ఈ ఏడాదంతా క్రికెట్ అభిమానులకు పండుగే. వన్డే వరల్డ్ కప్‌లకు ముందు వరుస సిరీస్‌లతో టీమిండియా బిజీ షెడ్యూల్ గడపనుంది. ప్రస్తుతం శ్రీలంకతో వన్డే సిరీస్ ఆడుతోన్న భారత్ అనంతరం న్యూజిలాండ్‌తో సొంతగడ్డపై మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడనుంది. అయితే జనవరి 18న హైదరాబాద్ వేదికగా జరగనున్న తొలి వన్డేతో కివీస్ తమ పర్యటనను ప్రారంభించనుంది. సుమారు నాలుగేళ్ల తర్వాత హైదరాబాద్ అంతర్జాతీయ వన్డేకు ఆతిథ్యం ఇవ్వనుంది. దాంతో ఈ మ్యాచ్ నిర్వహణను హెచ్‌సీఏ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరగనున్న ఫస్ట్ వన్డే కోసం శుక్రవారం నుంచి టికెట్లు విక్రయించనున్నారు.
గతేడాది ఆస్ట్రేలియాతో టీ20 సందర్భంగా టికెట్ల విక్రయంలో జరిగిన తొక్కిసలాటను దృష్టిలో ఉంచుకుని హెచ్‌సీఏ తగు జాగ్రత్తలు తీసుకుంటోంది. ఈసారి టికెట్లను కేవలం ఆన్లైన్లో పేటీఎం వేదికగా మాత్రమే విక్రయిస్తున్నారు. ఆఫ్‌లైన్‌లో టికెట్ విక్రయిలుండవని జనవరి 13 నుంచి 16 వరకు విడతల వారీగా పేటీఎంలో టికెట్లు అందుబాటులో ఉంటాయని హెచ్‌సీఏ అధ్యక్షుడు అజారుద్దీన్ తెలిపారు. ఆన్లైన్లో విక్రయించిన టికెట్లను ఎల్బీ స్టేడియం, గచ్చిబౌలి స్టేడియంలలో జనవరి 15 నుంచి 18 వరకు ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు తీసుకోవాలని సూచించారు.
ఉప్పల్ స్టేడియం సామర్థ్యం 39,112 కాగా ఇందులో 9695 కాంప్లిమెంటరీ టికెట్స్ పోగా మిగతా 29, 417 టికెట్లను ఆన్లైన్లో మాత్రమే అమ్ముతున్నారు. బ్లాక్‌లో టికెట్లు అమ్ముతున్నారనే అపవాదు హెచ్‌సీఏపై ఉంది. తొక్కిసలాట ఘటన, బ్లాక్ విక్రయాలకు సంబంధించి అప్పట్లో ప్రభుత్వ జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. దాంతో లోటుపాట్లను సవరించినట్లు హెదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు చెబుతున్నారు.
న్యూజిలాండ్ జట్టు జనవరి 14న హైదరాబాద్‌కు రానుండగా టీమిండియా మాత్రం జనవరి 16న నగరానికి రానుందని చెబుతున్నారు. ఈ మ్యాచ్ తర్వాత ఇరు జట్ల మధ్య జనవరి 21న రాయ్‌పూర్ వేదికగా రెండో వన్డే 24న ఇండోర్ వేదికగా మూడో వన్డే జరగనుంది. అనంతరం జనవరి 27న రాంచీలో తొలి టీ20, 29న లక్నోలో రెండో టీ20, ఫిబ్రవరి 1న అహ్మదాబాద్‌లో థర్డ్ టీ20 జరగనుంది. వన్డే మ్యాచ్‌లు మధ్యాహ్నం 2 గంటల నుంచి ప్రారంభం కానుండగా టీ20లు రాత్రి 7 గంటల నుంచి మొదలవ్వనున్నాయి. ఆ తర్వాత ఆస్ట్రేలియాతో టెస్ట్, వన్డే సిరీస్‌లు ఆడనుంది టీమిండియా.