అర్జెంటీనా సంబరాలు.. ఫ్రాన్స్‌లో మంటలు

By KTV Telugu On 19 December, 2022
image

అర్జెంటీనా అనుకుంది సాధించింది. తమ సూపర్‌ హీరో మారడోనాకు నివాళిగా ప్రపంచకప్‌ సాధిస్తామని టోర్నీకి ముందే మాటిచ్చిన మెస్సీ దాన్ని నిలబెట్టుకున్నాడు. 2014లో ఒంటిచేత్తో అర్జెంటీనా జట్టును ప్రపంచకప్‌ ఫైనల్‌కు చేర్చాడు మెస్సీ. అప్పట్లో కప్పు గెలవలేకపోయినా తన ప్రతిభతో గోల్డెన్‌ బూట్‌ అవార్డు దక్కించుకున్నాడు. ఈసారి ఫిపా వరల్డ్‌ కప్‌ ప్రారంభమైనప్పటినుంచీ మెస్సీ మ్యాజిక్‌ మీదే అందరి దృష్టి. అభిమానుల అంచనాలు వమ్ము చేయకుండా చివరికి తన జట్టుని ప్రపంచ విజేతగా నిలబెట్టాడు మెర్సీ. అర్జెంటీనాకు ఇది మూడో ప్రపంచకప్‌ టైటిల్‌. 1978, 1986లో కప్పు చేజిక్కించుకున్న అర్జెంటీనా ఇన్నేళ్లకు మళ్లీ ప్రపంచ విజేతగా నిలిచింది.

టోర్నీ ఆరంభ మ్యాచ్‌లో సౌదీ అరేబియా చేతిలో ఓటమి తర్వాత అర్జెంటీనా వెనక్కి తిరిగి చూడలేదు. మెస్సీ పోరాట పటిమ ఆ జట్టుని విజయతీరాలకు చేర్చింది. గ్రూప్‌ దశలో మెక్సికో, పోలాండ్‌పై నెగ్గింది. ప్రిక్వార్టర్స్‌లో ఆస్ట్రేలియాపై, క్వార్టర్స్‌లో నెదర్లాండ్స్‌పై, సెమీఫైనల్లో క్రొయేషియాపై అద్భుత విజయాలు సాధించింది. ప్రపంచకప్‌లో అత్యధిక విజయాల్లో పాలుపంచుకున్న ఆటగాడిగా మెస్సీ జర్మనీ దిగ్గజం మిరొస్లావ్‌ క్లోజ్‌ (17) సరసన చేరాడు. వరల్డ్‌కప్‌లో అత్యధిక మ్యాచ్‌లు (26) ఆడిన ఆటగాడిగా రికార్డు సొంతం చేసుకున్నాడు.

ప్రపంచకప్‌ చరిత్రలోనే అత్యధిక సమయం మైదానంలో ఉన్న ఆటగాడిగా కూడా మెస్సీదే రికార్డ్‌. అయితే ఈ ప్రపంచకప్‌తో అతను రిటైర్మెంట్‌ తీసుకోవాలని నిర్ణయించడం అభిమానులకు నిరాశ కలిగించింది.
ప్రపంచఫుట్‌బాల్‌ విజేతగా అర్జెంటీనాలో సంబరాలు అంబరాన్నంటాయి. ప్రజలు వీధుల్లోకి వచ్చి తమ జట్టు విజయంపై పండగ చేసుకుంటున్నారు. మరోవైపు ఫిఫా ఫుట్‌బాల్‌ ప్రపంచకప్‌ ఫైనల్‌లో అర్జెంటీనా చేతిలో డిఫెండింగ్‌ చాంపియన్‌ ఓటమితో ఫ్రాన్స్‌ అభిమానులు ఆగ్రహంతో ఊగిపోతున్నారు. ఫైనల్‌ మ్యాచ్‌ అయిపోగానే అల్లర్లు చెలరేగాయి. పారిస్‌ సహా కొన్ని నగరాల్లో జనం వీధుల్లో వీరంగం సృష్టించారు. పోలీసులపై రాళ్లు రువ్వారు. దీంతో టియర్‌గ్యాస్‌ ప్రయోగించాల్సి వచ్చింది. ఆటగాళ్ల సామర్థ్యానికి అదృష్టం కూడా కలిసిరావాలి. ఫ్రాన్స్‌ పోరాడి ఓడితే అర్జెంటీనాకు ఆ అదృష్టం దక్కిందంతే!