బంగ్లాపై విక్టరీతో టాప్‌-2లోకి భారత్

By KTV Telugu On 18 December, 2022
image

బంగ్లాదేశ్‌పై వన్డే సిరీస్ కోల్పోయిన టీమిండియా టెస్ట్ సిరీస్‌లో సత్తా చాటుతోంది. సమిష్టిపోరాటంతో రాహుల్ సేన తొలి టెస్టును గెలుచుకుంది. బంగ్లాపై 188 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. టీమ్‌ఇండియా నిర్దేశించిన 513 పరుగుల లక్ష్య ఛేదనలో బంగ్లాదేశ్‌ 324 పరుగులకు ఆలౌటైంది. ఐదో రోజు ఆట ప్రారంభమైన 50 నిమిషాల్లోపే బంగ్లాదేశ్‌ కేవలం 52 పరుగులే చేసి చివరి నాలుగు వికెట్లను కోల్పోయి ఓటమిపాలైంది. రెండు ఇన్నింగ్స్‌లలో 8 వికెట్‌లు పడగొట్టిన కుల్‌దీప్‌ యాదవ్‌కి ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్ అవార్డు దక్కింది.

తొలి ఇన్నింగ్సులో భారత్ 404 పరుగులు చేయగా బంగ్లాదేశ్ 150 పరుగులకే ఆలౌట్ అయింది. అనంతరం రెండో ఇన్నింగ్సును టీమిండియా 258/2 కు డిక్లేర్ చేసింది. దీంతో భారీ టార్గెట్‌తో సెకండ్ ఇన్నింగ్స్‌ ఆరంభించిన బంగ్లా 324కు ఆలౌటైంది. టీమిండియా బౌలర్లలో అక్షర్ పటేల్ 4, కుల్దీప్ యాదవ్ 3, మొహమ్మద్ సిరాజ్, ఉమేశ్ యాదవ్, రవిచంద్రన్ అశ్విన్ ఒక్కో వికెట్ చొప్పున తీశారు. రెండు టెస్టు మ్యాచుల సిరీస్ లో టీమిండియా 1-0 తేడాతో ఆధిక్యంలో ఉంది. రెండో టెస్టు ఈ నెల 22 నుంచి జరగనుంది.

గాయం కారణంగా రోహిత్ శర్మ తప్పుకోవడంతో కేఎల్ రాహుల్ జట్టుకు నాయకత్వం వహిస్తున్నాడు. టెస్ట్ సిరీస్‌లో తొలి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. కేఎల్ రాహుల్ నాయకత్వంలో అఫ్ఘానిస్థాన్‌పై టీ20 సిరీస్, జింబాబ్వేలో వన్డే సిరీస్‌ను భారత్ గెలుచుకుంది. మూడు ఫార్మాట్లలోనూ భారత్‌ను గెలిపించిన కెప్టెన్‌గా నిలిచాడు. గతంలో వీరేంద్ర సెహ్వాగ్, ధోనీ, విరాట్ కోహ్లీ, అజింక్య రహానె ఈ ఫీట్ నమోదు చేశారు.

బంగ్లాదేశ్‌పై భారీ విజయంతో టీమిండియా ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో ఫైనల్‌ ఆశలు సజీవంగా నిలిచాయి. డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో నాలుగో స్థానం నుంచి టాప్‌-2లోకి దూసుకువచ్చింది భారత్. ఆస్ట్రేలియా 75శాతంతో ఫస్ట్ ప్లేస్‌లో ఉంది. అయితే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో భారత్ ఫైనల్‌ చేరడం అంత సులువుగా కనిపించడం లేదు. టీమిండియా 5 మ్యాచ్‌ల్లో కనీసం 4 గెలవాలి. బంగ్లాపై రెండో టెస్ట్ గెలవడంతో పాటు ఆ తర్వాత స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరగనున్న 4 టెస్టుల సిరీస్‌లో మూడు విజయాలు సాధించాలి.