్లను ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించాడు. స్వదేశంలో ఆడిన ప్రతీ టెస్టు మ్యాచ్‌లోనూ ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేసి రికార్డు క్రియేట్ చేశాడు. కానీ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో 4 ఇన్నింగ్స్‌ల్లో కలిపి తీసింది ఒకే ఒక్క వికెట్ మాత్రమే.