గ్రౌండ్‌లోకి దిగాక ఊపొస్తుంది. వికెట్ పడితే పెడబొబ్బలు పెడతాం. ఔట్ అయితే అసహనంతో బ్యాట్ నేలకేసి కొడతాం. క్రికెట్ ఆటంటే పడిచచ్చే అభిమానులున్నంతకాలం ఏదన్నా నడుస్తుంది. కానీ దేనికైనా ఓ హద్దంటూ ఉంటుంది. ఐపీఎల్ అనేదో ప్రపంచంలో ఓకొత్త ఫార్ములా. అన్ని దేశాల క్రీడాకారుల్ని మిక్సీలో వేసి తిప్పినట్లు ప్రతీ జట్టులో నానాజాతిసమితి కనిపిస్తోంది. తప్పేంలేదు. క్రీడాస్ఫూర్తిని చాటుకోడానికి మైదానంలో ఆటే ముఖ్యమని చెప్పడానికి ఇది కూడా ఓ మంచి మార్గమే. కానీ వేర్వేరు ఫ్రాంచైజీల్లో ఉన్నంతమాత్రాన అంతా టీమిండియా స్పిరిట్‌తో ఆడే క్రికెటర్లమని మరిచిపోతే ఎలా. బెంగళూరు లక్నో జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ఆ క్రీడాస్ఫూర్తి గాల్లో కలిసింది.
RCB, LSG జట్ల మధ్య మ్యాచ్ ముగిశాక విరాట్ కోహ్లి, లక్నో మెంటార్ గౌతమ్ గంభీర్ తన్నుకోవడం ఒక్కటే తక్కువ. వీళ్లిద్దరి మధ్య వాగ్వాదం చూసి అంతా ముక్కున వేలేసుకున్నారు. రెండు జట్ల ఆటగాళ్లు, సిబ్బంది అడ్డంపడకపోతే క్రికెట్‌కి కంటిన్యూగా రెజ్లింగ్ చూపించి ఉండేవాళ్లే. వేళ్లు చూపించుకుంటూ ఒకరిపైకి ఒకరు దూసుకుపోయారు కోహ్లి, గంభీర్. దీంతో ఇద్దరికీ భారీగానే జరిమానా పడింది. ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు బీసీసీఐ వీళ్లిద్దరికీ మ్యాచ్ ఫీజులో 100శాతం కోత విధించింది. ఏప్రిల్ 10న బెంగళూరు జట్టుని సొంతగడ్డపై లక్నో ఓడించింది. అప్పుడు స్టేడియంలో బెంగళూరు అభిమానుల వైపు చూస్తూ లక్నో మెంటార్ గంభీర్ నోరు మూసుకోమన్నట్లు సైగ చేశాడు. దాన్ని మనసులో పెట్టుకున్న విరాట్ కోహ్లి తాజా మ్యాచ్‌లో బెంగళూరు గెలుపు బాటలో సాగుతున్నపుడు రెచ్చిపోయాడు. కృనాల్ క్యాచ్‌ను అందుకున్నపుడు గంభీర్‌లా చేయకూడదని సూచిస్తూ ముద్దు పెడుతున్నటు సైగ చేయడమే కాక వికెట్ పడ్డ ప్రతిసారీ హడావుడిచేశాడు. మ్యాచ్ ముగిశాక కోహ్లి, గంభీర్ మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. వాస్తవానికి పదేళ్లనుంచీ వీళ్లిద్దరి మధ్య మనస్పర్థలు ఉన్నాయి. అవి గ్రౌండ్‌లో ఇలా బయటపడ్డాయి.
కోహ్లి, గంభీర్ గొడవకుముందే గ్రౌండ్‌లో కొన్ని కవ్వింపు చర్యలు జరిగాయి. ఛేజింగ్‌లో లక్నో 76 పరుగులకే 8 వికెట్లు కోల్పోయింది. ఆ సమయంలో క్రీజ్‌లోకొచ్చిన నవీన్ ఉల్ హక్‌ని సిరాజ్ కవ్వించే ప్రయత్నం చేశాడు. నవీన్ దీనికి స్పందించటంతో కోహ్లీ ఆవేశంగా అతని వైపు దూసుకొచ్చాడు. అంపైర్ జోక్యం చేసుకున్నా నవీన్ ఉల్‌హక్-కోహ్లీ గొడవ ఆగలేదు. మ్యాచ్ మొదలైనప్పటినుంచీ వికెట్ పడ్డ ప్రతిసారీ కోహ్లీ హంగామా అంతా ఇంతా కాదు. రెండు జట్ల ఆటగాళ్లు మ్యాచ్ ముగిశాక కరచాలనం చేసుకునే సమయంలో కోహ్లి-గంభీర్ అదుపు తప్పారు. ఇద్దరి గొడవని ప్రేక్షకులు లైవ్‌లో చూడటం ప్రపంచమంతా చర్చనీయాంశం కావటంతో బీసీసీఐ సీరియస్‌గా తీసుకుంది. కోహ్లీకి కోటీ 7 లక్షలు గౌతం గంభీర్‌కి 25లక్షల రూపాయల జరిమానా విధించింది. ఈ గొడవకు అసలు కారణమైన నవీన్ ఉల్ హక్‌కి మ్యాచ్ ఫీజులో 50శాతం అంటే లక్షా 79వేల రూపాయల ఫైన్ పడింది.
గంభీర్ కోహ్లీకి మొదట్నించీ ఒకరంటే ఒకరికి పడదు. సరిగ్గా పదేళ్లక్రితం 2013 ఐపీఎల్ సీజన్‌లో కూడా ఇద్దరి మధ్య మాటామాటా పెరిగి కొట్టుకునేదాకా వెళ్లారు. కోహ్లీపై పదేపదే హాట్ కామెంట్స్ చేస్తూ ఉంటాడు గంభీర్. సీజన్-16లోనూ గంభీర్ కవ్వింపు చర్యలకు దిగాడు. ఏప్రిల్ 10 మ్యాచ్ తర్వాత ఇద్దరి మధ్య ఇంకాస్త గ్యాప్ పెరిగింది. గ్రౌండ్‌దాటి సోషల్‌మీడియాలో కామెంట్లు కౌంటర్లదాకా వెళ్లింది. ముందుగా కోహ్లీ మనం విన్నదంతా ఒక అభిప్రాయం, వాస్తవం కా అని ఇన్‌స్టాలో స్టోరీ పెట్టాడు. నవీన్ ఉల్ హక్ కూడా ఎవరికి ఎలా జరగాలో అదే జరుగుతుంది అంటూ కోహ్లీకి కౌంటర్ ఇచ్చినట్లు ఇన్‌స్టాలో పెట్టిన వైరల్‌గా మారింది. తాజా గొడవమీద కూడా సోషల్ మీడియాలో ఇద్దరి ఫ్యాన్స్ మధ్య కామెంట్స్ నడుస్తున్నాయ్. పోటీలు పడి తెగ ట్రోల్స్ చేస్తున్నారు. క్రీడాస్ఫూర్తి అనే పదానికి మన క్రికెటర్లు అర్ధాన్నే మార్చేస్తుంటే ఫ్యాన్స్ ఇంకాస్త మంటపెట్టే పన్లో ఉన్నారు.