గతేడాది తన సంచలన బౌలింగ్‌తో అదరగొట్టిన టీమిండియా యువబౌలర్ అర్షదీప్. ఈ ఏడాదిలో మాత్రం తీవ్ర నిరాశపరుస్తున్నాడు. అద్భుతమైన యార్కర్లతో బ్యాటర్లను ఇబ్బంది పెట్టి తనకంటూ గుర్తింపు సాధించిన అతడు ఇటీవల ఇబ్బందికి గురవుతున్నాడు. లెంగ్త్‌లో బంతులను సంధించలేకపోతున్నాడు. నిన్నటి న్యూజిలాండ్ మ్యాచ్‌లో అర్షదీప్ చెత్త రికార్డు నమోదు చేశాడు. ఇన్నింగ్స్ చివరి ఓవర్ లో ఏకంగా 27 పరుగులు ఇచ్చాడు. నాలుగు ఓవర్లలో ఒక వికెట్ తీసి 51 పరుగులు ఇచ్చాడు. అందులోనూ ఒక నోబాల్ కూడా ఉంది. అర్షదీప్ భారీగా పరుగులు సమర్పించి టీమిండియా ఓటమికి కారణమయ్యాడని అభిమానులు మండిపడుతున్నారు.
ఐపీఎల్లో మెరుగైనా ప్రదర్శన చేసి టీం ఇండియాలో చోటు దక్కించుకున్న అర్షదీప్ తక్కువ కాలంలోనే కీలకమైన బౌలర్‌గా ఎదిగాడు. సంచలన ప్రదర్శనలతో భారత్ ఆశాకిరణంగా మారాడు. కీలక సమయాల్లో వికెట్లు తీస్తూ పొదుపుగా బౌలింగ్ చేసి జట్టుకు విజయాలందించాడు. ప్రధానంగా టీ20లో ఆరంగ్రేట్ చేసిన మొదట్లో అర్షదీప్ మెరుగైన ప్రదర్శననే చేశాడు. ప్రస్తుతం మునుపటి ఫామ్ కొనసాగించలేకపోతున్నాడు. శ్రీలంకపై నోబాల్స్‌తో విమర్శలకు గురైన అర్ష్‌దీప్ ఇప్పుడు న్యూజిలాండ్‌పై కూడా అదే నోబాల్స్ వేసి మరోసారి తీవ్రంగా నిరాశపరిచాడు. శ్రీలంకతో జరిగిన రెండో టీ20లోనూ అర్షదీప్ సింగ్ తేలిపోయాడు. కేవలం 2 ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేసి 37 పరుగులు ఇచ్చాడు. ఈ మ్యాచ్‌లో అతడు ఏకంగా ఐదు నోబాల్స్‌ను వేశాడు.
ఈ లెఫ్టార్మ్ ఫాస్ట్ బౌలర్ కివీస్‌తో జరిగిన ఫస్ట్ టీ 20లో తొలి మూడు ఓవర్లలో అద్భుతంగా బౌలింగ్ చేశాడు. ఒక్క నో బాల్ వేయకుండా కేవలం 24 పరుగులు మాత్రమే చేశాడు. దాంతో కెప్టెన్ పాండ్యా సింగ్‌కు 20వ ఓవర్లో బంతి ఇచ్చాడు. చివరి ఓవర్‌ను నో బాల్‌తో ప్రారంభించిన అతను మొత్తం 27 పరుగులు ఇచ్చి చెత్త రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. భారత్ తరపున 20వ ఓవర్లో అత్యధిక పరుగులు ఇచ్చిన ఆటగాడిగా అర్ష్‌దీప్ సింగ్ నిలిచాడు. ఈ లిస్టులో 2012లో దక్షిణాఫ్రికాపై 26 పరుగులు ఇచ్చిన మాజీ స్పిన్నర్ సురేశ్ రైనా రికార్డును బ్రేక్ చేశాడు. ఇది మాత్రమే కాదు ఒక ఓవర్లో అత్యధిక పరుగులు ఇచ్చిన భారత బౌలర్ల జాబితాలో అర్ష్‌దీప్ సింగ్ సంయుక్తంగా మూడవ స్థానానికి చేరుకున్నాడు.
అర్ష్‌దీప్ సింగ్ చెత్త రికార్డుల జాబితాలో మరికొన్ని కూడా చేరాయి. ఈ పేలవమైన ప్రదర్శనతో అతను టీ20 అంతర్జాతీయ క్రికెట్లో రెండుసార్లు ఓవర్లో 25 లేదా అంతకంటే ఎక్కువ పరుగులు ఇచ్చిన ఏకైక భారతీయ బౌలర్‌గా నిలిచాడు. న్యూజిలాండ్ కంటే ముందు అర్ష్‌దీప్ సింగ్ గౌహతిలో దక్షిణాఫ్రికాపై 19వ ఓవర్లో 26 పరుగులు ఇచ్చాడు. అర్ష్‌దీప్ సింగ్ టీ20 ఇంటర్నేషనల్‌లో అత్యధిక నో బాల్‌లు వేసిన బౌలర్‌గా నిలిచాడు. అతి తక్కువకాలంలోనే కెరీర్లో ఇప్పటివరకు 15 నో బాల్స్ బౌలింగ్ చేశాడు. ఈ జాబితాలో పాకిస్థాన్‌కు చెందిన హసన్ అలీ 11 నో బాల్స్‌తో రెండో స్థానంలో ఉన్నాడు.