దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ మైదానం కుస్తీ క్రీడాకారుల ఆందోళనలతో అట్టుడుకుతోంది. రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాలో మహిళా రెజ్లర్స్ ను ట్రెయినింగ్ క్యాంపుల్లో కోచ్ లు లైంగిక వేధింపులకు గురి చేస్తున్నారన్న ఆరోపణలతో ఆందోళనకారులు ఉద్యమాన్ని ఉధృతం చేశారు. ఈ ఉద్యమానికి దేశంలోని ప్రముఖ రెజ్లర్స్ అంతా వచ్చి మద్దతు తెలిపారు. ఉద్యమ సెగ మరీ వేడిగా ఉండడంతో క్రీడా మంత్రిత్వ శాఖలో కదలిక వచ్చింది. రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ తక్షణమే రాజీనామా చేయాలని ఆందోళన కారులు డిమాండ్ చేస్తున్నారు. అసలీ ఉద్యమానికి బీజం ఎలా పడిందంటే.
కామన్ వెల్త్ గేమ్స్ లో కుస్తీలో భారత్ కు మూడు బంగారు పతకాలు సాధించి భారత ఖ్యాతిని రెట్టింపు చేసిన రెజ్లర్ వినేష్ ఫోగట్ కు కొద్ది రోజుల క్రితం కొందరు అమ్మాయిలు ఫోన్ చేశారు. రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లక్నోలో ఏర్పాటు చేసిన నేషనల్ క్యాంప్ లో తాము పాల్గొనాలంటేనే భయమేస్తోందని ఆ అమ్మాయిలు చెప్పుకుని బాధ పడ్డారు. నేషనల్ క్యాంప్ నుండే కాదు అసలు కుస్తీ క్రీడ నుండే తప్పుకోవాలని అనిపిస్తోందని తీవ్ర ఆక్రోశం వెళ్లగక్కారు. కోచ్ లు తరచుగా లైంగికంగా వేధిస్తున్నారని ఫిర్యాదు చేశారు. వారి గోడు విన్న ఫోగట్ దీన్ని ఇలా వదిలేయకూడదనుకున్నారు. రేపటి తరం రెజ్లర్స్ కు ధైర్యం చెప్పి కంగారు పడకండి దీనిపై పోరాడదాం అని భరోసా ఇచ్చారు. అన్నట్లుగానే మహోద్యమానికి రెడీ అయ్యారు.
వెంటనే భారత్ కు తనలాగే పతకాలు తెచ్చిన సీనియర్ రెజ్లర్స్ సాక్షి మాలిక్, భజరంగ్ తో సమాలోచనలు చేసిన ఫోగట్ ఎట్టి పరిస్థితుల్లోనూ ఫెడరేషన్ అధక్షుడు బ్రిజ్ భూషణ్ తో పాటు లైంగిక వేధింపులకు పాల్పడిన కోచ్ లలో ఏ ఒక్కరినీ కూడా వదిలి పెట్టకూడదని అందరినీ బోను ఎక్కించాల్సిందేనని నిర్ణయించుకున్నారు. ఆ వెంటనే రెజ్లర్స్ అన్షు మాలిక్, సోనమ్ మాలిక్ లు కూడా ఈ కోర్ గ్రూప్ తో చేరారు. నిజానికి గతంలో కూడా కొందరు వినేష్ కు ఫోను చేసి ఇదే రకమైన ఫిర్యాదు చేస్తే ఆమె వెంటనే రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఇపుడు మరోసారి అవే ఫిర్యాదులు రాకపోవడంతో లైంగిక వేధింపులకు పాల్పడే వారికి ఉన్నతాధికారుల అండదండలు ఉన్నాయని అనుమానించారు. ప్రత్యేకించి ఫెడరేషన్ బ్రిజ్ భూషణ్ కు ఈ వ్యవహారాలు తెలిసినా ఆయన ఎవరిపైనా ఎలాంటి చర్యలూ తీసుకోలేదని బాధిత రెజ్లర్స్ ఆరోపిస్తున్నారు. అందుకే బ్రిజ్ భూషణ్ పై చర్యల కోసం ఉద్యమాన్ని తీవ్రం చేశారు.
జంతర్ మంతర్ మైదానంలో ఆందోళనలు మిన్నంటడంతోనే లక్నోలో జరగాల్సిన నేషనల్ క్యాంప్ ను రద్దు చేసింది క్రీడా మంత్రిత్వ శాఖ. తాను ఫెడరేషన్ ప్రెసిడెంట్ ను పిలిచి మాట్లాడతానని ముందుగా ఆందోళను ఆపేయాలంటూ క్రీడా మంత్రి అనురాగ్ ఠాకూర్ విజ్ఞప్తి చేయగా రెజ్లర్స్ ససేమిరా అన్నారు. ముందుగా బ్రిజ్ భూషణ్ ను తప్పిస్తే గానీ ఉద్యమం ఆగదని తెగేసి చెప్పడంతో సెగ పెరిగింది. లైంగిక వేధింపులకు సంబంధించి సాక్ష్యాలున్నాయని ఉద్యమానికి నాయకత్వం వమిస్తోన్న వినేష్ ఫోగట్ అంటున్నారు. మొదటి రోజున సాక్ష్యాలతో సహా మాట్లాడ్డానికి ఇద్దరు అమ్మాయిలు వస్తే ఇపుడు ఆరేడు మందికి పైనే లైంగిక వేధింపులకు సంబంధించి సాక్ష్యాలు చూపించారని ఫోగట్ వివరించారు.
మహిళలను పూజించే సంప్రదాయం ఉన్న భారత్ లో భారత గౌరవాన్ని ఇనుమడింప చేయడానికి కష్టపడేందుకు ముందుకు వచ్చిన కూతుళ్లపై ఈ దారుణాలను క్షమించేది లేదంటున్నారు ఫోగట్. ఉద్యమం గంట గంటకీ ఉధృతం కావడం రాజధానిలోనే రచ్చ రచ్చ కావడంతో కేంద్ర ప్రభుత్వంలోనూ కదలిక వచ్చింది. క్రీడా మంత్రి అనురాగ్ ఠాకూర్ అయితే తప్పు చేసిన వారిని విడిచి పెట్టేది లేదనే అంటున్నారు. ఇక ఆరోపణలు ఎదుర్కొంటోన్న బ్రిజ్ భూషణ్ అయితే ఇదంతా రాజకీయ కుట్ర అంటున్నారు. అన్ని వివరాలనూ తాను మీడియా ముందు వెల్లడిస్తానన్నారు. బ్రిజ్ భూషణ్ చేత రాజీనామా చేయిస్తారా లేక జైలుకు పంపుతారా అన్నది ప్రభుత్వమే తేల్చుకోవాలని ఫోగట్ సవాల్ విసిరారు.
కేరళ, మహారాష్ట్ర తదితర రాష్ట్రాలకు చెందిన మహిళా కుస్తీ క్రీడాకారిణులు సైతం గతంలో తాము కూడా ఇలాంటి వేధింపులకు బాధితులమేనని చెబుతున్నారు. ఇక దీనిపై కేంద్రం ఏం చేస్తుందనేది చూడాలి.