బంగ్లాపై భారత్ ట్రాక్ రికార్డ్‌..

By KTV Telugu On 3 December, 2022
image

రేపే భారత్,బంగ్లా మధ్య తొలి వన్డే
మూడు వన్డేలు..రెండు టెస్టులు
తిరిగి జట్టులోకి వచ్చిన సీనియర్లు
గాయంతో షమీ ఔట్.. టీమిండియాకు షాక్

బంగ్లాదేశ్‌తో వన్డే సిరీస్‌కు ముందు టీమిండియాకు షాక్ తగిలింది. గాయం కారణంగా పేసర్ షమీ సిరీస్ మొత్తానికి దూరం అయ్యాడు. బీసీసీఐ ఈ మేరకు ట్వీట్‌ చేసింది. భుజం గాయంతో షమీ ఇబ్బందిపడుతున్నట్లు బీసీసీఐ వెల్లడించింది. షమీ స్థానంలో భారత యువ పేసర్‌ ఉమ్రాన్‌ మాలిక్‌కు జట్టులో చోటు కల్పించారు. వన్డేల్లో షమీ లేకపోవడం పెద్ద ఇబ్బందేమీ ఉండకపోవచ్చు గానీ టెస్ట్‌ల్లో ఇబ్బందులు తప్పేలా లేవు. వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్ రేసులో నిలవాలంటే టీమిండియా ప్రతి మ్యాచ్ గెలవాల్సిన అవసరం ఉంది.

జస్‌ప్రీత్ బుమ్రా గాయంతో తప్పుకోవడంతో ఆఖరి నిమిషంలో మెగా టోర్నీకి ఎంపికైన షమీ పర్వాలేదనిపించాడు. టీ20 ప్రపంచకప్ అనంతరం విశ్రాంతి తీసుకున్న షమీ ట్రైనింగ్‌లో గాయపడినట్లు తెలుస్తోంది. ఇప్పటికే భారత జట్టులో బూమ్రా లేని లోటు స్పష్టంగా కనిపిస్తోంది. ఇక షమీ కూడా టెస్టు సిరీస్‌కూ దూరమైతే ఆందోళన చెందాల్సిన విషయమేనంటూ ఓ బీసీసీఐ అధికారి తెలిపారు. షమీ ఇప్పటి వరకూ 60 టెస్టు మ్యాచ్‌ల్లో 216 వికెట్లు పడగొట్టాడు.

సీనియర్లు కెప్టెన్ రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ తిరిగి జట్టుతో చేరారు. టీ20 వరల్డ్ కప్ తరువాత విశ్రాంతి తీసుకున్న ఈ ముగ్గురు ఇప్పుడు బంగ్లా టూర్‌లో ఆడబోతున్నారు. బంగ్లా పర్యటనలో ఆతిథ్య జట్టుతో టీమిండియా మూడు వన్డేలు, రెండు టెస్టులు ఆడనుంది. ఆదివారం భారత్, బంగ్లాదేశ్‌ల మధ్య తొలి వన్డే జరగనుంది. డిసెంబర్ 7న రెండో వన్డే, 10న మూడో వన్డే జరగనుంది. మొత్తం మూడు వన్డేలు ఢాకా‌లోని షేర్ ఈ బంగ్లా నేషనల్ స్టేడియంలోనే జరగనున్నాయి. ఇక డిసెంబర్ 14-18 వరకు చట్టోగ్రమ్ వేదికగా తొలి టెస్ట్, డిసెంబర్ 22-26 వరకు ఢాకా వేదికగా రెండో టెస్ట్ జరగనుంది.

వచ్చే వన్డే వరల్డ్ కప్‌ను దృష్టిలో ఉంచుకొని బీసీసీఐ ఇప్పటి నుంచే ప్రణాళికలు రచిస్తోంది. సీనియర్లు, జూనియర్ల కలయికతో భారత్ పటిష్టంగా కనిపిస్తోంది. టీ20 వరల్డ్ కప్‌లో విఫలమైన కెప్టెన్ రోహిత్ శర్మకు ఈ సిరీస్‌కు కీలకంగా మారనుంది. అదేవిధంగా కేఎల్ రాహుల్, రిషబ్ పంత్ వంటి ప్లేయర్లకు బంగ్లా టూర్‌ పరీక్షగా మారనుంది. ముఖ్యంగా పంత్ ఈ సిరీస్‌లో విఫలమైతే జట్టులో చోటు గల్లంతవ్వడం ఖాయంగా కనిపిస్తోంది. మరోవైపు విరాట్ కోహ్లి ఈ సీజన్‌లో అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. టీ20 ప్రపంచ కప్‌లో టీమిండియా తరపున అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. బంగ్లాదేశ్‌పై ఈ రన్‌ మెషీన్ అదేఫామ్‌ను కంటిన్యూ చేస్తే టీమిండియాకు ఇక తిరుగుండదు. బౌలర్లు కూడా స్థాయి తగ్గ ప్రదర్శన చేస్తే బంగ్లాకు కష్టాలే.

భారత్, బంగ్లాదేశ్‌ జట్లు ఇప్పటివరకు 9 టెస్టులు, 36 వన్డేలు, 12 టీ20ల్లో తలపడ్డాయి. బంగ్లాదేశ్‌ జట్టు ఇప్పటివరకు భారత్‌పై టెస్టుల్లో బోణీ కొట్టింది లేదు. వన్డేల్లో భారత్ 30 మ్యాచ్‌లు గెలవగా బంగ్లా 5 మ్యాచ్‌లు గెలుచుకుంది. ఇక టీ 20లో టీమిండియా 11 గెలిస్తే, బంగ్లాదేశం కేవలం ఒక్క మ్యాచ్ మాత్రమే విన్ అయ్యింది.

రేపు బంగ్లాతో తలపడనున్న ఢాకా స్టేడియంలో భారత జట్టు గతంలో పలు రికార్డులు బద్దలు కొట్టింది. అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్ రెండు విభాగాల్లో అద్భుతంగా రాణించింది. ఈ మైదానంలో 2014లో భారత్ తరఫున స్టువర్ట్ బిన్నీ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో 6 పరుగులే ఇచ్చి 5 వికెట్లు తీసుకున్నాడు. 2011లో బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత జట్టు 370/4 పరుగులు సాధించింది. అతిపెద్ద ఛేజింగ్ కూడా భారత్ చేసిందే కావడం గమనార్హం. 2012లో పాకిస్తాన్‌ నిర్దేశించిన 330 పరుగుల లక్ష్యాన్ని భారత జట్టు ఛేదించింది. అలాగే ఈ స్టేడియంలో అత్యల్ప స్కోరుకు బంగ్లాదేశ్‌ను ఆలౌట్ చేసింది కూడా భారతే. ఇక్కడ 2014లో జరిగిన మ్యాచ్‌లో బంగ్లా టైగర్స్‌ను 58 పరుగులకే ఆలౌట్ చేసింది టీమిండియా.