ప్రపంచక్రికెట్‌లో అగ్రస్థానంలో ఆటోడ్రైవర్ కొడుకు

By KTV Telugu On 26 January, 2023
image

హైదరాబాద్ గల్లీలో తన ఆటను ఆరంభించిన ఆ కుర్రాడు ఇప్పుడు ప్రపంచ నంబర్ వన్ బౌలర్. హైదరాబాదీ ఎక్స్ ప్రెస్, భారత స్టార్ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్ వన్డే క్రికెట్లో ప్రపంచ టాప్ ర్యాంక్ బౌలర్ గా నిలిచాడు. ఈ ఘనత సాధించిన తొలి హైదరాబాదీగా అరుదైన ఘనత సొంతం చేసుకొన్నాడు. అంకుఠిత దీక్ష, కఠోర శ్రమ వెరసి అంచెలంచెలుగా ఎదుగుతూ ప్రపంచ క్రికెట్‌లో నంబర్ వన్ బౌలర్‌గా నిలిచాడు. పేసర్ మహ్మద్ సిరాజ్ తొలిసారి కెరీర్‌లో నంబర్‌వన్‌ ర్యాంకును కైవసం చేసుకున్నాడు. బూమ్రా గాయం కారణంగా వెనుదిరగడంతో జట్టులోకి వచ్చిన సిరాజ్ వచ్చిన అవకాశాన్ని వందశాతం సద్వినియోగం చేసుకున్నాడు. జట్టు తనపై ఉంచిన నమ్మకాన్ని రెట్టింపు చేస్తూ మ్యాచ్‌ మ్యాచ్‌కు రాటుదేలుతూ ఏకంగా టాప్ ప్లేస్ కొట్టాడు.

ఐసీసీ ప్రకటించిన వన్డే ర్యాంకింగ్స్‌ జాబితాలో సిరాజ్‌ 729 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచాడు. ఆస్ట్రేలియా పేసర్‌ హేజిల్‌వుడ్‌ (727), న్యూజిలాండ్‌ పేసర్‌ ట్రెంట్‌ బౌల్ట్‌ (708)లను వెనక్కినెట్టి అతడు ఈ ఘనత సాధించాడు. ఏడాదిగా వన్డే క్రికెట్లో నిలకడగా రాణిస్తోన్న సిరాజ్‌ సొంతగడ్డపై శ్రీలంక, న్యూజిలాండ్‌లతో సిరీస్‌లలో అదరగొట్టాడు. శ్రీలంకతో జరిగిన వన్డే సిరీస్‌లో 9 వికెట్లు తీసిన సిరాజ్ ఐసీసీ ర్యాంకింగ్స్‌లో మూడో స్థానానికి ఎగబాకాడు. న్యూజిలాండ్‌తో ఆడింది రెండు వన్డేలే అయినప్పటికీ 5 వికెట్లు తీశాడు. ప్రపంచంలోనే నంబర్ వన్ బౌలర్‌గా రికార్డ్ క్రియేట్ చేశాడు. సిరాజ్ ఈ స్థాయికి చేరడం వెనుక ఎంతో కష్టం ఉంది. భారత బౌలింగ్ కోచ్ పరాస్ మాంబ్రే సాయంతో సిరాజ్‌ ఆటను మెరుగుపర్చుకున్నాడు. అదనపు శిక్షణ తీసుకొని తన ప్రదర్శనను మెరుగుపర్చుకున్నాడు.

2019లో వన్డే అరంగేట్రం చేశాక ఈ ఫార్మాట్లో రెండో మ్యాచ్‌ ఆడేందుకు మూడేళ్లు ఎదురు చూడాల్సి వచ్చింది. తొలి మ్యాచ్‌లో 10 ఓవర్లలో 76 పరుగులిచ్చి ఒక్క వికెట్‌ కూడా తీయలేక జట్టులో స్థానం నిలబెట్టుకోలేకపోయాడు. షమి, భువనేశ్వర్‌, బుమ్రా ప్రధాన పేసర్లుగా కొనసాగుతుండడం మధ్యలో కరోనా కారణంగా వన్డే జట్టుకు దూరమయ్యాడు. అయినా నిరుత్సాహపడలేదు. అందరూ ఆటో నడుపుకోవాలని ఎగతాళి చేసినా నవ్వుతూ స్వీకరించాడు. పేదరికం నుంచి వచ్చి తండ్రి ప్రోత్సాహంతో ఎదిగిన అతను మరోసారి శ్రమనే నమ్ముకున్నాడు. సాధనకు అధిక సమయం కేటాయించాడు. సరైన ప్రదేశాల్లో కచ్చితమైన లైన్‌తో బౌలింగ్‌ చేయడంపై పట్టు సాధించాడు. ఇన్‌స్వింగ్‌ ఔట్‌స్వింగ్‌ రాబట్టడంలో రాటుదేలాడు. ఇప్పుడు పరిపూర్ణ పేసర్‌గా ప్రశంసలు అందుకుంటున్నాడు.

హైదరాబాద్ పాతబస్తీకి చెందిన ఓ ఆటో డ్రైవర్ కొడుకు ప్రపంచ నంబర్ వన్ స్థానానికి చేరుకోవడాన్ని తెలుగుజాతి గర్విస్తోంది. బాల్యం నుంచి పేదరికంతో పోరాడటం ద్వారా రాటు దేలిన సిరాజ్ చురుకైన ఫాస్ట్ బౌలర్ గా రూపుదిద్దుకొన్నాడు. దేశవాళీ రంజీ క్రికెట్ నుంచి ఐపీఎల్ వరకూ నిలకడగా రాణించడం ద్వారా అంచెలంచెలుగా ఎదుగుతూ భారతజట్టులో చోటు సంపాదించాడు. క్రికెట్ మూడుఫార్మాట్లలోనూ సత్తా చాటుకొన్నా వన్డే ఫార్మాట్లో స్పెషలిస్ట్ బౌలర్ గా గుర్తింపు సంపాదించాడు.

టెస్టుల్లో మెరుగైన ప్రదర్శనతో గతేడాది ఫిబ్రవరిలో వన్డేల్లో పునరాగమనం చేశాడు. అప్పటి నుంచి ఆడిన 20 వన్డేల్లో 38 వికెట్లు పడగొట్టాడు. ఇటీవల శ్రీలంక, న్యూజిలాండ్‌తో సిరీస్‌లో అతని బౌలింగ్‌ చూస్తేనే ఎంతగా పురోగతి సాధించాడో అర్థమవుతోంది. వికెట్ల ఆకలితో కసిగా బంతులేస్తూ ప్రత్యర్థిని బోల్తా కొట్టిస్తున్నాడు. ఇప్పుడు కపిల్‌దేవ్‌, బుమ్రా తర్వాత వన్డేల్లో అగ్రస్థానానికి చేరుకున్న మూడో భారత పేసర్‌గా సిరాజ్‌ నిలిచాడు. 2022కి గాను ఐసీసీ పురుషుల వన్డే జట్టులోనూ చోటు దక్కించుకున్నాడు. తరచూ గాయాల కారణంగా బుమ్రా జట్టుకు దూరమవుతున్న వేళ, షమీలో నిలకడ లోపించిన సమయాన ఈ ఏడాది వన్డే ప్రపంచకప్‌ నేపథ్యంలో జట్టుకు ఇప్పుడు సిరాజ్‌ కీలకంగా మారాడు.

టీమిండియా విజయాల్లో కీలకంగా మారిన మహ్మద్ సిరాజ్‌పై భారత కెప్టెన్ రోహిత్ శర్మ ప్రశంసల వర్షం కురిపించాడు. సిరాజ్ అద్భుతంగా ఆడుతున్నాడన్న రోహిత్ జట్టు తన నుంచి ఏం ఆశిస్తుందనే విషయాన్ని అతడు చక్కగా అర్థం చేసుకుంటున్నాడన్నాడు. కొత్త బంతితో బౌలింగ్ చేస్తూ స్వింగ్ చేస్తున్న సిరాజ్ త్వరగా వికెట్లు పడగొడుతున్నాడని మధ్య ఓవర్లలోనూ అతడు వికెట్లు తీస్తున్నాడని అభినందించాడు. అతడిలో చక్కటి నైపుణ్యం ఉందన్న రోహిత్ ఆడే కొద్దీ అతడు మెరుగవుతున్నాడంటూ కితాబిచ్చాడు.