ఐపీఎల్ వేలం చరిత్రలో సరికొత్త రికార్డు నమోదైంది. కొచ్చి వేదికగా జరుగుతున్న మినీ వేలంలో ఇంగ్లండ్ స్టార్ ఆల్ రౌండర్ స్యామ్ కరణ్ హాట్ కేకులా అమ్ముడుపోయారు. రికార్డు ధర పలికాడు. పంజాబ్ కింగ్స్ అతడిని ఏకంగా రూ. 18.50 కోట్లకు సొంతం చేసుకుంది. ఐపీఎల్ వేలంలో ఇప్పటి వరకు అత్యధిక ధర పలికిన ప్లేయర్ గా స్యామ్ కరణ్ నిలిచాడు. గతంలో సౌతాఫ్రికా ఆల్ రౌండర్ క్రిస్ మోరిస్ రూ. 16.25 కోట్లకు రాజస్తాన్ రాయల్స్ సొంతం చేసుకుది. అయితే తాజాగా ఈ రికార్డును స్యామ్ కరణ్ బద్దలు కొట్టాడు.
ఆస్ట్రేలియాకు చెందిన కామెరూన్ గ్రీన్ పంట కూడా పండింది. అతని కోసం ముంబై, ఢిల్లీలు చివరి వరకు పోటీపడ్డాయి. ఎట్టకేలకు కెమెరూన్ గ్రీన్ ను రూ. 17.50 కోట్లకు ముంబై ఇండియన్స్ దక్కించుకుంది. ఇక ఇంగ్లండ్ టెస్టు కెప్టెన్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్‌ను రూ. 16.25 కోట్లకు చెన్నై సూపర్ కింగ్స్ సొంతం చేసుకుంది. వాస్తవానికి ఈ వేలంలో స్టోక్స్ అధిక ధర పలుకుతాడని అంతా భావించారు. ఇంగ్లండ్‌కు టీ 20 వరల్డ్ కప్ అందించాడు స్టోక్స్.
స్పెషలిస్టు బ్యాటర్ల లిస్టులో వేలంలోకి వచ్చిన హ్యారీ బ్రూక్ కోసం సన్ రైజర్స్ హైదరాబాద్ , రాజస్తాన్ రాయల్స్ జట్లు పోటీ పడ్డాయి. రూ.1.5 కోట్ల కనీస ధరతో వేలంలోకి వచ్చిన అతడి కోసం తొలి బిడ్ ను రాజస్తాన్ రాయల్స్ పాడింది. అనంతరం రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కూడా రంగంలోకి దిగింది. రూ. 5 కోట్లకు చేరుకున్న తర్వాత ఆర్సీబీ తప్పుకుంది. ఇక్కడ ఎంటర్ ఇచ్చిన సన్ రైజర్స్ హైదరాబాద్ దూకుడు కనబర్చింది. చూస్తుండగానే వేలం రూ. 10 కోట్లు దాటేసింది. 13.25 కోట్లకు చేరుకున్న తర్వాత రాజస్తాన్ రాయల్స్ తప్పుకుంది. దాంతో చివరకు 13.25 కోట్లకు సన్ రైజర్స్ సొంతం చేసుకుంది. బ్రూక్స్ ఈ మధ్య కాలంలో సూపర్ ఫామ్ లో ఉన్నాడు. టి20 ప్రపంచకప్ మంచి ప్రదర్శన ఇచ్చిన అతను ఇటీవల పాకిస్తాన్ తో జరిగిన టెస్టు సిరీస్ లో మూడు సెంచరీలతో రెచ్చిపోయాడు.
ఐపీఎల్ 2023 వేలంలో కేన్ విలియమ్సన్‌ను గుజరాత్ టైటాన్స్ రూ.2 కోట్లకు దక్కించుకుంది. సన్‌రైజర్స్ కెప్టెన్‌గా పని చేసిన కేన్‌ను గుజరాత్ బేస్ ప్రైజ్‌కే సొంతం చేసుకుంది. ఐపీఎల్ 2022 వేలానికి ముందు సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫస్ట్ ఆప్షన్‌గా రూ.16 కోట్లకు విలియమ్సన్‌ను రిటైన్ చేసుకుంది. కానీ గత సీజన్లో విలియమ్సన్ పేలవ ప్రదర్శన చేశాడు. సన్‌రైజర్స్ సైతం ప్లేఆఫ్స్ చేరకుండా నిరాశపర్చింది. దీంతో తమ కెప్టెన్‌ను సన్‌రైజర్స్ రిలీజ్ చేసింది. ఐపీఎల్ 2022 సీజన్ లో పంజాబ్ కింగ్స్ కు కెప్టెన్ గా ఉన్న మయాంక్ అగర్వాల్ ను రూ. 8.25 కోట్లకు సన్ రైజర్స్ సొంతం చేసుకుంది.
అజింక్యా రహానే ను రూ. 50 లక్షలకు చెన్నై సూపర్ కింగ్స్ సొంతం చేసుకుంది. జో రూట్ అన్ సోల్డ్ గా నిలిచాడు. సౌతాఫ్రికా స్టార్ బ్యాటర్ రైలీ రోసోను కూడా ఎవరూ కొనుగోలు చేయలేదు. ఇది షాకింగ్ లాంటి విషయం. సౌతాఫ్రికా తరఫున టి20 ఫార్మాట్ లో రోసో ఈ మధ్య కాలంలో అద్భుతంగా ఆడాడు. అయినప్పటికీ అతడిని కొనుగోలు చేయడంలో ఎవరూ కూడాఆసక్తి చూపలేదు.