మళ్లీ భారత్, పాక్‌ల మధ్య ఫైట్

By KTV Telugu On 5 January, 2023
image

భారత్, పాక్‌ల మధ్య ఎలాంటి ద్వైపాక్షిక సిరీస్‌లు లేవు. అయినా అభిమానులు నిరుత్సాహపడాల్సిన పనిలేదు. ఆ రెండు జట్ల మధ్య మ్యాచ్‌ను చూసే అవకాశం అభిమానులకు పలుమార్లు వస్తూనే ఉంది. వన్డే వరల్డ్ కప్‌కు ముందు జరగనున్న ఆసియా కప్‌లో దాయాది జట్లు తలపబోతున్నాయి. ఈ ఏడాది జరగనున్న ఆసియా కప్‌కు సంబంధించిన అప్ డేట్ వచ్చింది. భారత్ పాకిస్థాన్ రెండు జట్లు ఒకే గ్రూప్‌లో ఉన్నాయి. గతేడాది టీ20 ఫార్మాట్‌లో జరిగిన ఆసియా కప్‌ పోటీలు జరగగా ఈసారి మాత్రం వన్డే ఫార్మాట్‌లో ఏసీసీ నిర్వహించనుంది. సెప్టెంబర్‌లో ఈ టోర్నీ జరగనుంది. 2023, 2024 మధ్య జరిగే టోర్నమెంట్ల క్రికెట్ క్యాలెండర్‌ను ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడు జై షా విడుదల చేశారు.

ఆసియా కప్‌లో రెండు గ్రూపుల నుంచి ఆరుజట్లు తలపడనున్నాయి. ఓ గ్రూపులో భారత్, పాక్‌తోపాటు క్వాలిఫైయర్ 1 జట్టు ఉంటుంది. మరో గ్రూప్‌లో శ్రీలంక, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్థాన్‌లు ఉన్నాయి. ఇందులో మొత్తం 13 మ్యాచ్‌లు జరగనున్నాయి. మ్యాచ్‌లకు సంబంధించిన షెడ్యూల్‌ను ప్రకటించలేదు. ఈసారి ఆసియా కప్‌కు పాకిస్తాన్ ఆతిథ్యం ఇవ్వాల్సి ఉంది. అయితే ఇరు దేశాల మధ్య నెలకొన్న రాజకీయ ఉద్రిక్తతల కారణంగా బీసీసీఐ అక్కడ ఆడేందుకు ఆసక్తి చూపడం లేదు. టోర్నీని తటస్థ వేదికలో నిర్వహించవచ్చని వార్తలు వచ్చాయి. అయితే దీనికి సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక సమాచారం వెల్లడి కాలేదు.

ఆసియా కప్‌ కోసం టీమిండియా పాకిస్థాన్‌కు వెళ్లేది లేదని జై షా ఇప్పటికే స్పష్టం చేశారు. దాంతో మొన్నటివరకు పీసీబీ చైర్మన్‌గా ఉన్న రమీజ్ రాజా బీసీసీఐ వైఖరిని వ్యతిరేకించారు. భారత్‌లో జరిగే వరల్డ్ కప్‌ను బహిష్కరిస్తానని కూడా ఆయన బెదిరించారు. అయితే పీసీబీలో అధికార బదలాయింపు తర్వాత రమీజ్ స్థానంలో నజం సేథీ రావడంతో ఇందులో కొంత సానుకూల పరిణామం కనిపించే అవకాశం ఉంది.

2023-2024 మధ్యలో భారత్ మొత్తం 145 వన్డేలు, టీ20 మ్యాచ్‌లు జరగనున్నాయి. 2023లో 75, 2024లో 70 మ్యాచ్‌లు జరుగుతాయి. ఇది కాకుండా, ఎమర్జింగ్ (అండర్ -23) ఆసియా కప్ కూడా క్యాలెండర్‌లోకి తిరిగి వచ్చింది. ఈ ఏడాది జూలైలో 50 ఓవర్ల ఫార్మాట్‌లో జరగనుంది. వచ్చే ఏడాది డిసెంబర్‌లో ఈ టోర్నీ టీ20 ఫార్మాట్‌లో జరగనుంది. ఈ ఏడాది జూన్‌లో జరగనున్న మహిళల ఎమర్జింగ్ ఆసియా కప్ టీ20 ఫార్మాట్‌లో ఉంటుంది. ఇందులో ఎనిమిది జట్లు పాల్గొంటాయి.