కేఎల్ కెప్టెన్ ఇన్నింగ్స్‌ ఇదేనా.!

By KTV Telugu On 23 December, 2022
image

బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్‌లో టీమిండియా ఓపెనర్ కేఎల్ రాహుల్ పేలవ ప్రదర్శన కొనసాగిస్తున్నాడు. కేఎల్ కెప్టెన్ ఇన్నింగ్స్‌పై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. టెస్ట్ సిరీస్‌కు ముందు ధనా ధన్ బ్యాటింగ్ చూస్తారని చెప్పిన రాహుల్ దారుణమైన జిడ్డు ఆటతో పరుగులు చేయకుండానే పెవిలియన్‌కు చేరుతున్నాడు. దాంతో రాహుల్ బ్యాటింగ్‌ తీరుపై క్రీడాభిమానులు మండిపడుతున్నారు. ఫస్ట్ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 22 పరుగులు, రెండో ఇన్నింగ్స్‌లో 23 పరుగులు చేసి ఘోరంగా విఫలమైన రాహుల్ రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లోనూ అదే ఆట తీరును కనబర్చాడు. 45బంతులు ఎదుర్కొని 10పరుగులకే పెవిలియన్ బాట పట్టాడు.

బంగ్లాతో జరిగిన వన్డే సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్న రాహుల్ మిగతా రెండింటిలో పూర్తిగా విఫలమయ్యాడు. టెస్టు సిరీస్‌లోనూ తన వైఫల్యాన్ని కొనసాగిస్తున్నాడు. హిట్ మ్యాన్ రోహిత్ శర్మ గాయంతో తప్పుకోవడంతో బంగ్లాపై టెస్ట్‌ సిరీస్‌కు కేఎల్‌కు కెప్టెన్ బాధ్యతలు అప్పగించారు. తొలి టెస్టులో భారత్ విజయం సాధించడంతో కేఎల్ ఆటతీరుపై పెద్దగా ఎవరూ పట్టించుకోలేదు. కానీ రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో అతని ఆటతీరు చూసిన ప్రతీ ఒక్కరూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

లక్కీగా కెప్టెన్ అయ్యావు కాబట్టి సరిపోయింది లేకపోతే జట్టులో స్థానమే ఉండేది కాదంటూ రాహుల్‌పై క్రికెట్ ఫ్యాన్స్ ఫైరవుతున్నారు. టీ20 వరల్డ్ కప్ నుంచి స్థాయికి తగ్గట్టు ఆడలేకపోతున్నావ్ ఏమైంది నీకు అంటూ సోషల్ మీడియా వేదికగా నిప్పులు చెరుగుతున్నారు. రాహుల్ స్థానంలో మరో బ్యాటర్ ఉంటే కచ్చితంగా తీసేసేవాళ్లని అంటున్నారు. పరిమిత సంప్రదాయ క్రికెట్‌లో అతడి వైఫల్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. అయినా ఛాన్స్‌లు ఇస్తున్నారంటూ కొందరు తప్పుబడుతుంటే రాహుల్ రిటైర్ అయితేనే జట్టు బాగుపడుతుందని మరికొందరు సలహా ఇస్తున్నారు.

మరోవైపు ఫస్ట్ టెస్ట్‌లో బౌలింగ్, బ్యాటింగ్‌ విభాగంలో అద్భుతంగా రాణించిన కుల్దీప్ యాదవ్‌ను తుదిజట్టులో తీసుకోకపోవడం ప్రతీ ఒక్కరినీ షాక్‌కు గురిచేసింది. టీమిండియా మేనేజ్ మెంట్ తీరుపై సునీల్ గవాస్కర్ తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. ముఖ్యంగా కేఎల్ రాహుల్ రాహుల్ ద్రవిడ్‌ను టార్గెట్ చేశాడు. టెస్టులో బౌలింగ్ విభాగంలో చాలా రోజుల తర్వాత మైదానంలోకి అడుగుపెట్టిన కుల్దీప్ యాదవ్ అదరగొట్టాడు. తొలి టెస్టులో 8 వికెట్లు తీసి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు. ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 40 పరుగులతో రాణించాడు. అలాంటి ప్లేయర్ పై వేటు వేయడమేంటని గవాస్కర్ మండిపడ్డారు. అద్భుతంగా రాణించే ఆటగాళ్లను పక్కనబెట్టడం ఫామ్‌లేని ఆటగాళ్లను కొనసాగించడం. గత కొంతకాలంగా మన సెలెక్టర్లు చేస్తున్న పని ఇదే. అందుకే ఈ విమర్శలు.