బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో టీంమిండియా ఆల్‌రౌండర్లు దుమ్ముదులుపుతున్నారు. అశ్విన్, జడేజా, అక్షర్‌ల త్రయం ఆసిస్ భరతం పడుతున్నారు. టాప్ ఆర్డర్ విఫలమైనా డోంట్ వర్రీ అంటూ బ్యాట్‌తో స్కోరు బోర్డును పెంచుతున్నారు. బంతిని గింగిరాలు తిప్పుతూ కంగారులను ముప్పుతిప్పలు పెడుతున్నారు. టీమిండియాకు వెన్నుముఖగా నిలుస్తూ ఈ త్రిమూర్తులు రెండు టెస్టు విజయాలు అందించారు. నాగ్‌పూర్, ఢిల్లీ మ్యాచ్ ఏదైనా ఆ ముగ్గురే అన్నీ తామై వ్యవహరిస్తున్నారు. కొందరు బ్యాట్స్‌మెన్లు ఆశించిన మేర రాణించకపోయినా ఈ ముగ్గురూ జట్టు బాధ్యతలను తమ భుజాలపై మోస్తున్నారు. ఆసిస్‌ను అతి తక్కువ స్కోర్లకే కట్టడి చేస్తూ కంగారుపుట్టిస్తున్నారు.
బోర్డర్ – గావస్కర్ ట్రోఫీలో టీమ్‌ఇండియా 2-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. మార్చి 1నుంచి జరగనున్న మరో టెస్టులోనూ విజయం సాధిస్తే టెస్టుల్లో టాప్ ర్యాంక్‌తోపాటు ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు దూసుకెళ్లనుంది భారత్. ఢిల్లీ టెస్టులో ఆస్ట్రేలియన్లకు చుక్కలు చూపించాడు జడేజా. మొత్తం పది వికెట్లు పడగొట్టాడు. మొదటి ఇన్నింగ్స్‌లో 3 వికెట్లు తీసిన జడేజా, రెండో ఇన్నింగ్స్‌లో ఏకంగా 7 వికెట్లతో కంగారులను కోలుకోలేని దెబ్బతీశాడు. తన కెరీర్‌లో ఇవే టెస్టుల్లో అతడి అత్యుత్తమ గణాంకాలు కావడం విశేషం. చివరి ఐదు వికెట్లను రవీంద్ర జడేజానే తీయగా అందులో నాలుగు క్లీన్‌బౌల్డ్ చేయడం గమనార్హం. నాగ్ పూర్ టెస్టులోనూ బ్యాట్ ఝులిపించి హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు జడేజా.
ఇక, అశ్విన్ రెండు ఇన్నింగ్స్‌లలో కలిపి ఆరు వికెట్లు తీశాడు. రవిచంద్రన్ అశ్విన్ 2020 నుంచి టెస్టుల్లో 98 వికెట్లు తీశాడు. అంతేకాదు బ్యాటుతోనూ అదరగొట్టి 712 పరుగులు చేశాడు. ఈ రెండేళ్లలో ప్రపంచంలో ఏ ఆల్‌రౌండర్ క్రికెటర్ కూడా 90+ వికెట్లు తీసి 500+ పరుగులు చేయలేదు. అక్షర్ బౌలింగ్‌లో రాణించలేకపోయినప్పటికీ బ్యాటింగ్‌లో ఇరగదీస్తున్నాడు. ఢిల్లీ టెస్టులో భారత్ విజయానికి పునాది వేసింది మాత్రం అక్షర్ పటేల్ ఇన్నింగ్సే. ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో చేసిన 263 పరుగులకు దగ్గరగా భారత్ వచ్చిందంటే దానికి కారణం అక్షర్. 139 పరుగులకే ఏడు వికెట్లు పడిన వేళ అశ్విన్ (37)తో కలిసి అక్షర్ పటేల్ (74) హాఫ్ సెంచరీ సాధించి జట్టును గౌరవప్రదమైన స్థానంలో నిలబెట్టాడు. లేకపోతే టీమ్‌ఇండియా తొలి ఇన్నింగ్స్‌లో త్వరగా ఆలౌటై ఉంటే పరిస్థితి మరోలా ఉండేది.
కేఎల్ రాహుల్ మరోసారి విఫలమయ్యాడు. రెండు టెస్టు మ్యాచ్‌లలో కలిపి రాహుల్ కనీసం 50పరుగులు కూడా చేయలేకపోయాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో అన్ని ఫార్మాట్లు కలిపి 25వేల పరుగులను విరాట్ పూర్తిచేసుకోగా వందో టెస్టు మ్యాచ్ ఆడుతున్న పుజారా జట్టును విజయతీరాలకు చేర్చాడు. విన్నింగ్ షాట్ కూడా పుజారాదే కావడం విశేషం. 100 టెస్టు మ్యాచ్ ఆడుతున్న పుజారాకు ఇదొక విన్నింగ్ గిఫ్ట్. తొలి ఇన్నింగ్స్‌లో డకౌటైన బాధలో ఉన్న పుజారాకు మ్యాచ్ విజయం ఊరటనిచ్చింది.