గిల్ మరో కోహ్లీ అవుతాడా?

By KTV Telugu On 4 February, 2023
image

యంగ్ క్రికెటర్ శుభ్‌మన్ గిల్ టీమిండియా భవిష్యత్తు ఆశాకిరణంలా కనిపిస్తున్నాడు. తనకు అందివచ్చిన ప్రతీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ స్టార్‌ ప్లేయర్‌గా దూసుకెళ్తున్నాడు. మూడు ఫార్మాట్లలోనూ (టెస్టు, వన్డే, టి20లు)సెంచరీలు బాదిన అయిదవ బ్యాటర్‌కు రికార్డు నెలకొల్పాడు. ఓపెనింగ్‌ స్థానంలో వస్తూ సెంచరీలతో దడ పుట్టిస్తున్న గిల్‌ రానున్న కాలంలో జట్టులో కీలక బ్యాటర్‌గా ఎదగడం ఖాయంగా కనిపిస్తోంది. వన్డేలకు మాత్రమే పనికొస్తాడని కామెంట్ చేసిన వారికి గిల్ తన బ్యాటుతోనే సమాధానం ఇచ్చాడు. కివీస్‌పై చివరి టీ20లో మెరుపు వేగంతో శతకం బాది ఆల్ టైమ్ పర్ఫార్మర్‌నని చాటిచెప్పాడు. ఈ క్రమంలో విరాట్ కోహ్లీకి అతడే సరైన వారసుడంటూ అందరూ కితాబిస్తున్నారు. భవిష్యత్‌లో కోహ్లీ రికార్డుల్ని తిరగరాస్తాడంటూ కొనియాడుతున్నారు.

సచిన్ టెండూల్కర్ టీమిండియాలో తిరుగులేని స్టార్ డమ్ సంపాదించుకున్నారు. ఆ తర్వాత ఆ రేంజ్‌లో బ్యాటు ఝులిపించి బీభత్సమైన క్రేజ్ దక్కించుకున్నాడు విరాట్ కోహ్లీ. సచిన్ రికార్డులను అందుకోవడం ఎవరి తరం కాదనుకున్నారు. కానీ కోహ్లీ స్పీడ్‌గా దూసుకొచ్చారు. వన్డేల్లో సచిన్‌ రికార్డును కొన్నాళ్లలో బ్రేక్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం సూపర్ ఫామ్‌లో శతకాల మీద శతకాలు కొడుతున్న శుభ్ మన్ గిల్ ఆ ఇద్దరి తర్వాత ఆ స్థాయి ఆటగాడు అవుతాడని కొందరు కీర్తిస్తున్నారు. ప్రస్తుతం శుభమన్ గిల్ వయసు 23సంవత్సరాలు మాత్రమే. అతనికి బ్రెయిట్ ఫ్యూచర్ ఉంది. అయితే వరుసగా నాలుగు సెంచరీలు బాదినంత మాత్రాన సచిన్, కోహ్లీలతో పోల్చలేమని కొందరు అంటున్నారు. ఫామ్‌లో ఉంటేనే ఫ్యూచర్ స్టార్‌ అవుతారని లేకపోతే జట్టులో చోటు దక్కడం కూడా కష్టమవుతుందని కొందరు అంటున్నారు.

న్యూజిలాండ్‌తో వన్డేలో డబుల్ సెంచరీ మరో సెంచరీతో దంచికొట్టిన గిల్ అదే ఫామ్ ను టీ20 సిరీస్ లోనూ కొనసాగించాడు. అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో మెరుపు శతకంతో చెలరేగాడు. అజేయంగా 126 పరుగులు చేసిన గిల్ టీ20ల్లో భారత్ తరఫున అత్యధిక స్కోరు నమోదు చేశాడు. ఈ క్రమంలో విరాట్ కోహ్లీ (122 నాటౌట్) పేరిట ఉన్న రికార్డును బద్దలు కొట్టాడు. అంతేకాదు ఈ ఫార్మాట్ లో శతకం సాధించిన పిన్న వయస్కుడిగానూ రికార్డు సృష్టించాడు. గిల్ టీ 20లకు పనికిరాడన్న వారందరికీ తన బ్యాట్‌తో జవాబిచ్చాడు. గిల్ సునామీ ఇన్నింగ్స్‌తో టీ20ల్లో పరుగుల పరంగా భారత్ అతి పెద్ద విజయం సొంతం చేసుకుంది. ఈ సందర్భంగా విరాట్ కోహ్లీ గిల్‌పై ప్రశంసల వర్షం కురిపించాడు. గిల్‌ను భవిష్యత్‌ తార అంటూ ప్రశంసించాడు.