టెస్టుల్లో మూడేళ్లుగా సెంచరీ లేక ఆపసోపాలు పడుతోన్న టీమిండియా స్టార్ బ్యాట్స్ మెన్ రన్ మిషన్ కోహ్లీ ఎట్టకేలకు ఆ దాహం తీర్చుకున్నాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న నాలుగో టెస్టులో ఆస్ట్రేలియాపై శతకం బాది బరువు దింపేసుకున్నాడు. వన్డేలు టీ20ల్లో ఫామ్‌లోకి వచ్చి శతకాల మీద శతకాలు కొడుతున్న కోహ్లీ టెస్టుల్లో మాత్రం మూడంకెల స్కోరు చేయడానికి చాలా టైమ్ తీసుకున్నాడు. 2019 నవంబర్ 22న చివరగా బంగ్లాదేశ్‌పై టెస్టులో సెంచరీ నమోదు చేశాడు. ఆ తర్వాత మరో శతకం సాధించడానికి దాదాపు 1200 రోజుల సమయం పట్టింది. దీని కోసం 41 టెస్టు ఇన్నింగ్స్ ఆడాడు కోహ్లీ. విరాట్‌కిది 28వ టెస్టు శతకం కాగా అన్ని ఫార్మాట్లు కలిసి మొత్తంగా 75సెంచరీలు చేశాడు.
బోర్డర్- గవాస్కర్ ట్రోఫీ-2023 సిరీస్‌లో తొలి మూడు టెస్టుల్లో కోహ్లి ఆశించిన మేర రాణించలేకపోయాడు. ఆసీస్‌పై విరాట్‌కి మెరుగైన రికార్డు ఉన్నప్పటికీ తన స్థాయికి తగ్గ ప్రదర్శన మాత్రం చేయలేకపోయాడు. నాగ్‌పూర్ టెస్టులో 12 పరుగులు మాత్రమే చేసి నిరాశపరిచిన అతడు ఢిల్లీ మ్యాచ్‌లో 64 పరుగులతో రాణించాడు. ఇండోర్‌లో 35 పరుగులు మాత్రమే చేసి ఉసూరుమనిపించాడు. ప్రపంచ టెస్టు చాంపియన్ షిప్ ఫైనల్ చేరేందుకు కీలకంగా మారిన ఆఖరి మ్యాచ్‌లో శతకం సాధించి తానేంటో నిరూపించుకున్నాడు. విరాట్ కోహ్లీ తన కెరీర్‌లో ఎక్కువ బంతులను ఎదుర్కొని సెంచరీ సాధించడం ఇది రెండోసారి. ఇప్పుడు ఆసీస్‌పై 241 బంతుల్లో శతకం చేయగా గతంలో ఇంగ్లాండ్‌పై 289 బంతులను తీసుకున్నాడు.
2015 నుంచి 2019 మధ్య కోహ్లీ తన కెరీర్ లోనే అత్యుత్తమ ఫామ్ కనబర్చాడు. ఆ సమయంలో ప్రతి మ్యాచ్ లోనూ సెంచరీ చేసేలా కనిపించాడు. అయితే 2020 నుంచి కోహ్లీ ఆట ఒక్కసారిగా మారిపోయింది. శతకాలకు బ్రేకులు పడ్డాయి. దాంతో అతడిని టీమిండియా నుంచి తప్పించాలనే డిమాండ్లు వెల్లువెత్తాయి. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో గతేడాది నుంచి ఫామ్ అందుకున్న కోహ్లీ టెస్టుల్లోనూ తనపై ఉన్న ఫెయిల్యూర్ ముద్రను తాజా సెంచరీతో చెరిపేసుకున్నాడు. విమర్శకులందరికీ తన బ్యాట్ తోనే జవాబు చెప్పాడు. అహ్మదాబాద్ టెస్టులో సెంచరీతో అభిమానులు కాలర్ ఎగరేసేలా చేశాడు.