టెస్టుల్లో నం.1 బౌలర్‌గా అశ్విన్

By KTV Telugu On 2 March, 2023
image

టీమిండియా స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ టెస్టుల్లో నెంబర్ వన్ బౌలర్‌గా అవతరించాడు. ఐసీసీ ర్యాంకింగ్స్‌లో ఇప్పటివరకు అగ్రస్థానంలో ఉన్న ఇంగ్లండ్ వెటరన్ పేసర్ జేమ్స్ ఆండర్సన్‌ను వెనక్కి నెట్టేశాడు. టెస్ట్ బౌలర్స్ ర్యాంకింగ్స్ లో అశ్విన్ 864 పాయింట్లతో అగ్రస్థానంలో ఉండగా జేమ్స్ అండర్సన్ 859 పాయింట్లతో రెండో స్థానంలో ఉన్నాడు. సాంప్రదాయ టెస్టు క్రికెట్లో ప్రపంచ నంబర్ వన్ ర్యాంక్ సాధించిన భారత తొలి స్పిన్ బౌలర్ గా రవిచంద్రన్ అశ్విన్ ఘనత సాధించాడు. బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఢిల్లీ వేదికగా జరిగిన రెండోటెస్టులో 6 వికెట్లు పడగొట్టడం ద్వారా అశ్విన్ అరుదైన ఈ రికార్డును చేరుకోగలిగాడు. ఈ ట్రోఫీలో పెద్దగా ఆకట్టుకోని ఆస్ట్రేలియా బౌలర్ ప్యాట్ కమిన్స్ మూడో స్థానానికి పడిపోయాడు.

2023 సీజన్లో ఆడిన తొలి సిరీస్ మొదటి రెండుటెస్టుల్లోనూ అశ్విన్ 14 వికెట్లతో 16.79 సగటుతో అత్యుత్తమ బౌలర్ గా నిలిచాడు. గత రెండు సంవత్సరాల కాలంలో 14 టెస్టులు ఆడిన అశ్విన్ మొత్తం 62 వికెట్లు సాధించాడు. అంతర్జాతీయ క్రికెట్లో రెండేళ్ల కాలంలో అత్యధిక టెస్టు వికెట్లు పడగొట్టిన బౌలర్ గా అశ్విన్ నిలిచాడు. ఆస్ట్రేలియాతో సిరీస్‌లో తొలి రెండు టెస్టుల్లో అశ్విన్ అద్భుతంగా రాణించాడు. తన బంతితో కంగారులను బెంబేలెత్తించాడు. ఇప్పటి వరకు ఈ సిరీసులో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో జడేజా తర్వాత రెండో స్థానంలో నిలిచాడు. ఈ సిరీస్‌లో మిగిలిన రెండు టెస్టుల్లోనూ రాణిస్తే అశ్విన్ ర్యాంకింగ్ మరింత పదిలమవుతుంది.

40 ఏళ్ల వయసులో నంబర్ 1 ర్యాంక్‌ సాధించిన అరుదైన ఆటగాడిగా అశ్విన్ నిలిచాడు. 1936లో ఆస్ట్రేలియా ఆటగాడు క్లార్రీ గ్రిమ్మెట్ తర్వాత ఇంత పెద్ద వయసులో నంబర్ వన్ స్థానం దక్కించుకున్న ప్లేయర్‌గా అశ్విన్ మాత్రమే. అశ్విన్ తొలిసారి 2015లో టెస్ట్ బౌలర్స్ ర్యాంకింగ్స్ లో తొలి స్థానానికి వెళ్లాడు. అప్పటి నుంచి పలుమార్లు టాప్ పొజిషన్ కు వెళ్లాడు. ఐసీసీ టెస్టు బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా, పాకిస్తాన్ బౌలర్ షాహీన్ షా అఫ్రిదీ చెరొక స్థానం ఎగబాకి 4, 5 ర్యాంకుల్లో నిలిచారు. వీరిద్దరూ గతేడాది జులై నుంచి టెస్టు మ్యాచులేమీ ఆడకపోయినా ఈ స్థానాల్లో నిలవడం విశేషం. ఇక భారత లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా తన స్థానాన్ని మరింత మెరుగుపరచుకున్నాడు. ఢిల్లీ టెస్టులో 10 వికెట్లు పడగొట్టడం ద్వారా 8వ స్థానంలో ఉన్నాడు. ఇక టెస్టు ఆల్‌రౌండర్ల జాబితాలో జడేజా తొలి స్థానంలో ఉండగా అశ్విన్ రెండో స్థానంలో కొనసాగుతున్నాడు.