2023లో టీమిండియా ఆటగాళ్లు అదరగొడుతున్నారు. భారత యువ బ్యాట్స్ మెన్ శుభ్ మన్ గిల్ హైదరాబాద్ వన్డేలో అదరగొట్టాడు. తోటి ఆటగాళ్లంతా వరుసగా పెవిలియన్ బాట పట్టినా తాను మాత్రం వికెట్ పారేసుకోకుండా సునామీ ఇన్నింగ్స్ ఆడాడు. ఇటీవల లంకపై రెండు శతకాలు బాది శభాష్ అనిపించుకున్న గిల్ న్యూజిలాండ్‌పై అంతకుమించి ఆడాడు. ఉప్పల్ వేదికగా జరుగుతున్న తొలి వన్డేలో కివీస్ బౌలర్లను చీల్చిచెండాడాడు . కేవలం 149 బంతుల్లోనే 208 పరుగులు చేసి కెరీర్లో తొలి డబుల్ సెంచరీ అందుకున్నాడు. అందులో 19 ఫోర్లు, 9 సిక్సర్లు ఉండడం విశేషం.
87 బంతుల్లో 14 ఫోర్లు, 2 సిక్స్‌లతో సెంచరీ పూర్తి చేసుకున్న గిల్ ఆ తర్వాత మరింతగా దూకుడు పెంచాడు. 145 బంతుల్లోనే అతను రెండొందలు సాధించాడు. ఫెర్గూసన్ బౌలింగ్‌లో వరుసగా హ్యాట్రిక్ సిక్స్‌లు బాది ఉప్పల్ స్టేడియాన్ని హోరెత్తించాడు. గిల్ డబుల్ సెంచరీ చేసిన సమయంలో స్టేడియం మొత్తం మార్మోగిపోయింది. అంతేకాదు అద్భుత ఫామ్ కొనసాగిస్తున్న గిల్ వన్డేల్లో తొలి మైలురాయి అందుకున్నాడు. వన్డేల్లో వెయ్యి పరుగులు పూర్తి చేసుకున్నాడు. 19 ఇన్నింగ్స్‌ల్లోనే అతను ఈ మార్క్ అందుకోవడం విశేషం.
ఇటీవల శ్రీలంకతో జరిగిన మూడు వన్డేల సిరీస్‌లోనూ గిల్ రెండు సెంచరీలు చేశాడు. తొలి వన్డేలో మూడో వన్డేలో వంద కొట్టి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. గతేడాది వన్డేల్లో అద్భుత ఫామ్ కొనసాగించిన అతను ఓపెనర్‌గా స్థానం సుస్థిరం చేసుకుంటున్నాడు. ఓపెనర్ స్థానానికి ఇషాన్ కిషన్ కేఎల్ రాహుల్ నుంచి పోటీ ఉండడంతో ఈ యంగ్‌స్టర్ వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నాడు. ఈ ఏడాది వన్డే వరల్డ్ కప్ స్వదేశంలో జరగనుంది. వరుస సెంచరీలు సాధిస్తున్న గిల్‌కు వరల్డ్ కప్ జట్టులో చోటు ఖాయం అంటున్నారు మాజీ క్రికెటర్లు.