సొంతగడ్డ మీద తమకు ఎదురులేదనుకుంటే పొరపాటే. శ్రీలంకతో జరిగిన తొలి టీ 20లో టీమిండియాకు ఆ విషయం అర్థమై ఉంటుంది. మ్యాచ్‌కు ముందు కెప్టెన్ హార్థిక పాండ్యా ఏమన్నారంటే ప్రత్యర్థి జట్టును జడిపించడానికి కొత్తగా చేయాల్సిందేమీ లేదన్నాడు. భారత్‌లో తమను ఢీకొడుతున్నారన్న విషయాన్ని గుర్తుచేసేలా ఆడతామని చెప్పుకొచ్చారు. కానీ లంకేయులే భారత్‌ను బెదరగొట్టేలా చేశారు. ముంబై మ్యాచ్‌లో పాండ్యా టీమ్‌ను కంగారెత్తించారు. కొత్త ఏడాదిలో ఘనంగా శుభారంభం చేస్తారనుకున్న టీమిండియాకు లంక ఆటగాళ్లు చుక్కలు చూపించారు. అటు బంతితోనూ ఇటు బ్యాట్‌తోనూ ఓడించినంత పనిచేశారు.
అరంగేట్ర మ్యాచ్‌లోనే 4వికెట్లతో శివమ్ మావి అదరగొట్టాడు. మావితో పాటు భారత బౌలర్లు కట్టుదిట్టమైన బౌలింగ్ చేయడంతో 68 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది లంక. కానీ ఆ తర్వాత శనక చమికలు భారత్ బౌలర్లను బెంబేలెత్తించారు. 3బంతుల్లో 5 పరుగులు చేయాల్సిన దశలో అక్షరపటేల్ చాకచక్యంగా బౌలింగ్ చేయడంతో టీమిండియా 2పరుగుల తేడాతో విజయం సాధించింది. 3 టీ20ల సిరీస్‌లో తొలి మ్యాచ్ నెగ్గి 2023లో బోణీ కొట్టింది. అంతకుముందు దీపక్ హుడా, ఇషాన్, అక్షర్ పటేల్‌లు అద్భుత బ్యాటింగ్‌తో భారత్‌కు పోరాడే స్కోరునిచ్చారు. హార్థిక్ పాండ్యా పర్వాలేదనిపించాడు. మొత్తంగా యువ ఆటగాళ్లతో కూడిన జట్టు చివరివరకు ఉత్కంఠగా పోరాడి విజయాన్ని దక్కించుకుంది.
గత కొంతకాలంగా టీమిండియా ఆటగాళ్ల తీరు సెలక్షన్ కమిటీపై వస్తున్న విమర్శలతో జట్టు కూర్పు మారింది. యంగ్ టీమ్‌ను ఎంపిక చేసి లంకపై యుద్ధానికి పంపింది బీసీసీఐ. ఈ మ్యాచ్‌లో ఇషాన్, సంజూ శాంసన్ ఇద్దరినీ ఆడించడం విశేషం. ఇటీవల సిరీస్‌లలో సంజూశాంసన్‌ను పక్కనబెట్టి బీసీసీఐ అభిమానుల ఆగ్రహానికి గురయ్యింది. అయితే లంకతో సిరీస్‌లో ఇద్దరు వికెట్ కీపర్‌లను ఆడించి పెద్ద సాహసమే చేసింది. వచ్చిన అవకాశాన్ని శాంసన్ నిలబెట్టుకోలేకపోగా ఇషాన్ ఆకట్టుకున్నాడు. మిగిలిన మ్యాచ్‌లలో శాంసన్ నిరూపించుకోవాల్సి ఉంది. అయితే అతనికి మరో ఛాన్స్ వస్తుందా లేదా చూడాలి. ఇక మెరుపులు మెరిపిస్తాడనుకున్న మిస్టర్ 360 నిరాశపర్చాడు. నెట్ ప్రాక్టీస్‌లో భయపెట్టిన సూర్య లంకపై మ్యాచ్‌లో మాత్రం బంతులు మింగినా పరుగులు చేయలేకపోయాడు. అటు గిల్ కూడా నిరాశపర్చాడు.