నరాలు తెగే ఉత్కంఠ. హార్ట్ బీట్‌ను అమాంతం పెంచే ఆట.
గ్రౌండ్లో ఆటగాడు మెరుపు వేగంతో ప్రత్యర్థి గోల్‌పోస్టువైపు దూసుకుపోతుంటే గ్యాలరీలో కూచున్న ప్రేక్షకులు ఊపిరి బిగపట్టేస్తారు. బంతి గింగిరాలు తిరుగుతూ గాల్లోకి లేవగానే అది గోల్ పోస్టులోకి వెళ్తుందా లేదా అని టీవీల ముందు కూచున్న క్రీడాభిమానుల నరాలు చిట్లిపోతాయి. అలాంటి హైవోల్టేజీ ఆటకు రంగం సిద్ధమైంది. కోట్లాదిమంది కళ్లప్పగించి చూసే ప్రపంచకప్ ఫుట్‌బాల్ సమరం ఇంకొద్ది గంటల్లో మొదలు కాబోతోంది. అటు అర్జంటీనా ఇటు ఫ్రాన్స్ ఏదీ తక్కువ కాదు. గతంలో రెండు జట్లూ రెండేసి సార్లు ప్రపంచ కప్‌ను ఎగరేసుకుపోయినవే. ఇప్పుడు ఎదురెదురుగా నిల్చున్నాయి. ఇటువైపు అర్జంటీనా మెరుపు వీరుడు మెస్సీ అటువైపు ఫ్రాన్స్ తురుపుముక్క కిలియాన్ ఎంబాపె. ఇద్దరూ మైదానంలో పాదరసంలా కదులుతూ కళ్లు మూసి తెరిచేలోగా గోల్ పోస్టులోకి పంపించే మాయగాళ్లు. అర్జంటీనాకు ఇది ఆరో ప్రపంచ కప్ ఫైనల్. 1978, 1986లో ప్రపంచ కప్ గెలుచుకుంది. ఫ్రాన్స్‌కు ఇది నాలుగో ప్రపంచ కప్ ఫైనల్. 1998, 2018లో టైటిల్ నెగ్గింది.
ఎనిమిదేళ్ల క్రితం అందినట్టే అంది చేజారిన ప్రపంచ కప్‌ను ఈసారి చేజార్చుకోకూడదని అర్జంటీనా జట్టు భావిస్తోంది. ఈరోజు జరిగే ప్రపంచ కప్ ఫైనల్ తనకు చివరి మ్యాచ్ కాబోతోందని మెస్సీ ప్రకటించారు. ఈ ప్రపంచ కప్‌ను గెలిచి తన దేశానికి, తనకు చిరస్మరణీయం చేసుకోవాలనే ఉవ్విళ్లూరుతున్నారు.
నిజానికి టైటిల్ ఫేవరేట్‌గా ఖతర్‌లో అడుగుపెట్టిన అర్జంటీనా మొదటి మ్యాచ్‌లోనే సౌదీ అరేబియా చేతిలో అనూహ్యంగా ఓడిపోయింది. కానీ రెండో మ్యాచ్ నుంచి అర్జంటీనా చెలరేగిపోయింది. మెస్సీ మ్యాజిక్‌తో జట్టు పుంజుకుంది. మెరుపు వేగంతో కదులుతూ ప్రత్యర్థి డిఫెండర్లను బోల్తా కొట్టిస్తూ మెస్సీ ఐదు గోల్స్ చేశారు. కేవలం మేస్సీ ప్రతిభ మీదే అర్జంటీనా ఫైనల్ వరకు వచ్చింది. కానీ ఫ్రాన్స్ సమష్టి ఆటతో ఫైనల్‌కు చేరుకుంది. 23 ఏళ్ల కిలియాన్ ఎంబాపె ఐదు గోల్స్‌తో అదరగొట్టగా 36 ఏళ్ల ఒలివియర్ జిరూద్ నాలుగు గోల్స్‌తో మెరిపించాడు. 1998లో ఫ్రాన్స్ తొలిసారి ప్రపంచ కప్ గెలుచుకుంది. ఆనాటి జట్టులో ఒక ఆటగాడైన దీదీర్ దెషాంప్స్ కోచ్‌గా మారి 2018లో ఫ్రాన్స్‌కు రెండోసారి ప్రపంచ కప్‌ను అందించాడు. ఇప్పుడు ఫైనల్‌కు చేరుకున్న ఆ దేశం మూడోసారి విశ్వ విజేతగా నిలుస్తుందా లేదా అని అభిమానులు ఆత్రంగా ఎదురుచూస్తున్నారు. గెలుపు ఎవరిదైనా రెండు జట్ల ఆటగాళ్లు కొదమ సింహాల్లా తలపడబోతున్న ఈ మ్యాచ్ అభిమానులకు కావలసినంత జోష్ నింపడం ఖాయం.