టీ20, వన్డేల్లో టీమిండియానే రారాజు

By KTV Telugu On 25 January, 2023
image

శ్రీలంక, న్యూజిలాండ్ సిరీస్ ఏదైనా చితక్కొట్టేస్తున్నారు మనోళ్లు. 2023ను ఘనంగా ఆరంభించిన టీమిండియా సరిలేరు తమకెవ్వరూ అంటూ దూసుకుపోతోంది. ఇప్పటికే టీ 20ల్లో నంబరవన్‌గా ఉన్న భారత క్రికెట్ జట్టు వన్డేల్లోనూ టాప్ ప్లేస్‌లో నిలిచింది. లంక, కివీస్‌లపై సిరీస్‌లు క్లీన్ స్వీప్ చేసుకొని రారాజుగా నిలిచింది. కివీస్‌పై వన్డే సిరీస్‌ను 3-0 తేడాతో కైవసం చేసుకున్న టీమ్‌ఇండియా వన్డే ర్యాంకింగ్స్‌లో ప్రపంచ ఛాంపియన్‌గా ఉన్న ఇంగ్లాండ్‌ని వెనక్కినెట్టి నంబర్‌ వన్ ర్యాంకును సొంతం చేసుకుంది. ఇక టెస్టుల్లోనూ నంబర్ వన్ చేరుకునేందుకు అడుగు దూరంలో ఉంది. త్వరలో ఆస్ట్రేలియాతో జరగనున్న నాలుగు టెస్టుల సిరీస్‌ని 2-0 అంతకంటే మెరుగ్గా గెలిస్తే మూడు ఫార్మాట్లలోనూ టీమ్‌ఇండియా నంబర్ వన్‌గా నిలుస్తుంది.

ఇటీవల శ్రీలంక న్యూజిలాండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌ల్లో సత్తా చాటిన టీమ్‌ఇండియా యువ పేసర్ మహమ్మద్ సిరాజ్‌ ర్యాంకింగ్స్‌లో నంబర్‌ వన్‌ ర్యాంకును అందుకున్నాడు. ఈ రెండు సిరీసుల్లో మొత్తం 9 వికెట్లు పడగొట్టాడు సిరాజ్. ట్రెంట్‌ బౌల్ట్‌, హేజిల్‌వుడ్ లాంటి ఆటగాళ్లను వెనక్కినెట్టి అగ్రస్థానంలో నిలిచాడు. 729 రేటింగ్‌ పాయింట్లతో సిరాజ్‌ తొలి స్థానంలో ఉండగా ఆస్ట్రేలియా పేసర్‌ హేజిల్‌ వుడ్ 727 రేటింగ్‌ పాయింట్లతో రెండో స్థానంలో న్యూజిలాండ్‌ బౌలర్‌ ట్రెంట్‌ బౌల్ట్ 708 రేటింగ్‌ పాయింట్లతో మూడో స్థానంలో నిలిచారు. బ్యాటింగ్‌ విభాగంలో టాప్‌-10లో టీమ్‌ఇండియా నుంచి ముగ్గురు ఆటగాళ్లున్నారు. కివీస్‌పై తొలి వన్డేలో డబుల్‌ సెంచరీ మూడో వన్డేలో సెంచరీ బాదిన శుభ్‌మన్‌ గిల్ ఏకంగా 20 స్థానాలు ఎగబాకి టాప్‌ 10లోకి దూసుకొచ్చి ఆరో స్థానంలో నిలిచాడు. విరాట్ కోహ్లీ ఒక స్థానం దిగజారి ఏడో స్థానానికి పడిపోగా రోహిత్‌ శర్మ రెండు స్థానాలు మెరుగుపర్చుకుని ఎనిమిదో స్థానానికి చేరుకున్నాడు. ఈ విభాగంలో పాక్‌ బ్యాటర్‌ బాబర్‌ అజామ్‌ నంబర్‌ వన్‌గా ఉన్నాడు.

ఆస్ట్రేలియా సిరీస్‌ సహా మరిన్ని టోర్నీలకు ముందు కెప్టెన్ రోహిత్ శర్మ ఫామ్‌లోకి రావడం శుభపరిణామం. లంకపై చెలరేగిపోయిన విరాట్ కోహ్లీ కివీస్‌పై మాత్రం తేలిపోయాడు. అయితే గిల్ రూపంలో భారత్‌కు చక్కని ఓపెనర్ దొరికాడు. టీ 20ల్లో తిరుగులేని గణాంకాలు నమోదు చేసిన సూర్యకుమార్ యాదవ్ వన్డేల్లో మాత్రం విఫలమవుతున్నాడు. హార్థిక్ పాండ్యా పర్వేలేదనిపిస్తోన్న మరింతగా శ్రమించాల్సిన అవసరం ఉందంటున్నారు క్రీడా విశ్లేషకులు. బౌలింగ్ విభాగంలో కుల్దీప్, షమీ, సిరాజ్‌, శార్దూల్‌లు నిలదొక్కుకోవడం సంతోషదాయకం. అయితే డెత్ ఓవర్లలో టీమిండియా మరింతగా చెమటోడ్చాలి ఉంటుందనే మాట వినిపిస్తోంది. మొత్తంగా ఇదే ఫామ్‌ను కొనసాగిస్తూ ఆటగాళ్లు నిలకడగా రాణిస్తే రానున్న మెగా టోర్నీలను టీమిండియా గెలుచుకోవడం పెద్ద కష్టమేమీ కాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.