ఫిఫా సాకర్ వరల్డ్ కప్‌లో మెస్సీ రికార్డుల వరద

By KTV Telugu On 14 December, 2022
image

సాకర్ వరల్డ్ కప్‌లో మిస్టర్ 10 రికార్డుల వరద పారిస్తున్నాడు. అర్జెంటీనాను ఫైనల్‌కు చేర్చిన మెస్సీని చూసి ఆ దేశం ఉప్పొంగిపోతోంది. 10నంబర్ జెర్సీలో తనదైన ఆటతీరుతో దూసుకుపోతున్నాడు ఈ అర్జెంటీనా ఫుట్ బాల్ మాంత్రికుడు. అతని ముందు ప్రపంచ రికార్డులు దాసోహమైపోతున్నాయి. ఈ ప్రపంచకప్‌ టోర్నీలో ఎవరికీ సాధ్యం కాని అద్భుతాలు సృష్టిస్తున్నాడు మెస్సీ. క్రొయేషియాతో జరిగిన సెమీ ఫైనల్‌లో ఒక గోల్‌ చేయడంతోపాటు మరో గోల్‌ చేయడానికి సహకరించి ప్లేయర్‌ ఆఫ్‌ది మ్యాచ్‌ అవార్డు దక్కించుకొన్నాడు. ఈ టోర్నీలో అర్జెంటీనా ఆడిన ఆరు మ్యాచుల్లో నాలుగు సార్లు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ సొంత చేసుకున్నాడు.

సూపర్ ఫామ్‌లో ఉన్న మెస్సీ ఈ వరల్డ్ కప్‌లో అద్భుతమైన ఆటతీరు కనబరుస్తున్నాడు. ఒక వరల్డ్‌కప్‌లో నాలుగుసార్లు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ దక్కించుకోవడం మెస్సీకి ఇది రెండోసారి. 2014లోనూ అతను ఈ ఘనత సాధించాడు. ఐదు ప్రపంచకప్‌లలో 10 సార్లు ఈ అవార్డు దక్కించుకొన్న ఆటగాడిగా మెస్సీ రికార్డ్ సృష్టించాడు. ఈ టోర్నీ మొత్తంలో ఇప్పటి వరకు ఐదు గోల్స్‌ చేయగా మరో మూడు గోల్స్‌కు సహకరించాడు. అర్జెంటీనాకు తెలివైన జట్టు ఉందని గేమ్‌ను ఎక్కడ బిగించాలో తమకు అవగాహన ఉందని మెస్సీ అంటున్నాడు. ఖతర్‌లో కప్ కొడతామని ధీమా వ్యక్తం చేస్తున్నాడు.

క్రొయేషియాతో జరిగిన సెమీఫైనల్‌లో 3-0తేడాతో అర్జెంటీనా గెలుపొంది ఫైనల్‌లో అడుగుపెట్టింది. మరో సెమీస్‌లో ఫ్రాన్స్, మొరాకోలు తలపడనున్నాయి. ఏమాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగిన మొరాకో ఏకంగా సెమీఫైనల్‌కు చేరడం విశేషం. సెమీస్ దాకా వచ్చిన ఆఫ్రికా జట్టుగా మొరాకో రికార్డ్ సృష్టించింది. డిఫెండింగ్ ఛాంపియన్‌ ఫ్రాన్స్‌పై నెగ్గి ఫైనల్‌లో అడుగుపెట్టాలని ఉవ్విళ్లూరుతోంది. అయితే ఫ్రాన్స్‌ లాంటి బలీయమైన జట్టును ఎదుర్కోవడం ఆ జట్టుకు పెనుసవాలే. ఈ రెండింటిలో గెలిచిన ఏదో ఒక జట్టుతో అర్జెంటీనా ఫైనల్‌లో తలపడనుంది.