శ్రీలంకతో టీ20 సిరీస్ హార్థిక్ పాండ్యా కెప్టెన్సీకి అటు యువ ఆటగాళ్ల సత్తా అగ్నిపరీక్షగా మారింది. వన్డే వరల్డ్ కప్‌కు ముందు తామేంటో నిరూపించుకునే అవకాశం యువ ఆటగాళ్లకు దక్కింది. కానీ, అభిమానుల ఆశలను యంగ్ ప్లేయర్లు అడియాశలు చేస్తున్నారు. అటు బౌలింగ్ ఇటు బ్యాటింగ్ విభాగాల్లో ఆశించిన మేర రాణించలేకపోతున్నారు. సొంతగడ్డపై సిరీస్ ఈజీగా గెలుస్తామనుకున్న హార్థిక్ సేనకు లంక చెమటలు పట్టిస్తోంది. తొలి టీ20లో చివరి వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో అదృష్టం కలిసొచ్చి భారత్ 2పరుగుల తేడాతో గెలుపొందింది. కానీ రెండో టీ 20లో పేలవ ప్రదర్శనతో మ్యాచ్ చేజారిపోయింది. అక్షర్, సూర్యలాంటి ఒకరిద్దరు ఆటగాళ్లు మినహా పెద్దగా ఎవరూ రాణించలేకపోతున్నారు. దాంతో చావోరేవో తేల్చుకోవాల్సిన మూడో టీ20 కాస్త కంగారుపెడుతోంది.
కీలకమైన సమయంలో భారత బౌలర్లు పరుగులు ధారాళంగా ఇవ్వడం అటు బ్యాటర్లు వరుసగా పెవిలియన్ బాట పట్టడం భారత అభిమానులను ఆందోళనకు గురిచేస్తోంది. సిరీస్ విజేతను తేల్చే మూడో మ్యాచ్‌లోనైనా గత తప్పిదాలను పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత కెప్టెన్ హార్దిక్ పాండ్యపై ఉంది. స్వదేశంలో తొలి సిరీస్ నెగ్గాలన్న పాండ్యకు ఇది సవాల్ అనే చెప్పాలి. యువ ఆటగాళ్లు శుబ్‌మన్ గిల్, రాహుల్ త్రిపాఠి, ఇషాన్ కిషన్ తమకొచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోకపోతే మాత్రం జట్టులో స్థానం గల్లంతు కావడం తథ్యం. టాప్ ఆర్డర్ కుదురుకోవడంతో పాటు బౌలర్లు శక్తిమేరకు పోరాడితేనే భారత్ సిరీస్ గెలుచుకునే అవకాశం ఉంటుంది.
ఇప్పటికే చెరో మ్యాచ్ గెలుచుకొని సమంగా ఉన్న భారత్, శ్రీలంకలు లాస్ట్ ఫైట్‌కు సిద్ధమయ్యాయి. కొన్ని గంటల్లో మూడో టీ 20 జరగనుంది. రెండో టీ20లో విజయంతో రెట్టించిన ఉత్సాహంతో ఉన్న లంక ఆటగాళ్లు సిరీస్‌ను నెగ్గాలనే పట్టుదలతో ఉండగా అడ్డుకట్ట వేసి కప్ గెలుచుకోవాలనే కసితో హార్థిక్ సేన బరిలోకి దిగుతోంది. రాజ్ కోట్ పిచ్ కూడా బ్యాటింగ్‌కే అనుకూలమని క్రికెట్ విశ్లేషకులు చెబుతున్న వేళ టాస్ కీలకం కానుంది. టాస్ నెగ్గిన జట్టు తొలుత బౌలింగ్ ఎంచుకొనేందుకు అవకాశం ఉంది. శ్రీలంక తుది జట్టులోనూ పెద్దగా మార్పులు ఉండే అవకాశం లేదు. అయితే భారత్ గిల్ స్థానంలో రుతురాజ్ గైక్వాడ్‌ను ఆడించే అవకాశముంది.