ఆలస్యం, అమృతం, విషం

By KTV Telugu On 11 November, 2022
image

ఆలస్యమైతే అమృతం కూడా విషమవుతుందంటారు. అది నిజజీవితానికే కాదు ఆటకు కూడా వర్తిస్తుంది. భారత క్రికెట్లో కొంతమంది సీనియర్ ఆటగాళ్లకు రిటైర్మెంట్ ఇవ్వకపోతే జట్టు మనుగడకే ప్రమాదం రావచ్చు. అదెలాగో చూద్దాం.

టీ- 20 సెమీఫైనల్స్ ఓటమితో గుణపాఠాలు
ఏళ్ల తరబడి జట్టును పట్టుకు వెలాడుతున్న ప్లేయర్స్
తీసేద్దామనుకునే లోపే భారీ స్కోర్ చేసి ఎస్కేప్
ఇకపై కొనసాగించి లాభం లేదన్న భావన

టీ-20 సెమీఫైనల్స్ లో భారత జట్టు ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. వికెట్ కోల్పోకుండా లక్ష్యాన్ని ఛేదించిన ఇంగ్లండ్ జట్టు సగటు భారత అభిమాని నెత్తిన పిడుగు పడేసింది. స్ట్రాంగ్ టీమ్ అనుకున్న ఇండియాకు ఇంతటి దురవస్థ ఏమిటని క్రీడాభిమానులు ప్రశ్నించుకుంటున్నారు. ఓటమిపై పోస్ట్ మార్టం ప్రారంభమైన వెంటనే ప్లేయర్స్ తీరుపై చర్చ మొదలైంది. సగం జట్టును సాగనంపడం మినహా వేరు గత్యంతరం లేదని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. వరుస వైఫల్యాలు చెందుతున్న కొందరు క్రీడాకారులను తీసేద్దామనుకునే లోపే భారీ స్కోరు చేయడంతో వారిని కొనసాగిస్తున్నామని ఇకపై అలాంటి పొరబాట్లు చేయబోవడం లేదని బీసీసీఐ వర్గాలు చెబుతున్నాయి. అందుకే వచ్చే సీజన్ నాటికి సరికొత్త టీమ్ ను సిద్ధం చేయాలని బీసీసీఐ భావిస్తున్నట్లు సమాచారం

30 ఏజ్ దాటిన వారికి ఉద్వాసనే
సెంటిమెంట్ పెట్టుకోకూదనుకుంటున్న సెలక్టర్లు
కొత్త పేసర్లకు అవకాశం
స్పిన్నర్లను కూడా మార్చాల్సిందే

భారత జట్టులో చాలా రోజులుగా పాతుకుపోయి 30 ఏళ్ల వయసు దాటిన వారిని సాగనంపే ప్రక్రియ ప్రారంభించాలని బీసీసీఐలో చర్చ జరుగుతోంది. ఒక ప్లేయర్ ఆడితే మ్యాచ్ గెలుస్తామని, మరోకరు ఉంటే ఆన్ ఫీల్డ్ వ్యూహాలకు ఉపయోపడతారని, ఆఖర్లో బ్యాటింగుకు వచ్చినా మూడు ఓవర్లలో నలభై పరుగులు చేస్తారని సెంటిమెంటు పెట్టుకోవడం కరెక్టు కాదని సెలక్టర్లు ఆలస్యంగా గుర్తించారు. భువనేశ్వర్ కుమార్, మొహ్మద్ షమీ వరుస వైఫల్యాలతో బౌలింగ్ విభాగం బలహీనమైంది. ఒకటి రెండు మ్యాచులు మినహా భారత స్పిన్నర్లను ప్రత్యర్థులు ఉతికి ఆరేశారు. అందుకే భూవి, షమి, ఆశ్విన్, అక్షర్ లకు బయటకు వెళ్లే దారి చూపించాల్సిందే. చెహల్ కు ఎక్కువ అవకాశాలు ఇవ్వాల్సిన తరుణం ఆసన్నమైంది. 30 ఏళ్లు దాటిన వారిలో కోహ్లీ ఒక్కడే కన్సిస్టెంట్ ఫార్మ్ ను ప్రదర్శిస్తున్నాడు.

కెప్టెన్ ను మార్చాల్సిందేనా?
తదుపరి కెప్టెన్ ఎవరు
భారత్ జట్టుకు ఓపెనింగ్ బెడద
దినేష్ కార్తీక్ కు రిటైర్మెంట్ ఇవ్వాల్సిన తరుణం

కెప్టెన్ ను మార్చాల్సిన తరుణం వచ్చేసింది. రోహిత్ శర్మ కెప్టెన్ గా సక్సెస్ రేటు బాగానే ఉన్నా ఓపెనర్ గా తీవ్ర వైఫల్యం చెందాడు. మొదటి ఆరు ఓవర్లలో గౌరవ ప్రదమైన స్కోరు చేసి మిడిల్ ఓవర్స్ కు జట్టును సిద్ధం చేయలేకపోతున్నాడు దానితో మిడిలార్డర్ పై ఒత్తిడి పెరుగుతోంది. మరో ఓపెనర్ కేఎల్ రాహుల్ పరిస్థితి కూడా అంతంతమాత్రంగానే ఉంది. టోర్నీ మొత్తం మీద ఒక హాఫ్ సెంచురీ మినహా ఏ ఇన్నింగ్స్ లోనూ పట్టుమని పది పరుగులు చేయలేదు. బాగా ఆడగలిగే పృధ్వీ షా, ఇషాన్ కిషన్ లు ఉన్నప్పటికీ వారికి అవకాశాలు రావడం లేదు. ఇక వికెట్ కీపర్ దినేష్ కార్తీక్ ను కూడా కొనసాగించి ప్రయోజనం లేదనిపిస్తోంది. కీలక సమయాల్లో క్యాచులు వదిలేయ్యడం, స్టంపింగుకు చేయలేకపోవడం జరుగుతోంది. అతని కోసం రిషబ్ పంత్ ను ఎక్కువ సార్లు డగౌట్ కు పరిమితం చేయాల్సి వస్తుంది. కెప్టెన్ గా రోహిత్ శర్మను కొనసాగించకూడదన్న వాదన కూడా వినిపిస్తోంది. అతడ్ని తొలగించాల్సిన పరిస్థితి వస్తే హార్దిక్ పాండ్యాకు కెప్టెన్సీ అప్పగిస్తే ఏడాది కాలంలో రాటు తేలి వచ్చే టీ – 20 వరల్డ్ కప్ కు జట్టును పటిష్టం చేస్తాడని మాజీ కెప్టెన్, ప్రముఖ కామెంట్రేటర్ సునీల్ గవాస్కర్ అభిప్రాయపడుతున్నారు. గవాస్కర్ సలహాను సెలక్టర్లు పరిగణిస్తారో లేదో చూడాలి.