బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో టీమిండియా టాప్ ఆర్డర్ తేలిపోయింది. కోహ్లీ కొట్టలేకపోయాడు. అయ్యర్ ఆసిస్‌ను ఆడలేకపోయాడు. ఆకట్టుకుంటాడనుకున్న ఆంధ్రా కుర్రాడు అరంగేట్ర సిరీస్‌లో ఘోరంగా విఫలమయ్యాడు. మొదటి టెస్టులో మెరుపు సెంచరీతో రాణించిన కెప్టెన్ రోహిత్ శర్మ కూడా ఆ తర్వాత మ్యాచ్‌లలో తేలిపోయాడు. రాణించలేక రాహుల్ మూడో మ్యాచ్‌నుంచి తప్పించబడ్డాడు ఆల్‌రౌండర్లే అంతా తామై మొదటి రెండు టెస్టులను గెలిపించారు. లేకపోతే పరిస్థితి మరోలా ఉండేదని మూడో టెస్టులో టీమిండియా ఓటమిని చూసిన వారికి ఇట్టే అర్థమైపోతుంది. భారత గడ్డపై స్పిన్‌ను ఎదుర్కోవడం అంత ఆషామాషీ కాదని చాలా మంది బీరాలు పలికారు. ఇండోర్ టెస్టుకు ముందు చాలా మంది బడబడా స్టేట్మెంట్లు ఇచ్చారు. కానీ వారందరికీ షాక్ ఇచ్చే రిజల్ట్ వచ్చింది.
టీమిండియా ఫుల్‌టైం కెప్టెన్‌గా పగ్గాలు అందుకున్న తర్వాత టెస్టుల్లో రోహిత్ ఓటమని ఎరుగని సారథిగా పేరుగడించాడు. అంతేకాదు హోల్కర్ స్టేడియంలో భారత్‌కు ఓటమి లేదు. దానికితోడు ఈ మ్యాచ్ గెలిస్తే వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ బెర్తు ఖరారు అవుతుంది. వరుసగా రెండోసారి డబ్ల్యూటీసీ ఫైనల్లో అడుగు పెట్టొచ్చని ఎన్నో ఆలోచనలతో ఇండోర్‌లో అడుగు పెట్టింది భారత్. కానీ రోహిత్ సేనను కంగారులు ఖంగు తినిపించారు. ఏ స్పిన్‌తో అయితే తొలి రెడు టెస్టుల్లో ఆసిస్‌ను భారత్ మట్టికరిపించిందో అదే స్పిన్‌కు మూడో టెస్టులో మన బ్యాటర్లు మూల్యం చెల్లించుకున్నారు. స్పిన్ పిచ్‌పై పరుగులు చేయలేక తడబడ్డారు. కనీసం పోటీ కూడా ఇవ్వలేకపోయారు. ఫలితంగా మూడో టెస్టులో ఘన విజయం సాధించిన ఆస్ట్రేలియా డబ్ల్యూటీసీ ఫైనల్‌కు చేరింది.
ఇక రెండో స్థానంలో నిలిచిన భారత్‌కు శ్రీలంక నుంచి ముప్పు వాటిల్లేలా ఉంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఆసీస్ 68.52 పర్సేంటేజీతో అగ్రస్థానంలో ఉంది. ఆ తర్వాత టీమ్ఇండియా 60.29 శాతంతో రెండో స్థానంలో నిలిచింది. అయితే శ్రీలంక (53.33), దక్షిణాఫ్రికా (52.38) భారత్‌కు పోటీ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయి. మార్చి 9 నుంచి న్యూజిలాండ్ – శ్రీలంక జట్ల మధ్య రెండు టెస్టుల సిరీస్ ప్రారంభం కానుంది. ఇందులో శ్రీలంక విజయం సాధిస్తే మాత్రం భారత్ అవకాశాలు సంక్లిష్టంగా మారతాయి. ఒకవేళ ఆసీస్‌పై నాలుగో టెస్టులో టీమ్ఇండియా గెలిస్తే డబ్ల్యూటీసీ ఫైనల్ బెర్తు మనదే అవుతుంది. కివీస్‌పై లంక 2-0 తేడాతో టెస్టు సిరీస్‌ను గెలిచి టీమ్ ఇండియా నాలుగో టెస్టులో ఓడితే మాత్రం ఆశలు గల్లంతు అయినట్లే. అప్పుడు శ్రీలంక డబ్ల్యూటీసీ ఫైనల్‌కు చేరుతుంది.