టీ20ల్లో హీరో అనిపించుకున్న మిస్టర్ 360. వన్డేల్లో మాత్రం జీరో అవుతున్నాడు. వన్డే ఫార్మాట్లోనూ సూర్య మ్యాజిక్ చేసేస్తాడని ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకునన్నారు. కానీ అభిమానులు తనపై పెట్టుకున్న ఆశలను సూర్యకుమార్ యాదవ్ వమ్ము చేస్తున్నాడు. పొట్టి ఫార్మాట్లో రాణించినంతగా స్కై ఇతర ఫార్మాట్లలో కుదురుకోలేకపోతున్నాడు. కేవలం ఆరు నెలల్లోనే టీ20ల్లో మూడు సెంచరీలు బాదిన అతను వన్డేల్లో మాత్రం ఇప్పటి వరకు హాఫ్ సెంచరీ కూడా చేయలేదు. తాజాగా కివీస్‌తో జరిగిన తొలి వన్డేలో మరోసారి విఫలమయ్యాడు. దాంతో టీ20లకు తప్ప మరే ఫార్మాట్‌కూ సూర్య పనికిరాడంటూ సూర్యపై విమర్శలు మొదలుపెట్టారు.
టి20 ప్రపంచకప్ తర్వాత న్యూజిలాండ్ తో జరిగిన మూడు వన్డేల సిరీస్ ఆడిన సూర్యకుమార్ యాదవ్ కేవలం 44 పరుగులు మాత్రమే చేశాడు. ఇటీవల శ్రీలంకతో జరిగిన మూడో వన్డేలో 4 పరుగులు చేసి అవుటయ్యాడు. ప్రస్తుతం కివీస్‌తో జరిగిన ఫస్ట్ వన్డేలోనూ నిరాశపర్చారు. ఈ ఏడాది భారత్ ఎక్కువగా వన్డే సిరీస్ లను ఆడనుంది. వన్డే ప్రపంచకప్‌కు ముందు ఆసియా కప్ కూడా ఉంది. ప్రపంచకప్ జట్టు కోసం సెలక్షన్ కమిటీ పలువురు ప్లేయర్లను కూడా పరిశీలించనుంది. ఈ క్రమంలో కివీస్ తో జరిగే వన్డే సిరీస్ సూర్యకుమార్ కు అగ్నిపరీక్ష వంటిది. ఈ సిరీస్‌లో అతడు రాణిస్తేనే వన్డేల్లో ఉండే అవకాశం ఉంది. విఫలం అయితే మాత్రం ప్రపంచకప్ జట్టులో అతడి స్థానంపై ప్రశ్నలు తలెత్తే అవకాశం ఉంది.
ఇప్పటికే 50ఓవర్ల క్రికెట్లో యువకులు తమ సత్తా చాటుతున్నారు. ఇషాన్ కిషన్, శుభ్‌మన్ గిల్లు తమకు అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. శ్రీలంకపై రెండు సెంచరీలు బాదిన గిల్ న్యూజిలాండ్‌పై ఫస్ట్ వన్డేలో ఏకంగా డబుల్ సెంచరీ బాది సెలెక్టర్లు, మాజీ క్రికెటర్ల దృష్టిని ఆకర్షించాడు. ఇదే ఫామ్‌ను కొనసాగిస్తే అతనికి వన్డే ప్రపంచకప్‌లో చోటు ఖాయం. ఇప్పటికే ఇషాన్ కూడా డబుల్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. జట్టులో పోటీ ఎక్కువగా ఉన్న ఈ సమయంలో సూర్య రాణిస్తే సరే. లేకుంటే మాత్రం చోటు గల్లంతే.