తెలంగాణా నుంచి సోనియా పోటీ? – Congress

By KTV Telugu On 11 April, 2024
image

KTV TELUGU :-

ఏఐసిసి అధ్య‌క్షురాలు సోనియా గాంధీ రాయ్ బ‌రేలీ నియోజ‌క వ‌ర్గం ఖాళీ చేసిన సంగ‌తి తెలిసిందే.  ఆమె రాజ్య‌స‌భ‌కు ప్రాతినిథ్యం వ‌హిస్తార‌ని చెప్పిన పార్టీ వ‌ర్గాలు. తాజాగా  ఆమె తెలంగాణా నుండి లోక్ స‌భ ఎన్నిక‌ల బ‌రిలో దిగుతార‌ని వ‌దంతులు. మేడ‌మ్ సోనియాను తెలంగాణా నుండి పోటీ చేయాల్సిందిగా తెలంగాణా పిసిసి అధ్య‌క్షుడు ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి  విజ్ఞ‌ప్తి చేసిన‌ట్లు చెబుతున్నారు. దానికి ఆమె అవును కాదు అని చెప్ప‌కుండా దీనిపై స‌రైన స‌మ‌యంలో స‌రైన నిర్ణ‌యం తీసుకుంటాన‌న్నార‌ట‌.

ఏఐసిసి అగ్ర‌నాయ‌కురాలు సోనియా గాంధీని ఖ‌మ్మం లోక్ సభ నియోజ‌క వ‌ర్గం నుండి బ‌రిలో దింపాల‌ని తెలంగాణా కాంగ్రెస్ నేత‌లు భావిస్తున్నారు. గ‌తంలోనే ఈ మేర‌కు ప్ర‌చారం జ‌రిగింది కూడా. అయితే అప్ప‌ట్లో ఆమెరాజ్య‌స‌భ‌కే వెళ్తార‌ని  ప్ర‌చారం జ‌రిగింది. దానికోస‌మే ఆమె రాయ్ బ‌రేలీ నియోజ‌క వ‌ర్గాన్ని కూడా వ‌దులుకున్నారు. అయితే తెలంగాణా ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి మాత్రం సోనియాగాంధీని  తెలంగాణా నుండి పోటీచేయాల్సిందిగా తాజాగా మ‌రోసారి అడిగార‌ట‌. సోనియా గాంధీ పోటీ చేస్తే తెలంగాణాలో కాంగ్రెస్ శ్రేణుల్లో జోష్ పెరుగుతుంద‌ని తెలంగాణా కాంగ్రెస్ నేత‌ల భావ‌న‌.

ఒక వేళ సోనియా గాంధీ  తెలంగాణా నుండి బ‌రిలో నిల‌బ‌డ్డానికి స‌సేమిరా అంటే  అపుడు ఆమెకు ఇవ్వాల‌నుకున్న సీటుకు ప్ర‌త్యామ్నాయం చూడాలి. సోనియా కోస‌మే ఖ‌మ్మం లోక్ స‌భ నియోజ‌క వ‌ర్గాన్ని ఎవ‌రికీ  కేటాయించ‌కుండా  ఉంచారు కాంగ్రెస్ నేత‌లు. సోనియా పోటీ చేస్తానంటే పార్టీలో అంతా ఏక‌గ్రీవంగా ఆమెకు మ‌ద్ద‌తు తెలుపుతారు. ఒక వేళ ఆమె పోటీ చేయ‌నంటే మాత్రం  ఖ‌మ్మం సీటుపై క‌ర్చీఫ్ వేయ‌డానికి చాలా మంది రెడీగా ఉన్నారు. ఖ‌మ్మం లోక్ స‌భ నియోజ‌క వ‌ర్గం ప‌రిధిలోని అన్ని అసెంబ్లీ నియోజ‌క వ‌ర్గాల్లోనూ కాంగ్రెస్ ఘ‌న విజ‌యాలు సాధించింది. అందుకే ఈ సీటు హాట్ సీట్ అయ్యింది.

ఖ‌మ్మం ఎంపీ స్థానం కోసం  కాంగ్రెస్ లో ముగ్గురు కీల‌క నేత‌లు విశ్వ ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ఆ ముగ్గురూ కూడా త‌మ బంధువుల కోస‌మే  టికెట్ ఆశిస్తున్నారు. ఉప ముఖ్య‌మంత్రి మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క త‌న స‌తీమ‌ణిని  ఖ‌మ్మం లోక్ స‌భ స్థానం నుండి పోటీ చేయించాల‌ని ఆశిస్తున్నారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస‌రెడ్డి అయితే త‌న  సోద‌రుడు ప్ర‌సాద రెడ్డిని ఖ‌మ్మం నుంచి బ‌రిలో దింపాల‌ని అనుకుంటున్నారు.మ‌రో మంత్రి తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావు త‌న కుమారుడు యుగంధ‌ర్ కోసం ఈ సీటు అడుగుతున్నారు. అయితే వార‌సుల‌కు, బంధువుల‌కు  టికెట్ ఇవ్వ‌డానికి హై క‌మాండ్ సుముఖ‌త వ్య‌క్తం చేయ‌లేద‌ని స‌మాచారం.

ఈ ముగ్గురి బంధువుల‌కు  టికెట్ ఇచ్చే ప్ర‌స‌క్తి లేద‌ని తేల‌డంతో రేసులో కొత్త‌గా మ‌రో రెండు  పేర్లు తెర‌పైకి వ‌చ్చాయి. పొంగులేటి శ్రీనివాస‌రెడ్డి వియ్యంకుడు అయిన సురేందర్ రెడ్డి త‌న‌యుడు ర‌ఘురామి రెడ్డికి ఈ సీటు ఇవ్వాల‌ని పొంగులేటి శ్రీనివాస‌రెడ్డి ప‌ట్టుబ‌డుతున్నార‌ట‌. బి.ఆర్.ఎస్. కు గుడ్ బై చెప్పిన  పొంగులేటి శ్రీనివాస‌రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరేస‌మ‌యంలో ఖ‌మ్మం లోక్ స‌భ సీటు తాను సూచించిన వ్య‌క్తికే ఇవ్వాల‌ని ష‌ర‌తు పెట్టార‌ట‌. దానికి పార్టీ నాయ‌క‌త్వం కూడా ఒప్పుకుందని అంటున్నారు.

ఒక వేళ సురేంద‌ర్ రెడ్డికి ఇచ్చే ప‌రిస్థితులు లేక‌పోతే మాత్రం మాజీ మంత్రి నిజామాబాద్  నాయ‌కుడు మండ‌వ వెంక‌టేశ్వ‌ర‌రావు  పేరు వినిపిస్తోంది. మండ‌వ వెంక‌టేశ్వ‌ర‌రావు సామాజిక వ‌ర్గం ఓట్లు ఖ‌మ్మం లోక్ స‌భ నియోజ‌క వ‌ర్గంలో  ఎక్కువ సంఖ్య‌లో ఉన్నారు.  అందుకే ఆయ‌న పేరును రేవంత్  రెడ్డే  తెర‌పైకి తెచ్చార‌ని అంటున్నారు. మండ‌వ వెంక‌టేశ్వ‌ర‌రావు గ‌తంలో టిడిపి లో ఉన్న‌ప్పుడు రేవంత్ రెడ్డికి ప‌రిచ‌యం ఉంది. మొత్తం మీద ఖ‌మ్మం లోక్ స‌భ స్థానం  మ‌రి కొద్ది రోజుల పాటు వార్త‌ల్లో ఉంటుంది.

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి